- ప్రపంచకప్ ఓటమిపై విరాట్ కోహ్లి న్యూఢిల్లీ : విరాట్ కోహ్లి భారత క్రికెట్ విజయవంతమైన కెప్టెన్. ప్రపంచ క్రికెట్‌లో పరుగుల యంత్రం. విరాట్ మైదానంలోకి దిగిన ప్రతీసారి అతడు విఫలం అయ్యే అవకాశమే లేదు అనిపిస్తుంది. కానీ 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో కోహ్లి విఫలమయ్యాడు. ఆ మ్యాచ్‌లో ఓడిన భారత్, వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించింది. ఆ ఓటమి అందరి లాగా నన్నూ ఎంతో వేధనకు గురిచేసిందని కోహ్లి వెల్లడించాడు. ' అందరి మాదిరిగానే నాపైనా ఓటమి ప్రభావం ఉంటుంది. నా జట్టుకు నా అవసరం ఉందని అంతిమంగా నాకు తెలుసు. నేను నాటౌట్‌గా నిలుస్తాననే బలమైన విశ్వాసం నాలో ఉన్నది, కానీ ప్రపంచకప్ సెమీఫైనల్లో అది జరుగలేదు. అజేయంగా నిలుస్తానని ముందే ఎలా అంచనా వేయగలను? అని అహంతో కూడిన సంఘర్షణ నాలో ఉంటుంది. నేను ఓటమిని ద్వేషిస్తాను. పని ముగించకుండా అవుట్ కావడాన్ని ఇష్టపడను. నేను మైదానంలో అడుగుపెట్టిన ప్రతి మ్యాచ్‌ను గౌరవంగా భావిస్తాను. నేను పెవిలియన్‌కు వచ్చినప్పుడు నాలో శక్తి శూన్య స్థితిలో ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే మేం గొప్ప వారసత్వాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాం. తర్వాతి తరం క్రికెటర్లు ఆట ఇలా ఆడాలని చెప్పుకోవాలి' అని విరాట్ కోహ్లి అన్నాడు.