Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 100వ టీ20లో హిట్‌మ్యాన్ విజృంభణ
- సిక్సర్లతో విరుచుకుపడిన రోహిత్ శర్మ
- రాజ్‌కోట్ టీ20లో భారత్ ఘన విజయం
నవతెలంగాణ-న్యూఢిల్లీ
రాజ్‌కోట్ టీ20కి మహా తుపాను ముప్పు పొంచి ఉందని భయపెడితే.. తీరా బంగ్లాదేశ్‌ను రోహిత్ సునామీ ముంచెత్తింది. ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో రాజ్‌కోట్‌లో విశ్వరూపం చూపించిన రోహిత్ శర్మ (85, 43 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) భారత్‌కు ఘన విజయాన్ని అందించాడు. రోహిత్ శర్మకు రాజ్‌కోట్ మ్యాచ్ కెరీర్ 100వ టీ20. రోహిత్ శర్మకు తోడు మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (31) రాణించటంతో రెండో టీ20లో భారత్ 15.4 ఓవర్లలోనే 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 153/6 పరుగులు చేసింది. లిటన్ దాస్ (29), మహ్మద్ నయీం (36), సౌమ్య సర్కార్ (30), మహ్మదుల్లా (30) రాణించారు. సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో టీ20 ఆదివారం నాగ్‌పూర్‌లో జరుగనుంది.
రోహిత్ వీరోచితం : కెరీర్ 100వ టీ20లో తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ (85, 43 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫీల్డింగ్‌లో నిరాశపరిచిన రోహిత్.. బ్యాట్‌తో ధనాధన్ ఆడాడు. బంగ్లాదేశ్‌పై సిక్సర్ల వర్షం కురిపించాడు. 154 పరుగుల ఛేదనలో హిట్‌మ్యాన్ వీరోచిత ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 23 బంతుల్లో అర్ద సెంచరీ నమోదు చేశాడు. మొసద్దెక్ వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్లో రోహిత్ శర్మ విశ్వరూపం చూపించాడు. ఆ ఓవర్ తొలి బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా, రెండో బంతిని డీప్ స్క్వేర్ లెగ్ దిశగా, మూడో బంతిని లాంగ్ ఆన్ వైపుగా సిక్సర్లుగా మలిచాడు. ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో కదంతొక్కిన రోహిత్ మరో సిక్సర్ బాదే ప్రయత్నంలో వికెట్ కోల్పోయాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (31, 27 బంతుల్లో 4 ఫోర్లు) హిట్‌మ్యాన్‌కు సహకారం అందించాడు. నాలుగు ఫోర్లు బాదిన ధావన్, మరోసారి ధనాధన్ అందుకునేందు ఇబ్బంది పడ్డాడు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 10.5 ఓవర్లలోనే 118 పరుగులు జోడించి భారత్ విజయాన్ని ఖాయం చేశారు.
ఆరంభం అదిరినా.. : టాస్ నెగ్గిన భారత్ ఛేదనకు మొగ్గు చూపింది. రాజ్‌కోట్‌లో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు అదిరే ఆరంభాన్ని అందించారు. లిటన్ దాస్ (29, 21 బంతుల్లో 4 ఫోర్లు), మహ్మద్ నయీం (36, 31 బంతుల్లో 5 ఫోర్లు) తొలి వికెట్‌కు వేగంగా 60 పరుగులు జోడించారు. లిటన్ దాస్, నయీం రెండు వైపులా బౌండరీలతో చెలరేగారు. దాస్ నాలుగు ఫోర్లు బాదగా, నయీం ఐదు బౌండరీలతో మెరిశాడు. ఓపెనర్ల జోరుతో బంగ్లాదేశ్ భారీ స్కోరు దిశగా సాగింది. నం.3 సౌమ్య సర్కార్ (30, 20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ఓపెనర్ల జోరు కొనసాగించాడు. ఆఖరు ఓవర్లలో పరుగుల నియంత్రణ పాటించిన బౌలర్లు బంగ్లాదేశ్‌ను కట్టడి చేశారు. మహ్మదుల్లా (30, 21 బంతుల్లో 4 ఫోర్లు) రాణించినా, బంగ్లాదేశ్ 153 పరుగులే చేసింది. భారత బౌలర్లలో చాహల్ (2/28) రాణించాడు. తొలి టీ20 హీరో ముష్ఫీకర్ రహీమ్ (4) నాలుగు పరుగులకే వికెట్ కోల్పోయాడు. ముష్ఫీకర్ నిష్క్రమణ బంగ్లాదేశ్ స్కోరుపై ప్రతికూల ప్రభావం చూపించింది. ఆఖరు మూడు ఓవర్లలో భారత్ అద్భుతంగా బౌలింగ్ చేసింది.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ : లిటన్ దాస్ (రనౌట్) 29, నయీం (సి) అయ్యర్ (బి) సుందర్ 36, సర్కార్ (స్టంప్డ్) పంత్ (బి) చాహల్ 30, ముష్ఫీకర్ (సి) కృనాల్ (బి) చాహల్ 4, మహ్మదుల్లా (సి) దూబె (బి) చాహర్ 30, అఫిఫ్ (సి) రోహిత్ (బి) ఖలీల్ 6, మొసద్దెక్ నాటౌట్ 7, అమినుల్ నాటౌట్ 5, ఎక్స్‌ట్రాలు : 06, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 153.
వికెట్ల పతనం : 1-60, 2-83, 3-97, 4-103, 5-128, 6-142.
బౌలింగ్ : దీపక్ 4-0-25-1, ఖలీల్ 4-0-44-1, సుందర్ 4-0-25-1, చాహల్ 4-0-28-2, దూబె 2-0-12-0, కృనాల్ 2-0-17-0.
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ (సి) మిథున్ (బి) ఇస్లాం 85, ధావన్ (బి) ఇస్లాం 31, రాహుల్ నాటౌట్ 24, అయ్యర్ నాటౌట్ 8, ఎక్స్‌ట్రాలు : 06, మొత్తం : (15.4 ఓవర్లలో 2 వికెట్లకు) 154.
వికెట్ల పతనం : 1-118, 2-125.
బౌలింగ్ : ముస్తాఫిజుర్ 3.4-0-35-0, సఫిల్ ఇస్లాం 2-0-23-0, ఆమిన్ 4-0-32-0, ఇస్లాం 4-0-29-2, అఫిఫ్ 1-0-13-0, మొసద్దెక్ 1-0-21-0.