Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటినుంచి దక్షిణాఫ్రికాతో రెండోటెస్ట్
- ఉదయం 9.30 గం||ల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
పుణె: టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా టీమిండియా మరో టెస్ట్ సిరీస్‌పై కన్ను వేసింది. విశాఖపట్నంలో జరిగిన తొలిటెస్ట్‌లో కోహ్లీ సేన 203 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుచేసి మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యతను సంపాదించింది. విశాఖ టెస్ట్‌లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన మయాంక్ అగర్వాల్-రోహిత్ శర్మల జోడీ అద్భుత ఆరంభాన్నిచ్చింది. వీరిద్దరూ సెంచరీలమీద సెంచరీలు బాదారు. దీంతో ఈ టెస్ట్‌లోనూ వీరే ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశముంది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లోనూ శతకాలు చేయడం గమనార్హం. పుజరా, రహానే, కోహ్లీ కాస్త మెరుగైన ప్రదర్శన చేస్తున్నా టీమిండియా భారీ స్కోర్ నమోదు చేయాలంటే వీరంతా క్రీజ్‌లో నిలదొక్కుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ టెస్ట్ మ్యాచ్‌లోనూ గెలిచి టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని కోహ్లీసేన ఆశిస్తోంది. రెండో టెస్టు టీమిండియాలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.
ఇక దక్షిణాఫ్రికా విషయానికొస్తే ఓపెనర్ ఎల్గర్, వికెట్ కీపర్ డికాక్ సెంచరీలతో రాణించగా... కెప్టెన్ డుప్లెసిస్, పిడిట్ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆ జట్టు బ్యాట్స్‌మన్, బౌలర్లు భారత్‌ను కట్టడి చేయాలంటే మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా సఫారీ పేసర్లు రబాడ, ఫిలాండర్ నిరాశపరుస్తుండగా... స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఒక్కడే కొంత మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. తొలిటెస్ట్ను ఓడిన సఫారీలు ఈ మ్యాచ్‌ను చేజార్చుకుంటే సిరీస్‌ను కోల్పోవడం ఖాయం.
అశ్విన్‌కు హర్భజన్ మద్దతు
రవిచంద్రన్ అశ్విన్‌పై కొందరు అవగాహనలేమితో మాట్లాడుతున్నారని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. తాజాగా టెస్టుల్లో వేగంగా 350 వికెట్ల సాధించిన స్పిన్నర్‌గా ముత్తయ్య మురళీథరన్ సరసన అశ్విన్ చేరిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అతి తక్కువ టెస్టుల్లో ఈ ఘనత సాధించిన తొలి భారత్ బౌలర్‌గా మరో రికార్డును నెలకొల్పాడు. ఇంటా బయటా వికెట్లు సాధిస్తేనే రికార్డులకు, ఆటగాడికి గౌరవం అంటూ విమర్శకులు తమ నోటికి పనిచెప్పారు. అయితే ఈ విమర్శలపై హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అశ్విన్‌కు మద్దతుగా నిలిచాడు. త్వరలోనే తన రికార్డు(417)ను అశ్విన్ బద్దలు కొడతాడని భజ్జీ జోస్యం చెప్పాడు.
భారత జట్టు(అంచనా): విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, పుజరా, అజింక్యా రహానె, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, జడేజా, ఇషాంత్ శర్మ/ఉమేష్ యాదవ్, మహ్మద్ షమి.
దక్షిణాఫ్రికా జట్టు (అంచనా): డుప్లెసిస్(కెప్టెన్), మాక్రమ్, ఎల్గర్, బ్రుయాన్, బవుమా, డికాక్(వికెట్ కీపర్), ఫిలాండర్, కేశవ్ మహరాజ్, రబడా, ఎన్గిడి/ముత్తుసామి, పిడిట్.