Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ధనాధన్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ నమోదు
-చిన్నస్వామిలో సఫారీ ఘన విజయం
-1-1తో టీ20 సిరీస్ సమం
నవతెలంగాణ-బెంగళూర్ : నాయకుడు నడిపించాడు. నాయకుడు ఛేదించాడు. నాయకుడిగా తొలి విజయం సాధించాడు. దక్షిణాఫ్రికా యువ కెప్టెన్ క్వింటన్ డికాక్ (79 నాటౌట్, 52 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) సూపర్ ఇన్నింగ్స్‌తో చిన్నస్వామి టీ20లో సఫారీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. డికాక్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో 135 పరుగుల లక్ష్యం సఫారీ ముందు చిన్నబోయింది. తెంబ బవుమా (27 నాటౌట్), హెండ్రిక్స్ (28) రాణించారు. మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో 1-1తో భారత్, సఫారీ సమవుజ్జీలుగా నిలిచారు. పొట్టి సిరీస్ ట్రోఫీని పంచుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు సాధనలో విఫలమైంది. ఓపెనర్ శిఖర్ ధావన్ (36, 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ (9), విరాట్ కోహ్లి (9), శ్రేయాష్ అయ్యర్ (5), కృనాల్ పాండ్య (4) విఫలమయ్యారు. అజేయ అర్ధ సెంచరీ హీరో క్వింటన్ డికాక్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
ఎదురులేని డికాక్ : స్వల్ప ఛేదనలో సఫారీకి అదిరే ఆరంభం దక్కింది. ఓపెనర్లు డికాక్, హెండ్రిక్స్ (28) తొలి వికెట్‌కు 76 పరుగులు జోడించారు. విజయానికి తిరుగులేని పునాది వేశారు. మొహాలీలో అర్థ సెంచరీ బాదిన డికాక్, చిన్నస్వామిలో మరింత ధాటిగా విరుచుకుపడ్డాడు. ఐదు సిక్సర్లు, ఆరు ఫోర్లతో ధనాధన్ విధ్వంసం సృష్టించాడు. వరుసగా రెండో అర్థ సెంచరీ బాదిన డికాక్, ఈ సారి ఆఖరు వరకూ క్రీజులో నిలిచాడు. తెంబ బవుమా మరోసారి చక్కటి సహకారం అందించాడు. తొలి పది ఓవర్లలో వికెట్ పడగొట్టడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. చాహర్ ఓవర్లో ఓ రివ్యూ వృథా చేసుకున్న భారత్... డికాక్‌ను వాషింగ్టన్ సుందర్ ఎల్బీగా అవుట్ చేసేందుకు రివ్యూ కోరే అవకాశం కోల్పోయింది. డికాక్, బవుమా 16.5 ఓవర్లలో ఛేదన పూర్తి చేశారు.
ధావన్ ఒక్కడే : టాస్ నెగ్గిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలో వికెట్ ఫ్లాట్‌గా కనిపించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (9) రెండు ఫోర్లతో ధనాధన్ మొదలెట్టినా వికెట్ నిలుపుకోలేదు. హెండ్రిక్స్ బంతికి స్లిప్స్‌లో క్యాచౌట్ అయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి (9)తో కలిసిత శిఖర్ ధావన్ (36, 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. ధావన్, కోహ్లి ఇద్దరూ ఎదురుదాడి చేసేందుకు మొగ్గుచూపారు. కోహ్లి మిస్ ఫైర్ అయినా, శిఖర్ గన్ పేలింది. ఫెలుక్వయో ఓవర్లో వరుస ఫోర్లు బాదిన ధావన్.. తర్వాత స్పిన్నర్ షంషిపై విరుచుకుపడ్డాడు. లాంగ్ ఆఫ్‌లో సిక్సర్, లాంగ్ ఆన్‌లో సిక్సర్‌తో ఇన్నింగ్స్‌కు ఉత్సాహం తీసుకొచ్చాడు. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో దూకుడుగా ఆడిన ధావన్, షంషిపై మరో భారీ షాట్‌కు వెళ్లి వికెట్ కోల్పోయాడు. విరాట్ కోహ్లి బౌండరీ లైన్ వద్ద వికెట్ కోల్పోయాడు. ధావన్ తర్వాత మరో బ్యాట్స్‌మన్ నిలకడగా పరుగులు సాధించలేదు. యువ ఆటగాడు రిషబ్ పంత్ (19) ఓ ఫోర్, సిక్సర్‌తో మెరిసినా, మరోసారి షాట్ సెలక్షన్ తప్పిదంతో వికెట్ సమర్పించుకున్నాడు. ఫామ్‌లో ఉన్న శ్రేయాష్ అయ్యర్ (5) సైతం నిరాశపరిచాడు. సఫారీ బౌలర్లు మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులేసి, బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. లోతైన బ్యాటింగ్ లైనప్ కలిగినా, భారత్ భారీ స్కోరు సాధించలేదు. 18 బంతులాడిన హార్దిక్ పాండ్య 14 పరుగులే చేశాడు. 17 బంతుల్లో రవీంద్ర జడేజా 19 పరుగులు చేశాడు. జడేజా ఓ ఫోర్, సిక్సర్ సంధించాడు. కృనాల్ పాండ్య (4) విఫలమయ్యాడు. ఆఖరి ఓవర్లో వాషింగ్టన్ సుందర్ (4) బౌండరీతో భారత్ స్కోరు 130 దాటింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకుని భారీ స్కోరు సాధించాలనే లక్ష్యంతో కనిపించిన కోహ్లిసేన.. 20 ఓవర్ల తర్వాత 134 పరుగులకే పరిమితమైంది. సఫారీ సీమర్ కగిసో రబాడ (3/39), ఫోర్టెన్ (2/19) రాణించారు.
భారత్ ఇన్నింగ్స్ : ధావన్ (సి) బవుమా (బి) షంషి 36, రోహిత్ (సి) హెండ్రిక్స్ (బి) హెండ్రిక్స్ 9, కోహ్లి (సి) ఫెలుక్వయో (బి) రబాడ 9, పంత్ (సి) ఫెలుక్వయో (బి) ఫోర్టెన్ 19, అయ్యర్ (స్టంప్డ్) డికాక్ (బి) ఫోర్టెన్ 5, హార్దిక్ (సి) మిల్లర్ (బి) రబాడ 14, కృనాల్ (సి) డికాక్ (బి) హెండ్రిక్స్ 4, జడేజా (సి,బి) రబాడ 19, సుందర్ రనౌట్ 4, దీపక్ నాటౌట్ 0, సైని నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 15, మొత్తం : (20 ఓవర్లలో 9 వికెట్లకు) 134.
బౌలింగ్ : ఫోర్టెన్ 3-0-19-2, రబాడ 4-0-39-3, హెండ్రిక్స్ 4-0-14-2, ఫెలుక్వయో 4-0-28-0, షంషి 4-0-23-1, ప్రిటోరియస్ 1-0-8-0.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ : హెండ్రిక్స్ (సి) కోహ్లి (బి) హార్దిక్ 28, డికాక్ నాటౌట్ 79, బవుమా నాటౌట్ 27, ఎక్స్‌ట్రాలు : 06, మొత్తం : (16.5 ఓవర్లలో 1 వికెట్‌కు) 140.
బౌలింగ్ : సుందర్ 4-0-27-0, దీపక్ 3-0-15-0, సైని 2-0-25-0, కృనాల్ 3.5-0-40-0, హార్దిక్ 2-0-23-1, జడేజా 2-0-8-0.