- హైదరాబాద్ రంజీ జట్టు ప్రకటన నవతెలంగాణ, హైదరాబాద్ 2020 రంజీ సీజన్‌కు హైదరాబాద్ జట్టును బుధవారం ప్రకటించారు. హైదరాబాద్ రంజీ జట్టులో ఎంపిక రాజకీయాలు, డబ్బు, లాబీయింగ్ ప్రభావితం చేస్తున్నాయని మాజీ కెప్టెన్ అంబటి రాయుడు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో నెగ్గేందుకు సహాయం చేసిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు (తాత్కాలిక) ఎన్. శివలాల్ యాదవ్ కుమారుడు అర్జున్ యాదవ్‌కు కోచ్ పదవిని కట్టబెట్టడంపై రాయుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. అర్హత లేని ఆటగాళ్లతో పోటీపడే రంజీ జట్టును ఎలా రూపొందించగలమని రాయుడు ప్రశ్నించాడు. రాయుడు వ్యాఖ్యలు దుమారం రేపినా హెచ్‌సీఏ తీరులో ఎటువంటి మార్పు వచ్చినట్టు కనిపించటం లేదు. ఎన్. అర్జున్ యాదవ్ కోచ్‌గా హైదరాబాద్ రంజీ జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఓపెనర్ తన్మరు అగర్వాల్ ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు కెప్టెన్సీ వహించనున్నాడు. రంజీ సీజన్‌లో హైదరాబాద్ తొలి మ్యాచ్‌లో సొంతగడ్డపై గుజరాత్‌ను ఎదుర్కొనుంది. నవంబర్ 9న హైదరాబాద్, గుజరాత్ రంజీ మ్యాచ్ ఆరంభం కానుంది. హైదరాబాద్ రంజీ జట్టు : తన్మరు అగర్వాల్, పి. అక్షత్ రెడ్డి, కె. రోహిత్ రాయుడు, బి సందీప్ (వైస్ కెప్టెన్), హిమాలరు అగర్వాల్, కొల్ల సుమంత్, మెహిది హసన్, సాకెత్ సాయిరాం, ఎం. రవి కిరణ్, మహ్మద్ సిరాజ్, సివి మిలింద్, జిఏ శశిధర్ రెడ్డి, యుధ్విర్ సింగ్, జె. మల్లికార్జున్.