Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫెడరర్, సెరెనా శుభారంభం
- అదరగొట్టిన వొజ్నియాకీ
- ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
కొత్త ఏడాదిలో కొత్త రికార్డుల వేట మొదలైంది. టెన్నిస్ దిగ్గజాలు సెరెనా విలియమ్స్, రోజర్ ఫెడరర్లు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో టైటిల్ వేట ఘనంగా మొదలెట్టారు. సెరెనా విలియమ్స్ ఆల్‌టైమ్ గ్రేట్ మార్గరెట్ సరసన నిలిచేందుకు కెరీర్ 24వ గ్రాండ్‌స్లామ్ కోసం ఎదురుచూస్తుండగా.. గ్రాండ్‌స్లామ్ వేటలో నడాల్‌పై ఆధిక్యం మరింత పెంచుకునేందుకు ఫెడరర్ కెరీర్ 21వ గ్రాండ్‌స్లామ్ కోసం బరిలో నిలిచాడు. మాజీ వరల్డ్ నం.1, వీడ్కోలు తార కరొలినా వొజ్నియాకీ ముందంజ వేసింది.
నవతెలంగాణ-మెల్బోర్న్
ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ముందు టెన్నిస్‌కు కోర్టులో అడుగుపెట్టలేదు. సన్నాహాక టోర్నీగా భావించే ఏటీపీ కప్‌లోనూ పోటీపడలేదు. నేరుగా మెల్బోర్న్లో ప్రాక్టీస్ మ్యాచుల్లోనే రాకెట్ పట్టిన స్విస్ యోధుడు రోజర్ ఫెడరర్ 2020 టైటిల్‌పై పెద్దగా ఆశల్లేవని స్వయంగా వెల్లడించాడు. దిగ్గజ క్రీడాకారుడి మాటల్లో వినిపించిన నిరాశ, ఆటలో ఏమాత్రం ప్రతిబింబించలేదు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ రోజర్ ఫెడరర్ అలవోక విజయాన్ని సొంతం చేసుకున్నాడు. వర్షం కారణంగా తొలి సెట్‌కు పది నిమిషాల విరామం స్విస్ స్టార్ జోరుకు బ్రేక్ వేయలేకపోయింది. 6-3, 6-2, 6-2తో అమెరికా ఆటగాడు స్టీవ్ జాన్సన్‌పై ఫెడరర్ వరుస సెట్లలో విజయం సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శుభారంభం గావించాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో దిగ్గజం సెరెనా విలియమ్స్ సైతం తొలి రౌండ్లో సులువుగా గెలుపొందింది. 38 ఏండ్ల సెరెనా విలియమ్స్ 6-0, 6-3తో గంటలోపే రెండో రౌండ్‌కు చేరుకుంది.
స్టార్స్ సులువుగా.. : ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రోజు స్టార్స్ సులువుగా గెలుపొందారు. డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) తొలి రౌండ్లో ఓ సెట్ కోల్పోయి విజయాన్ని సాధించాడు. జర్మనీ ఆటగాడు జాన్ లెనార్డ్ స్ట్రఫ్‌పై 7-6(7-5), 6-2, 2-6, 6-1తో గెలుపొందాడు. తొలి రెండు సెట్లు గెలిచిన జకోవిచ్.. మూడో సెట్ కోల్పోయాడు. నాల్గో సెట్లో భారీ ఆధిక్యంతో నెగ్గి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. మహిళల సింగిల్స్ వరల్డ్ నం.1 యాష్లె బార్టీ మూడు సెట్ల పోరులో పైచేయి సాధించింది. ఉక్రెయిన్త భామ లెసియపై 5-7, 6-1, 6-1తో బార్టీ గెలుపొందింది. యు.ఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ స్లోనె స్టీఫెన్స్‌పై చైనా స్టార్ జాంగ్ షురు 2-6, 7-5, 6-2తో విజయం సాధించింది. ఏడో సీడ్ చెక్ భామ పెట్రా క్విటోవా సహ చర సినికోవపై 6-1, 6-0తో పైచేయి సాధించింది. మూడో సీడ్ నవొమి ఒసాక 6-2, 6-4తో చెక్ రిపబ్లిక్ ప్లేయర్ మరియ బుజ్కోవాపై విజయం సాధించింది. ఏడు సార్లు గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత వీనస్ విలియమ్స్‌పై అమెరికాకే చెందిన యువ క్రీడాకారిణి కోకో గౌఫ్ గెలుపొందింది. 15 ఏండ్ల కోకో గౌఫ్ తన అభిమాన క్రీడాకారిణిని 7-6(7-5), 6-3తో వరుస సెట్లలో ఓడించింది.
స్నేహంతో మెలగండి : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలిసారి వీడ్కోలు భామ కరొలినా వొజ్నియాకీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహిళల సింగిల్స్ మాజీ వరల్డ్ నం.1, డెన్మార్క్ స్టార్ వొజ్నియాకీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ముందంజ వేసింది. ఎన్బీఏ స్టార్ డెవిడ్ లీతో కలిసి కుటుంబ జీవతం మొదలు పెట్టేందుకు 29 ఏండ్ల వొజ్నియాకీ ప్రొఫెషనల్ కెరీర్‌కు వీడ్కోలు పలుకున్నట్టు డిసెంబర్లోనే ప్రకటన చేసింది. వీడ్కోలు సమయాన తొలి రౌండ్లో కరొలినా సులువుగా విజయం సాధించింది. అమెరికా క్రీడాకారిణి క్రిస్టీ హాన్‌పై 6-1, 6-3తో వరుస సెట్లలో కరొలినా గెలుపొందింది. ' వీడ్కోలు టోర్నీలో ఎన్నో భావోద్వేగాలు. కానీ వాటన్నంటికీ చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఆ దిశగా తొలి రౌండ్ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేశానని భావిస్తున్నాను. ప్రస్తుతం ఆటలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నానని అనుకుంటున్నాను' అని వొజ్నియాకీ మ్యాచ్ అనంతరం పేర్కొంది. ఆధునిక టెన్నిస్‌లో పెరుగుతున్న వైషమ్యాలపై కరొలినా స్ఫూర్తివంతమైన మాటలు ఉపదేశించింది. ' మా తరం క్రీడాకారులు మంచి స్నేహంతో మెలిగారని అనుకుంటున్నాను. జూనియర్ ప్లేయ ర్స్‌గా ఉన్నప్పటి నుంచి పెద్ద బృందంగా ఏర్పడి టోర్నీల్లో పోటీపడే వరకూ అదే రీతిలో ఉన్నాం. మా స్నేహాలు టెన్నిస్‌ను దాటి వెల్లివిరిశాయని అనుకుంటున్నాను. మా కంటే ముందు పరిస్థితి ఏలా ఉండేదే తెలియదు. మాతో స్నేహంగా మెలిగి సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ ఈ సంప్రదాయానికి తెరదీశారు. విలియమ్స్ సిస్టర్స్‌తో నాతో మంచి అనుబంధం పంచుకున్నారు. ఈ స్ఫూర్తి యంగ్ అథ్లెట్లలోనూ కొనసాగుతుందని ఆశిస్తున్నాను. యువ ఆటగాళ్లు ఒకరితో ఒకరు మంచిగా మెలగాలని కోరుకుంటున్నాను. ఎందుకుంటే టెన్నిస్ కేవలం ఓ స్పోర్ట్స్. అందరూ తమ అవకాశం పరీక్షించుకుంటున్నారు' అని వొజ్నియాకి తెలిపింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ డిఫెండింగ్ చాంపి యన్ నవొమి ఒసాక జూనియర్‌గా ఉన్నప్పుడు కరొలినా వొజ్నియాకీ ఆమెను స్వీకరించిన తీరుపై గతంలోనే జపాన్ స్టార్ గొప్పగా చెప్పింది. 'ఆ సమయంలో ఒసాక ర్యాంక్ ఎంతో కూడా తెలియదు. జూనియర్స్ నుంచి వచ్చింది. ఒసాకతో ప్రాక్టీస్ సందర్భంగా ఆమె గొప్ప సర్వ్‌లు ఇస్తుందని అనుకున్నాను' అని వొజ్నియాకి గుర్తు చేసుకుంది.