Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హలెప్, వావ్రింకా, కెర్బర్ ముందంజ
- ఆస్ట్రేలియన్ ఓపెన్ 2020
పారిస్ మొనగాడు, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ జోరు మొదలైంది. హార్డ్ కోర్టుపై టైటిల్ దాహం తీర్చుకునేందుకు బుల్ వేటను జోరుగా ఆరంభించింది. వరల్డ్ నం.1 రఫెల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను దూకుడుగా మొదలెట్టాడు. స్విస్ స్టార్ వావ్రింకా సైతం మెల్బోర్న్లో శుభారంభం చేశాడు. మహిళల సింగిల్స్‌లో స్టార్ క్రీడాకారిణులు సిమోన హలెప్, ఎంజెలికా కెర్బర్లు ముందంజ వేశారు. వరుసగా రెండో రోజు ఆస్ట్రేలియన్ సంచలనాలకు దూరంగా నిలిచింది!.
మెల్బోర్న్ (ఆస్ట్రేలియా) : 19 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత. ఫ్రెంచ్ ఓపెన్‌ను రికార్డు స్థాయిలో అందుకున్న ఏకైక ఆటగాడు. అయినా, లేటు వయసులో మట్టికోర్టు ఆవల తన చిరకాల ప్రత్యర్థులను ఓడించి హార్డ్‌కోర్టు టైటిల్ కొట్టలేడనే అపవాదు మోస్తున్నాడు. అతడే వరల్డ్ నం.1 స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్. పురుషుల సింగిల్స్ ఓపెన్ శకంలో రోజర్ ఫెడరర్ 20 గ్రాండ్‌స్లామ్ రికార్డు సమం చేసేందుకు నాదల్ ఒకే ఒక్క టైటిల్ దూరంలో ఉన్నాడు. రికార్డును సమం చేయటంతో పాటు విమర్శకుల నోటికి తాళం వేయటం నాదల్ తక్షణ కర్తవ్యంగా పెట్టుకున్నాడు!. ఆ దిశగా ఆస్ట్రేలియన్ ఓపెన్ వేటను దూకుడుగా ఆరంభించాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో బొలీవియా ఆటగాడు హ్యూగో డెలియన్పై నాదల్ సులువైన విజయం సాధించాడు. 6-2, 6-3చ, 6-0తో వరుసగా మూడు సెట్లలో గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. 19 గ్రాండ్‌స్లామ్స్ టైటిళ్ల చరిత్రలో రఫెల్ నాదల్ మెల్బోర్న్లో ఒకే ఒక్క టైటిల్ నెగ్గాడు. ' ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఒక్క టైటిలే సాధించడానికి కారణం నాకు తెలియదు. బహుశా మెల్బోర్న్ కంటే న్యూయార్క్ (యుఎస్ ఓపెన్) పరిస్థితులు నాకు మెరుగ్గా ఉన్నాయేమో!. ఆ ఒక్క కారణం నా ముందు కనిపిస్తోంది' అని తొలి రౌండ్ విజయానంతరం రఫెల్ నాదల్ వ్యాఖ్యానించాడు. మెల్బోర్న్లో రెండో గ్రాండ్‌స్లామ్ వేటలో నాదల్కు జకోవిచ్, ఫెడరర్ నుంచి పెను ప్రమాదం ఉంది.
సులువుగా ముందంజ : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వరుసగా రెండో రోజు ఎటువంటి సంచలనాలు నమోదు కాలేదు. స్టార్ ఆటగాళ్లు తొలి రౌండ్లో సులువైన విజయాలు నమోదు చేశారు. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ రఫెల్ నాదల్ వరుస సెట్లలో గెలుపొందాడు. ఐదు ఏస్‌లు సంధించిన నాదల్ 8 బ్రేక్ పాయింట్లు సాధించాడు. ఐదు డబుల్ ఫాల్ట్స్‌కు పాల్పడినా ప్రత్యర్థిని నిలువరించాడు. స్విస్ స్టార్ స్టానిస్లాస్ వావ్రింకా 7-5, 6-7(4-7), 6-4, 6-4తో పోరాడి గెలిచాడు. దామిర్ రెండో సెట్లో వావ్రింకాకు షాకిచ్చినా తర్వాత సెట్లలో సులువుగానే తలొగ్గాడు. ఐదో సీడ్ డొమినిక్ థీమ్ 6-3, 7-5, 6-2తోత ఆడ్రియన్‌పై విజయం సాధించాడు. 19 గేమ్‌లు గెల్చుకున్న థీమ్ ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిపత్యం చూపించాడు. క్రొయేషియా ఆటగాడు మారిన్ సిలిచ్ 6-3, 6-2, 6-4తో వరుస సెట్లలో కొర్టెన్పై విజయం సాధించాడు. క్వాలిఫయర్స్ నుంచి ప్రధాన టోర్నీకి అర్హత సాధించిన భారత వర్థమాన ఆటగాడు ప్రజ్ఞేశ్ గున్నేశ్వరన్ మెల్బోర్న్లో నిరాశపరిచాడు. జపాన్ ఆటగాడు ఇటో చేతిలో 4-6, 2-6, 5-7తో వరుస సెట్లలో ఓటమి పాలయ్యాడు. 13 ఏస్‌లు సంధించిన ప్రజ్ఞేశ్ కేవలం 11 గేములే నెగ్గాడు. జపాన్ ఆటగాడు 19 గేమ్‌లు గెల్చుకుని సత్తా చాటాడు. ఆస్ట్రేలియా ఆటగాడు జాన్ మిల్‌మ్యాన్ 7-6(7-3), 6-3, 1-6, 7-5తో హంబర్ట్‌పై గెలుపొందాడు.
మహిళల సింగిల్స్‌లో నాల్గో సీడ్ సిమోన హలెప్ 7-5(7-5), 6-1తో అమెరికా అమ్మాయి జానీఫర్ బ్రాడీపై వరుస సెట్లలో పైచేయి సాధించింది. మాజీ వరల్డ్ నం.1, జర్మనీ భామ ఎంజెలికా కెర్బర్ 6-2, 6-2తో తొలి రౌండ్లో సులువైన విజయం నమోదు చేసింది. గార్బినె ముగురుజా (స్పెయిన్) 0-6, 6-1, 6-0తో అపూర్వ విజయం సాధించింది. అమెరికా అమ్మాయి రోజర్స్ తొలి సెట్లో భయపెట్టినా తర్వాత వరుస సెట్లలో ముగురుజా సత్తా చాటింది. జెలినా ఒస్టాపెంకో 6-1, 6-4తో రష్యా ప్లేయర్ సమసోనోవపై 6-1, 6-4తో గెలుపొందింది.