Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దిగువ వెన్నుపూసకు వెంట్రుకవాసి పగులు
- సఫారీతో టెస్టు సిరీస్‌కు బుమ్రా దూరం
- ఉమేశ్ యాదవ్‌కు సెలక్టర్ల పిలుపు
స్వేచ్ఛా సమరానికి ముందే టీమ్ ఇండియాకు బలమైన ఎదురుదెబ్బ. యార్కర్ మెషిన్, వికెట్ల వేటగాడు జశ్‌ప్రీత్ బుమ్రా గాయానికి గురయ్యాడు. దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. విదేశీ టెస్టుల్లో సూపర్ సక్సెస్ సాధించిన బుమ్రా.. స్వదేశంలో తొలి సిరీస్ ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్న బుమ్రా, ఊహించని గాయంతో ఫ్రీడమ్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. బుమ్రాకు గాయం సఫారీ జట్టుకు ఊరట కాగా, కోహ్లిసేనకు కోలుకోలేని ఎదురుదెబ్బ. అక్టోబర్ 2 నుంచి విశాఖ టెస్టుతో స్వేచ్ఛా సమరం ఆరంభం కానుంది.
నవతెలంగాణ-ముంబయి
భారత నం.1 సీమర్ జశ్‌ప్రీత్ బుమ్రా గాయానికి గురయ్యాడు. పని భారం సమన్వయ ప్రణాళికలో భాగంగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి పొందిన బుమ్రా.. అక్టోబర్ 2 నుంచి విశాఖ టెస్టుతో మైదానంలోకి అడుగు పెట్టాల్సి ఉంది. రెగ్యులర్ వైద్య పరీక్షల్లో భాగంగా నేషనల్ క్రికెట్ అకాడమీలో బుమ్రాకు నిర్వహించిన రేడియాలజీ పరీక్షల్లో స్టార్ సీమర్ వెంట్రుకవాసి ఎముక చీలికతో ఉన్నాడని తేలింది. ' రెగ్యులర్ రేడియలాజీకల్ పరీక్షల్లో భాగంగా బుమ్రాకు టెస్టులు నిర్వహించారు. దిగువ వెన్నెముకకు ( నడుము కింద భాగం) వెంట్రుకవాసి చీలక ఉంది' అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు బుమ్రా స్థానంలో ఉమేశ్ యాదవ్‌ను సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.
ఎందుకీ గాయం : జశ్‌ప్రీత్ బుమ్రా స్ట్రెస్ ఫ్రాక్చర్ (ఒత్తిడి చీలిక)కు గురయ్యాడు. సహజంగా స్ప్రింటర్లు, అథ్లెట్లు, ఫుట్‌బాల్ ఆటగాళ్లు తరచుగా ఈ గాయానికి గురవుతుంటారు. కాలి వేలి ఎముకల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. బుమ్రాకు నడుము కింద భాగంలో ఎముకకు ఒత్తిడి కారణంగా వెంట్రుకవాసి చీలిక ఏర్పడింది. దీనికి ఎటువంటి శస్త్ర చికత్స అవసరం లేదు. 3-4 వారాల విశ్రాంతితో ఈ గాయం నుంచి బయట పడవచ్చు. ఇది పని భారంతో కలిగిన గాయం కాకపోయినా.. బుమ్రా వంటి తెలివైన బౌలర్‌కు తరచుగా విశ్రాంతి ఇవ్వటం సరైనది కాదని మాజీ పేసర్ జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. బుమ్రా పని ఒత్తిడిని దృష్టిలో ఉఉంచుకుని భారత జట్టు మేనేజ్మెంట్ అతడిని జాగ్రత్తగా ఉపయోగించుకుంటోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్‌లతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు బుమ్రాకు విశ్రాంతి అందించింది. ' బుమ్రా తను ఆడగలిగిన మ్యాచులను వరుసగా ఆడాలి. అందుకు నేను ఎల్లప్పుడు మద్దతిస్తాను. ఎక్కువ మ్యాచులు ఆడితే, ఎక్కువ అనుభవం లభిస్తుంది. బౌలింగ్ రిథమ్, ఫిట్నెస్ ఎంతో ముఖ్యం. సరైన సమన్వయం సాధించటం ప్రధానం. స్వల్ప కాలంలో బుమ్రా ఎదిగిన తీరు అమోఘం. బుమ్రా తెలివైన బౌలర్. ఇదే ఫామ్, ఫిట్నెస్, స్మార్ట్‌నెస్ కొనసాగిస్తే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చు' అని జహీర్ ఖాన్ అన్నాడు.
బుమ్రా లేకుంటే ఎలా? : గాయంతో టెస్టులకు బుమ్రా దూరం కావటం ఇది రెండోసారి. నిరుడు ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఐర్లాండ్‌తో టీ20 మ్యాచ్‌లో బుమ్రా బొటనవేలి గాయానికి గురయ్యాడు. దీంతో ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. ప్రస్తుత స్ట్రెస్ ఫ్రాక్చర్ మైదానంలో గురైనది కాకపోయినా, ఈ గాయంతో కీలక దక్షిణాఫ్రికా సిరీస్‌కు బుమ్రా సేవలను టీమ్ ఇండియా కోల్పోయింది. ఏడాది క్రితం వరకు భారత టెస్టు జట్టు ప్రణాళికల్లో బుమ్రా భాగం కాదు. విలక్షణ బౌలింగ్ యాక్షన్‌తో టెస్టుల్లో రాణించలేడనే అభిప్రాయం ఉండేది. కానీ నిరుడు జనవరిలో దక్షిణాఫ్రికాపై తొలి టెస్టులోనే బుమ్రా సత్తా చాటాడు. గత కరీబియన్ పర్యటనలో వెస్టిండీస్ నడ్డి విరిచాడు బుమ్రా. బుమ్రా ఆడిన 12 టెస్టుల్లోనే 62 వికెట్లు కూల్చాడు. విదేశీ పర్యటనల్లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ గడ్డపై ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి ఆసియా సీమర్‌గా రికార్డు నెలకొల్పాడు. 12 టెస్టుల్లో బుమ్రా ఐదుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. 19.24 సగటుతో, 2.64 ఎకానమీతో బుమ్రా టెస్టుల్లోనూ నం.1 సీమర్‌గా ఎదిగాడు. తాజాగా కరీబియన్లపై అవుట్ స్వింగర్లతో విరుచుకుపడిన తీరు మొత్తం సిరీస్‌కే హైలైట్‌గా నిలిచింది. అమ్ముల పొదిలో కీలక అస్త్రాలు ఉన్నా, అనువైన సమయంలోనే ప్రయోగించటం బుమ్రా లక్షణం. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్స్‌లో భాగం. బంతితో బుమ్రా అండతో సఫారీ 20 వికెట్లను కూల్చటంలో కోహ్లిసేనకు ఎటువంటి బెంగ ఉండదు. కానీ ఇప్పుడు బుమ్రా దూరం కావటంతో పేస్ దళం బలహీనం కానుంది. జశ్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమిలు టెస్టుల్లో భారత స్టార్ సీమర్లుగా కొనసాగుతున్నారు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఇషాంత్, మహ్మద్ షమిలకు తోడుగా ఉమేశ్ యాదవ్ రివర్స్ స్వింగ్‌తో జత కానున్నాడు.
ఉమేశ్‌కు ఓ అవకాశం : టెస్టుల్లో బుమ్రా, ఇషాంత్, షమి త్రయం నిలదొక్కుకోవటంతో ఉమేశ్ యాదవ్‌కు జట్టులో చోటు కరువైంది. బుమ్రా అరంగేట్రం తర్వాత ఉమేశ్ కేవలం ఐదు టెస్టుల్లోనే ప్రాతినిథ్యం వహించాడు. హైదరాబాద్‌లో వెస్టిండీస్‌పై 10/133తో మెరిసినా, టెస్టు జట్టులో ఉమేశ్ భాగం కాలేకపోయాడు. 41 టెస్టులాడిన ఉమేశ్ యాదవ్.. 33.47 సగటుతో 119 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో పాతబడిన బంతితో రివర్స్ స్వింగ్‌తో ఉమేశ్ యాదవ్ గొప్ప ప్రభావం చూపగలడు.