Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆశలు రేపిన శ్రేయాష్ అయ్యర్
- టీ20 ప్రపంచకప్ బెంగ తీరినట్టే
2019 వన్డే వరల్డ్‌కప్ కోసం మిడిల్ ఆర్డర్లో భారత్ 11కు పైచిలుకు ఆటగాళ్లను ప్రయోగించింది. అందులో శ్రేయాష్ అయ్యర్ ఒకడు. నం.4లో తనకు వచ్చిన అవకాశాల్లో అయ్యర్ 9, 88, 65, 18, 30 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌కు సరిగ్గా 12 మాసాలకు ముందు అయ్యర్‌ను సెలక్టర్లు పక్కనపెట్టారు. టీమ్ ఇండియా ఇప్పుడు 2020 టీ20 ప్రపంచకప్ కోసం సిద్ధమవుతోంది. పరిణితి చెందిన ఆటతీరుతో శ్రేయాష్ అయ్యర్ ఇప్పుడు నం.4కు నేనే సరైనోడినని అంటూ వస్తున్నాడు.
నవతెలంగాణ క్రీడా విభాగం :' వెంటాడు.. వేటాడు' క్రికెట్లో శ్రేయాష్ అయ్యర్ ఎక్కువగా విశ్వసించేది ఇదే. ఐపీఎల్లో నాయకుడిగా జట్టు సహచరులకు ఉపదేశం, టీమ్ ఇండియా డ్రెస్సింగ్‌రూమ్‌లో యువ ఆటగాడిగానూ శ్రేయాష్ అయ్యర్‌ది ఒకటే సూత్రం. తన జోన్లోకి బంతి వస్తే, అయ్యర్ నియంత్రించుకోలేడు. బంతిపై విరుచుకుపడతాడు. అటువంటి విధ్వంసంలో నాగ్‌పూర్‌లో బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్ ఒకటి. 33 బంతుల్లో 62 పరుగులు చేసిన శ్రేయాష్ అయ్యర్ టీ20లో కెరీర్ తొలి అర్ధ సెంచరీ నమోదు చేశాడు. సవాల్ విసిరిన నాగ్‌పూర్ పిచ్‌పై భారత్‌కు భారీ స్కోరు అందించి, విజయంలో ముఖ్య భూమిక వహించాడు. 2020 టీ20 ప్రపంచకప్ ముంగిట మిడిల్ ఆర్డర్లో నం.4 స్థానం సొంతం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు.
దూకుడు, సహనం కలబోత : ప్రస్తుత యువ ఆటగాళ్లలో దూకుడు, సహనం మేళవింపుతో పరిణితి చెందిన బ్యాట్స్‌మన్ ఎవరంటే కచ్చితంగా శ్రేయాష్ అయ్యర్ అనే చెప్పాలి. రోహిత్ శర్మలోని విధ్వంసక స్వభావం, విరాట్ కోహ్లిలోని బౌలర్లపై ఆధిపత్యం శ్రేయాష్ అయ్యర్‌లో కనిపిస్తాయి. గత సీజన్లో ఐపీఎల్ ప్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ (డేర్‌డెవిల్స్) నాయకుడిగా సీజన్ మధ్యలో బాధ్యతలు తీసుకున్న శ్రేయాష్ అయ్యర్ ఆటగాడిగా ఎంతో పరిణితి సాధించాడు. ఈ ఏడాది కెప్టెన్‌గా ఢిల్లీ క్యాపిటల్స్‌ను ప్లే ఆఫ్స్‌కు తీసుకెళ్లి, విశేషంగా ఆకట్టుకున్నాడు. యువ ఆటగాడిగా, ఐపీఎల్ జట్టు నాయకత్వం వహించిన శ్రేయాష్ అయ్యర్ బ్యాటింగ్‌లో ఆ అనుభవం, నిగ్రహం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. బంగ్లాదేశ్‌తో ఆఖరు టీ20లో శ్రేయాష్ అయ్యర్ క్రీజులోకి వచ్చిన సమయానికి భారత్ పరిస్థితి ఏమంత బాగా లేదు. ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ డగౌట్‌కు చేరుకున్నాడు. దూకుడు కోసం తంటాలు పడుతున్న శిఖర్ ధావన్ అండ మాత్రమే ఉంది. ఈ సమయంలో దూకుడుగా ఆడితే ఎంత ప్రమాదమో, ఆడకపోయినా అంతే ప్రమాదం. ఈ పరిస్థితిని శ్రేయాష్ అయ్యర్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. మంచి బంతులను గౌరవించిన అయ్యర్.. గతి తప్పిన బంతులపై విశ్వరూపం ప్రదర్శించాడు. అఫిఫ్ హుస్సేన్ ఓవర్లో ఏకంగా హ్యాట్రిక్ సిక్సర్లతో చెలరేగాడు. శ్రేయాష్ అయ్యర్ విధ్వంసక ఇన్నింగ్స్‌లో దూకుడుతో పాటు ఇన్నింగ్స్ నిలబెట్టాల్సిన బాధ్యత సైతం కనిపిస్తుంది. మిడిల్ ఆర్డర్లో నం.4 బ్యాట్స్‌మన్‌కు ఉండాల్సిన ప్రథమ లక్షణం ఇదే. వన్డే వరల్డ్‌కప్‌కు నం.4లో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌ను తీసుకెళ్లని టీమ్ ఇండియా, అందుకు భారీ మూల్యం చెల్లించింది. 2020 టీ20 ప్రపంచకప్‌లో ఆ పొరపాటు పునరావృతం కాకూడదనే కోరుకుందాం.
ప్రపంచకప్ తర్వాత టీమ్ ఇండియా ఎదుర్కొన్న తొలి సవాల్లో శ్రేయాష్ అయ్యర్ అంచనాలను అందుకున్నాడు. వెస్టిండీస్‌పై వరుసగా 68 బంతుల్లో 71, 41 బంతుల్లో 65 పరుగులతో కదం తొక్కాడు. ఆ రెండు మ్యాచుల్లో విరాట్ కోహ్లి శతకాలు బాదాడు. ఆ సిరీస్‌లో కెప్టెన్ కోహ్లి తర్వాత టాప్ స్కోరర్ అయ్యరే. వెస్టిండీస్‌పై రెండు అర్థ శతక ఇన్నింగ్స్‌లు నమోదు చేసిన పిచ్‌లలో ఒకటి పూర్తిగా బ్యాట్స్‌మన్‌కు అనుకూలం కాదు. బంతి బ్యాట్‌కు ఏమాత్రం రాలేదు. నాగ్‌పూర్‌లోనూ అదే పరిస్థితి. పిచ్ నుంచి బ్యాట్స్‌మన్‌కు కఠిన సవాల్ ఎదురైంది. దూకుడులో ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించిన శ్రేయాష్ అయ్యర్ బంగ్లాదేశ్ బౌలర్లపై ఊచకోతకే ఓటేశాడు. సూపర్బ్ ఇన్నింగ్స్‌తో భారత నం.4 లోటు తీరిందనే సంకేతాలు ఇచ్చాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి పునరాగమనం తర్వాత అతడికి మిడిల్ ఆర్డర్లో అయ్యర్ వంటి నాణ్యమైన బ్యాట్స్‌మన్ అండ దొరికితే 2020 టీ20 ప్రపంచకప్‌లో భారత్ పరుగుల ప్రవాహానికి ఎదురుండదు!.
పరుగులు పిండుకోవాలనే
ఆలోచనతో....
' నేను ఒక్కసారి క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత చెత్త బంతులపై గరిష్ట మొత్తంలో పరుగులు పిండుకోవాలనే ఆలోచనతోనే ఉన్నాను. నాగ్‌పూర్‌లో అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఒత్తిడిలోనూ మెరుగ్గా ఆడగలనని నిరూపించింది. ఇది వ్యక్తిగతంగా నాకు, జట్టుకు ఎంతో ముఖ్యం. ఒకవేళ కోహ్లి, రోహిత్ త్వరగా అవుటైతే ఆఖరు వరకూ క్రీజులో నిలిచి ఇన్నింగ్స్ ముగించడానికి ఒకరు అవసరం. నం.4 బాధ్యత సరిగ్గా అదే. అదే విషయం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను'
- శ్రేయాష్ అయ్యర్