Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో శతకబాదిన రోహిత్ శర్మ
- రాణించిన విరాట్ కోహ్లి, అయ్యర్
- 2-1తో వన్డే సిరీస్ భారత్ వశం
నవతెలంగాణ-బెంగళూర్ : హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (119, 128 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీ, ఛేదనలో మొనగాడు విరాట్ కోహ్లి (89, 91 బంతుల్లో 8 ఫోర్లు) సమయోచిత అర్ధ శతకంతో చెలరేగారు. అమీతుమీ తేల్చుకోవాల్సిన నిర్ణయాత్మక వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. ముంబయిలో ఆసీస్ నెగ్గగా, రాజ్‌కోట్‌లో లెక్క సరిచేసిన టీమ్ ఇండియా.. సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో అలవోకగా గెలుపొందింది. 2-1తో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 287 పరుగుల ఛేదనను భారత్ 47.3 ఓవర్లలోనే ముగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 286/9 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (131, 132 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్) శతకంతో రాణించగా, మార్నస్ లబుషేన్ (54, 64 బంతుల్లో 5 ఫోర్లు) మెరిశాడు. మూడు మ్యాచుల వన్డే సిరీస్ 2-1తో భారత్ వశమైంది. టీమ్ ఇండియా తన తర్వాతి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో జనవరి 24న ఆడనుంది. కివీస్ పర్యటనకు కోహ్లిసేన నేడు ఉదయం ఆక్లాండ్‌కు బయల్దేరనుంది.
ఛేదనలో రోహిత్, విరాట్ చెడుగుడు : చిన్నస్వామిలో 287 పరుగుల లక్ష్యం, పెద్దదేమీ కాదు. పిచ్ నెమ్మదిగా ఉండటం, స్పిన్నర్లు ప్రభావం చూపిస్తుండటంతో ఓపెనర్లు ఆచితూచి ఆడారు. పవర్‌ప్లేలో 61 పరుగులు చేసి, వికెట్ కాపాడుకున్నారు. అరోన్ ఫించ్ బాదిన బంతి బౌండరీకి చేరకుండా డైవ్ చేస్తూ భుజం గాయానికి గురైన శిఖర్ ధావన్ స్థానంలో కెఎల్ రాహుల్ ఓపెనర్‌గా వచ్చాడు. నెమ్మదిగా మొదలెట్టిన రాహుల్ 2 ఫోర్లు కొట్టినా.. ఎంతోసేపు క్రీజులో నిలువలేదు. ఆగర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు వికెట్ కోల్పోయాడు. తొలి రెండు వన్డేల్లో నిరాశపరిచిన రోహిత్ శర్మ (119) బెంగళూర్‌లో చెలరేగాడు. 6 సిక్సర్లు, 8 ఫోర్లతో శివమెత్తాడు. 56 బంతుల్లో 50 పరుగులు చేసిన రోహిత్.. వంద పరుగుల మైలురాయి 110 బంతుల్లో చేరుకున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి (89, 91 బంతుల్లో 8 ఫోర్లు)తో కలిసి రోహిత్ శర్మ రెండో వికెట్‌కు 131 పరుగులు జోడించాడు. రోహిత్, కోహ్లి వికెట్‌కు రెండువైపులా ఆసీస్ బౌలర్లను ఆడుకున్నారు. ఈ ఇద్దరి భాగస్వామ్యంతో భారత్ లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. సెంచరీ తర్వాత రోహిత్ శర్మ నిష్క్రమించినా.. విరాట్ కోహ్లి జోరు కొనసాగింది. శ్రేయాష్ అయ్యర్ (44 నాటౌట్, 35 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) కలిసి కోహ్లి 68 పరుగులు జోడించాడు. భారత్ గెలుపు లాంఛనం చేశాడు. ఆఖర్లో కోహ్లి నిష్క్రమించినా అయ్యర్‌తో కలిసి మనీశ్ పాండే (8 నాటౌట్) పని పూర్తి చేశాడు. 287 పరుగుల లక్ష్యాన్ని భారత్ 47.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
స్మిత్ శతకం : టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా విచిత్రంగా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కొత్త బంతితో మహ్మద్ షమి (4/63) ఆరంభంలోనే బ్రేక్ ఇచ్చాడు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ డెవిడ్ వార్నర్ (3)ను వికెట్ల వెనకాల దొరకబుచ్చుకున్నాడు. ఓ ఫోర్, సిక్సర్‌తో జోరుమీదున్న అరోన్ ఫించ్ (19) రనౌట్‌గా నిష్క్రమించాడు. 46/2తో ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. ఈ దశలో స్టీవ్ స్మిత్ (131, 132 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్), మార్నస్ లబుషేన్ (54, 64 బంతుల్లో 5 ఫోర్లు) మూడో వికెట్‌కు శతక భాగస్వామ్యం నమోదు చేశాడు.
రెట్టించిన ఉత్సాహంతో బంతులేసిన భారత బౌలర్లను స్మిత్, లబుషేన్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 8 ఫోర్లతో 63 బంతుల్లో అర్ధ సెంచరీ నమోదు చేసిన స్మిత్ ఆసీస్‌ను భారీ స్కోరు దిశగా నడిపించాడు. మరో ఎండ్‌లో లబుషేన్ 60 బంతుల్లో అర్ధ సెంచరీ బాదాడు. లబుషేన్ నిష్క్రమించినా స్మిత్ పోరాటం ఆగలేదు. 11 ఫోర్లతో 117 బంతుల్లో శతకం చేశాడు. వికెట్ కీపర్ అలెక్స్ క్యారె (35) వేగంగా పరుగులు సాధించలేకపోయాడు. టెయిలెండర్లు కమిన్స్ (0), జంపా (1)లను షమి వెనక్కి పంపించాడు. బ్యాటింగ్ పిచ్‌పై ఆసీస్ బ్యాట్స్‌మెన్ జోరుకు ముకుతాడు వేసిన భారత బౌలర్లు కంగారూను 286/9 వద్ద నిలువరించారు. మహ్మద్ షమి నాలుగు వికెట్లతో మెరువగా..రవీంద్ర జడేజా (2/44) రాణించాడు.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : వార్నర్ (సి) రాహుల్ (బి) షమి 3, ఫించ్ రనౌట్ 19, స్మిత్ (సి) అయ్యర్ (బి) షమి 131, లబుషేన్ (సి) కోహ్లి (బి) జడేజా 54, క్యారె (సి) అయ్యర్ (బి) కుల్దీప్ 35, టర్నర్ (సి) రాహుల్ (బి) సైని 4, ఆగర్ నాటౌట్ 11, కమిన్స్ (బి) షమి 0, జంపా (బి) షమి 1, హెజిల్వుడ్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 27,
మొత్తం : (50 ఓవర్లలో 9 వికెట్లకు) 286.
వికెట్ల పతనం : 1-18, 2-46, 3-173, 4-173, 5-231, 6-238, 7-273, 8-276, 9-282.
బౌలింగ్ : బుమ్రా 10-0-38-0, షమి 10-0-63-4, సైని 10-0-65-1, కుల్దీప్ 10-0-62-1, జడేజా 10-1-44-2.
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (సి) స్టార్క్ (బి) జంపా 119, కెఎల్ రాహుల్ (ఎల్బీ) ఆగర్ 19, విరాట్ కోహ్లి (బి) హెజిల్వుడ్ 89, శ్రేయాష్ అయ్యర్ నాటౌట్ 44, మనీశ్ పాండే నాటౌట్ 8, ఎక్స్‌ట్రాలు : 10,
మొత్తం : (47.3 ఓవర్లలో 3 వికెట్లకు) 289.
బౌలింగ్ : కమిన్స్ 7-0-64-0, స్టార్క్ 9-0-66-0, హెజిల్వుడ్ 9.3-1-55-1, ఆగర్ 10-0-38-1, జంపా 10-0-44-1, లబుషేన్ 1-0-11-0, ఫించ్ 1-0-9-0.