Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రీ ఎంట్రీలో సానియాకు టైటిల్
- కెరీర్ 42వ డబ్ల్యూటీఏ టైటిల్ సొంతం
హౌబర్ట్ : భారత టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా రెండో ఇన్నింగ్స్‌ను ఘనంగా ఆరంభించింది. సుమారు రెండేండ్ల విరామం తర్వాత టెన్నిస్ కోర్టులోకి అడుగుపెట్టిన మాజీ వరల్డ్ నం.1 రీ ఎంట్రీలో తొలి టోర్నీలోనే టైటిల్ విజయాన్ని అందుకుంది. ఉక్రెయిన్ భామ నదియా కిచనెక్తో కలిసి హౌబర్ట్ ఇంటర్నేషనల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. రెండో సీడ్, అగ్ర జోడీ షురు జాంగ్, షురు పెంగ్లపై సానియా, నదియాలు 6-4, 6-4తో సాధికారిక విజయం నమోదు చేశారు. 2020 టోక్యో ఒలింపిక్స్ ఏడాదిలో సానియా శుభారంభం చేసింది. ఆస్ట్రేలియా ఓపెన్‌కు ముందు విలువైన ఆత్మవిశ్వాసం సొంతం చేసుకుంది. మహిళల డబుల్స్ విజేతగా నిలిచిన సానియా, నదియాలు ట్రోఫీతో పాటు చెరో రూ. 5 లక్షలు నగదు ప్రోత్సాహం దక్కించుకున్నారు. సానియా మీర్జా కెరీర్లో ఇది 42వ డబ్ల్యూటీఏ టైటిల్ కావటం విశేషం.
అన్‌సీడెడ్ భారత్, ఉక్రెయిన్ జోడీ సానియా మీర్జా, నదియా కిచనెక్లు హౌబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీలో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగింది. కుమారుడు నిజహాన్కు జన్మనిచ్చేందుకు సానియా మీర్జా రెండేండ్ల పాటు మాతృత్వ సెలవులో గడిపింది. పునరాగమనంలో సానియా ప్రదర్శనపై ఎన్నో అనుమానాలు, ప్రశ్నలు. వీటన్నింటికి ఒక్క టైటిల్‌తో సానియా సమాధానం చెప్పిందనే అనుకోవాలి!. శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సానియా, నదియాలు 81 నిమిషాల్లోనే టైటిల్‌కు చేరువయ్యారు. రెండో సీడ్ చైనా జంటకు వరుస సెట్లలో చెక్ పెట్టి, విజయాన్ని అందుకున్నారు. తొలి సెట్లో చైనా జోడీ సర్వ్ బ్రేక్ చేసిన సానియా జోడీ.. తర్వాత తమ సర్వ్‌ను నిలుపుకోలేదు. నువ్వా నేనా అన్నట్టు సాగిన మ్యాచ్‌లో 4-4తో స్కోరు సమంగా, అవకాశం సమంగా ఉన్నాయి. ఈ సమయంలో సానియా అనుభవం పనికొచ్చింది. ఉత్కంఠగా సాగిన రెండు గేమ్‌లను సానియా జోడీ గెల్చుకుంది. 6-4తో తొలి సెట్ సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ చైనా జోడీ గట్టిగా పోరాడింది. సానియా జంట 4-2తో ముందంజ వేసినా, వేగంగా పుంజుకుని 4-4తో సమవుజ్జీగా నిలిచింది. మరోసారి క్లైమాక్స్‌లో చెలరేగిన సానియా మీర్జా రీ ఎంట్రీలో టైటిల్ విజయానికి మార్గం సుగమం చేసుకుంది. ఈ విజయంతో నదియా, సానియాలు ర్యాంకింగ్స్‌లో చెరో 280 పాయింట్లు పొందనున్నారు. ' నా కెరీర్లో అత్యంత ప్రధానమైన క్షణాల్లో ఇదొకటి. రెండో ఇన్నింగ్స్‌కు ఇంతకంటే మెరుగైన ఆరంభం కోరుకోను. రెండేండ్ల తర్వాత లభించిన విజయం గొప్ప అనుభూతిని ఇచ్చింది. హౌబర్ట్‌లో ఈ వారం అమోఘంగా గడిచింది' అని సానియా మీర్జా విజయానంతరం వ్యాఖ్యానించింది. భారత అభిమానులతో సెల్ఫీలు దిగి అలరించింది