Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చారిత్రక క్లీన్‌స్వీప్ విజయం వాకిట టీమ్ ఇండియా
- నిప్పులు చెరిగిన మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్
- ఫాలోఆన్‌లో దక్షిణాఫ్రికా 132/8
- ఫ్రీడం సిరీస్ మూడో టెస్టు మూడో రోజు
నవతెలంగాణ-రాంచి
3-0 క్లీన్‌స్వీప్ విజయానికి కోహ్లిసేన రంగం సిద్ధం చేసుకుంది. పేసర్లు మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్ నిప్పులు చెరిగే ప్రదర్శనతో చెలరేగారు. సీమర్ల విజృంభణతో రాంచి టెస్టు మూడో రోజు భారత్ ఏకంగా 16 వికెట్లు కూల్చింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను 162 పరుగులకే కుప్పకూల్చిన భారత్.. ఫాలోఆన్‌లో సఫారీని చావుదెబ్బ కొట్టింది!. 132/8తో దక్షిణాఫ్రికాతో ఓటమి కోరల్లో కూరుకుపోయింది. వెలుతురు లేమి భారత్ చారిత్రక విజయాన్ని నాల్గో రోజుకు వేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికాపై భారత్ ముందెన్నడూ క్లీన్‌స్వీప్ విజయాన్ని సాధించలేదు. నేడు రాంచిలో కోహ్లిసేన ఆ అంకాన్ని పూరించనుంది.
స్పిన్ పిచ్‌లపై మరోసారి సీమర్ల విధ్వంసం. పాత బంతి, కొత్త బంతి అనే వ్యత్యాసం లేకుండా వికెట్‌కు ఇరువైపులా స్వింగ్ చేయగల పేసర్లు మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్. ఈ ఇద్దరూ కలిసి కట్టుగా దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్‌పై కత్తి కట్టారు. ఇటు షమి, అటు ఉమేశ్ చెలరేగటంతో దక్షిణాఫ్రికా వరుసగా రెండో టెస్టులో ఇన్నింగ్స్ ఓటమికి సిద్ధపడింది. మహ్మద్ షమి కండ్లుచెదిరే బంతులతో సఫారీ బ్యాట్స్‌మన్ కంగుతినేలా చేశాడు. సీమర్ల మెరుపులతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకు కుప్పకూలింది. భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన భారత్.. దక్షిణాఫ్రికాను వరుసగా రెండో టెస్టులో ఫాలోఆన్‌కు పిలిచాడు. ఫాలోఆన్‌లో 46 ఓవర్లలో దక్షిణాఫ్రికా 132/8తో ఓటమి అంచుల్లో నిలిచింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న రాంచి టెస్టులో కోహ్లిసేన చారిత్రక క్లీన్‌స్వీప్ విజయానికి రెండు వికెట్లు చాలు. దక్షిణాఫ్రికా కంకషన్ సబ్‌స్టిట్యూట్ ఆటగాడు డీ బ్రూయిన్ (30), టెయిలెండర్ అన్రిచ్ (5) మూడో రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో కొనసాగుతున్నారు.
పేసర్ల విశ్వరూపం : ఓవర్‌నైట్ స్కోరు 9/2తో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన దక్షిణాఫ్రికా ఆరంభంలోనే నాయకుడి వికెట్ కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ మెరుపు బంతికి డుప్లెసిస్ వికెట్ పడిపోయింది. ఉదయం సెషన్ ఐదో బంతికే వికెట్ కోల్పోయిన సఫారికి హమ్జా (62, 79 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్), తెంబ బవుమా (32, 72 బంతుల్లో 5 ఫోర్లు) కొత్త ఉత్సాహం అందించారు. హమ్జా అర్ధ సెంచరీతో మెరువగా, బవుమా క్రీజులో నిలకడగా కనిపించాడు. నాల్గో వికెట్‌కు 91 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని జడేజా విడదీశాడు. తర్వాతి ఓవర్లోనే నయా స్పిన్నర్ నదీమ్‌కు బవుమా వికెట్ కోల్పోయాడు. 107/3తో మెరుగ్గా కనిపించిన దక్షిణాఫ్రికా 130/8తో బ్యాటింగ్ లైనప్‌ను కోల్పోయింది. హెన్రిచ్ క్లాసెన్ (6), డేన్ పీట్ (4), కగిసో రబాడ (0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. లంచ్ విరామం తర్వాత మరో 20 ఓవర్ల పాటు సాగిన దక్షిణాఫ్రికా డ్రామా 162 పరుగుల వద్ద ముగిసింది. జార్జ్ లిండె (37, 81 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లోటును కొంత తగ్గించే ప్రయత్నం చేశాడు. ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు కూల్చగా.. మహ్మద్ షమి, షాబాజ్ నదీమ్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టారు.
శత్రఘ్ను మహ్మద్ షమి! : 335 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన భారత్.. మరో ఆలోచన చేయకుండా దక్షిణాఫ్రికాను ఫాలోఆన్ ఆడించింది. రాంచిలో తొలి ఇన్నింగ్స్‌లోనే మెరిసిన మహ్మద్ షమి.. రెండో ఇన్నింగ్స్‌లో తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. దక్షిణాఫ్రికా కీలక బ్యాట్స్‌మన్‌ను బోల్తా కొట్టించి క్లీన్‌స్వీప్ విజయానికి మార్గం మరింత సులువు చేశాడు. ఓపెనర్ క్వింటన్ డికాక్ (5) వికెట్‌తో ఉమేశ్ యాదవ్ వేటకు తెరదీయగా.. మహ్మద్ షమి మరో స్థాయికి తీసుకెళ్లాడు. వరుసగా హమ్జా (0), డుప్లెసిస్ (4), తెంబ బవుమా (0) వికెట్లతో హడలెత్తించాడు. వికెట్ కీపర్ క్లాసెన్ (5)ను ఉమేశ్ యాదవ్ ఎల్బీ చేశాడు. సీమర్లు ఇద్దరూ చెలరేగటంతో 36 పరుగులకే దక్షిణాఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయింది. టాప్ ఆర్డర్ చేతులెత్తేసిన సమయంలో మరోసారి లోయర్ ఆర్డర్ కాసింత తెగువ చూపించింది. జార్జ్ లిండె (27, 55 బంతుల్లో 5 ఫోర్లు), డేన్ పీట్ (23, 73 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) భారత్‌ను వికెట్ల వేటలో కష్టపడేలా చేశారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి డీ బ్రూయిన్, అన్రిచ్ (5) క్రీజులో కొనసాగుతున్నారు.
ఫ్రీడంలో తొలి కంకషన్ : భారత్, దక్షిణాఫ్రికా ఫ్రీడం సిరీస్‌లో తొలి కంకషన్ సబ్‌స్టిట్యూట్ చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ డీన్ ఎల్గార్ (16) ఉమేశ్ యాదవ్ బౌన్సర్ దెబ్బకు విలవిల్లాడాడు. బంతి ఎల్గార్ తలకు బలంగా తగిలింది. కొంత సేపు క్రీజులోనే బేలచూపులు చూసిన ఎల్గార్.. బ్యాటింగ్ కొనసాగించేలా కనిపించలేదు. దీంతో ముందుగానే టీ విరామం ప్రకటించారు. కంకషన్ సబ్‌స్టిట్యూట్ నిబంధనల ప్రకారం ఎల్గార్ స్థానంలో డీ బ్రూయిన్ (30) బ్యాటింగ్‌కు వచ్చాడు. ప్రస్తుతం అజేయంగా ఆడుతున్నాడు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ : 497/9 డిక్లేర్డ్
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : ఎల్గార్ (సి) సాహా (బి) షమి 0, డికాక్ (సి) సాహా (బి) ఉమేశ్ 4, హమ్జా (బి) జడేజా 62, డుప్లెసిస్ (బి) ఉమేశ్ 1, బవుమా (స్టంప్డ్) సాహా (బి) నదీమ్ 32, క్లాసెన్ (బి) జడేజా 6, లిండె (సి) రోహిత్ (బి) ఉమేశ్ 37, పీట్ (ఎల్బీ) షమి 4, రబాడ (రనౌట్) 0, అన్రిచ్ (ఎల్బీ) నదీమ్ 4, ఎంగిడి నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం : (56.2 ఓవర్లలో ఆలౌట్) 162.
వికెట్ల పతనం : 1-4, 2-8, 3-16, 4-107, 5-107, 6-119, 7-129, 8-130, 9-162, 10-162.
బౌలింగ్ : మహ్మద్ షమి 10-4-22-2, ఉమేశ్ యాదవ్ 9-1-40-3, నదీమ్ 11.2-4-22-2, జడేజా 14-3-19-2, అశ్విన్ 12-1-48-0.
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్) : డికాక్ (బి) ఉమేశ్ 5, ఎల్గార్ (రిటైర్డ్ హర్ట్) 16, హమ్జా (బి) షమి 0, డుప్లెసిస్ (ఎల్బీ) షమి 4, బవుమా (సి) సాహా (బి) షమి 0, క్లాసెన్ (ఎల్బీ) ఉమేశ్ 5, లిండె రనౌట్ 27, పీట్ (బి) జడేజా 23, డీ బ్రూయిన్ బ్యాటింగ్ 30, రబాడ (సి) జడేజా (బి) అశ్విన్ 12, అన్రిచ్ బ్యాటింగ్ 5, ఎక్స్‌ట్రాలు : 05, మొత్తం : (46 ఓవర్లలో 8 వికెట్లకు) 132.
వికెట్ల పతనం : 1-5, 2-10, 3-18, 4-22, 5-36, 6-67, 7-98, 8-121.
బౌలింగ్ : మహ్మద్ షమి 9-5-10-3, ఉమేశ్ యాదవ్ 9-1-35-2, రవీంద్ర జడేజా 13-5-36-1, షాబాజ్ నదీమ్ 5-0-18-0, అశ్విన్ 10-3-28-1.