Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖాయం
- రిపిఛేజ్ బౌట్లో కాంస్యం సొంతం
- వరల్డ్ నం.1, వరల్డ్ మెడలిస్ట్లపై విజయాలు
- రెజ్లింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్
నూర్ సుల్తాన్ : భారత రెజ్లింగ్ వర్థమాన స్టార్, టోక్యో ఒలింపిక్స్ మెడల్ రేసులో ముందు వరుసలో దూసుకుపోతున్న వినేశ్ ఫోగట్ కెరీర్లో తొలి ప్రపంచ చాంపియన్‌షిప్స్ పతకం పట్టేసింది. కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన వినేశ్ ఫోగట్.. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో మూడు సార్లు పోటీపడినా పతకం దక్కించుకోలేదు. ఈ ఏడాది వరల్డ్ చాంపియన్‌షిప్స్‌కు పసిడి ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వినేశ్ ఫోగట్ కాంస్య పతకం సాధించింది. అంతకముందు వినేశ్ ఫోగట్ భారత్‌కు అత్యంత కీలకమైన టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను సాధించి పెట్టింది. రెజ్లింగ్‌లో భారత్‌కు దక్కిన తొలి ఒలింపిక్ బెర్త్ ఇదే కావటం విశేషం.
నూర్ సుల్తాన్ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో తొలుత వినేశ్ ఫోగట్‌కు నిరాశ ఎదురైంది. క్వార్టర్స్‌కు ముందే ఓటమిపాలైంది. వినేశ్‌ను ఓడించిన రెజ్లర్, ఫైనల్స్‌కు చేరటంతో ఫోగట్‌కు రిపిఛేజ్ బౌట్లో తలపడే అవకాశం లభించింది. రిపిఛేజ్ బౌట్లో వినేశ్ ఫోగట్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. 53 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో వరల్డ్ నం.1 సారా అనా (అమెరికా)ను ఓడించి టోక్యో ఒలింపిక్స్ బెర్త్ సొంతం చేసుకుంది. కాంస్య పోరులో రెండు సార్లు వరల్డ్ చాంపియన్‌షిప్స్ మెడలిస్ట్, గ్రీస్ రెజ్లర్ మరియా ప్రొవలార్కిపై అలవోక విజయం సాధించింది. వరల్డ్ నం.1 సారాపై కండ్లుచెదిరే రక్షణాత్మక వ్యూహంతో ఆకట్టుకున్న వినేశ్ ఫోగట్.. మరియాపై తిరుగులేని ఎదురుదాడితో విజృంభించింది. నాల్గోసారి ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో తలపడిన వినేశ్ ఫోగట్‌కు ఇదే తొలి వరల్డ్ మెడల్. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పతకం సాధించిన నాల్గో భారత రెజ్లర్‌గా వినేశ్ నిలిచింది. వినేశ్ ఫోగట్ 2014, 2018 కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకాలు సాధించింది. 2014 ఆసియా క్రీడల్లో రజతం నెగ్గిన వినేశ్, 2018లో బంగారు పతకం గెల్చుకుంది. తాజాగా 2019 వరల్డ్ కాంస్యంతో టోక్యో ఒలింపిక్స్‌కు కొండంత ఆత్మ విశ్వాసంతో సిద్దం కానుంది.