Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో రౌండ్లో స్పెయిన్ బుల్
- గాయంతో సానియా మీర్జా అవుట్
- ఆస్ట్రేలియన్ ఓపెన్ 2020
మెల్బోర్న్ (ఆస్ట్రేలియా) : స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్కు ఎదురు లేకుండా పోయింది. సహచర దిగ్గజం రోజర్ ఫెదరర్ 20 గ్రాండ్‌స్లామ్ రికార్డు సమం చేసేందుకు మెల్బోర్న్కు వచ్చిన రఫెల్ నాదల్ ఆ దిశగా వరుసగా రెండో మ్యాచ్‌లో అలవోక విజయం సాధించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ పోరులో వరల్డ్ నం.1, టాప్ సీడ్ రఫెల్ నాదల్ 6-3, 7-6(7-4) 6-1తో అర్జెంటీనా ఆటగాడు ఫెడిరికో డెల్బోనిస్పై అలవోక విజయం నమోదు చేశాడు. 8 ఏస్‌లు సంధించిన రఫెల్ నాదల్ 10 సర్వ్‌లు నిలుపుకుని ఆధిపత్యం చెలాయించాడు. మూడు సెట్లలో అర్జెంటీనా ఆటగాడి నుంచి ఒక్క సెట్లో మాత్రమే స్పెయిన్ బుల్‌కు గట్టి పోటీ ఎదురైంది. స్విస్ స్టార్ స్టానిస్లాస్ వావ్రింకా సైతం మూడో రౌండ్లో కాలుమోపాడు. 4-7 7-5, 6-3, 3-6, 6-4తో ఆండ్రీ సెప్పీతో ఉత్కంఠ ఐదు సెట్ల సమరంలో పైచేయి సాధించాడు. ఆస్ట్రేలియా వివాదాస్పద స్టార్ నిక్ కిర్గియోస్ 6-2, 6-4, 4-6, 7-5తో గిల్స్ సిమోన్పై గెలుపొంది, మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. జాన్ ఇస్నర్ 6-4, 6-3, 6-3తో తబిలోపై గెలుపొందాడు. డెవిడ్ గోఫిన్ 6-1, 6-4, 1-6, 6-3తో హెర్బర్ట్‌పై నెగ్గగా, మోన్ఫిల్స్ 4-6, 7-6(10-8), 6-4, 7-6తో కార్లోవిచ్పై గెలుపొందాడు.
మహిళల సింగిల్స్‌లో నాల్గో సీడ్ సిమోన హలెప్ 6-2, 6-4తో వరుస సెట్లలో అలవోక విజయం నమోదు చేసింది. ఎలినా స్విటోలినా సైతం 6-2, 7-6(8-6)తో డెవిస్పై గెలుపొందింది. ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) 6-3, 6-2తో ఆస్ట్రేలియా అమ్మాయి హాన్‌ను ఓడించింది. కరొలినా ఫ్లిస్కోవా 6-3, 6-3తో సులువుగా మూడో రౌండ్‌కు చేరుకుంది. ముగురుజా 6-3, 3-6, 6-3తో మూడు సెట్ల మ్యాచ్‌లో ఆసీస్ అమ్మాయిపై పైచేయి సాధించింది. మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా కథ ముగిసింది. తొలి రౌండ్లో 2-6 0-1తో ఉన్న సమయంలో కుడి కాలి కండరం గాయం తీవ్రంగా వేధించగా, పోటీ నుంచి సానియా తప్పుకుంది. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ రఫెల్ నాదల్ మ్యాచ్‌తో పాటు అభిమానుల హృదయాలను గెల్చుకున్నాడు. ర్యాలీలో భాగంగా ఓ బంతిని బాల్ గర్ల్ తలకేసి కొట్టాడు. ప్రమాదశావత్తు జరిగిన ఘటనతో వెంటనే అమ్మాయి వద్దకు వెళ్లిన నాదల్, నుదుటిపై ముద్దిచ్చాడు. బంతి అమ్మాయి వైపు బలంగా వెళ్లటంతో ఎంతో భయపడ్డాను, చిన్నారికి ఏం కాకపోవటంతో ఊపిరీ పీల్చుకున్నానని నాదల్ పేర్కొన్నాడు.