Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి టైటిల్ కోసం బంగ్లా
- ఐదో ట్రోఫీ వేటలో భారత్
- అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్ నేడు
- మ. 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో...
పోచ్ (దక్షిణాఫ్రికా) : ఆదివారం పోచ్ స్టేడియంలో చరిత్రకు నాంది పడనుంది!. యువ భారత్ గెలిస్తే అండర్-19 క్రికెట్లో ఐదు సార్లు చాంపియన్‌గా నిలిచిన జట్టు కానుంది. యువ బంగ్లా అండర్-19 వరల్డ్‌కప్ సాధిస్తే, ఏ స్థాయిలోనైనా బంగ్లాదేశ్‌కు తొలి ప్రపంచకప్ విజయం అవనుంది. అండర్-19 ప్రపంచకప్‌లో భారత్, బంగ్లాదేశ్‌లు అజేయ రికార్డులో ఫైనల్స్‌కు చేరుకున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసి, ప్రత్యర్థిని ఆలౌట్ చేస్తూ సత్తా చాటింది యువ భారత్. ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యాలను అలవోకగా ఛేదిస్తూ చరిత్ర వైపు అడుగులు వేసింది యువ బంగ్లా. ఇప్పుడీ రెండు జట్లు అంతిమ పోరాటంలో అమీతుమీకి సిద్ధమయ్యాయి. 2020 ప్రపంచకప్‌కు భారత్, బంగ్లాదేశ్‌లు సమదూరంలో ఉన్నాయి. ఉత్కంఠగా సాగనున్న టైటిల్ పోరులో అంతిమ విజయం ఎవరిదో చూడాలి.
యువ జోరు సాగేనా? : ప్రపంచకప్‌లో భారత్ అన్ని రంగాల్లోనూ అజేయంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ సహా ఫీల్డింగ్‌లోనూ కండ్లుచెదిరే ప్రదర్శన చేస్తోంది. టాప్ ఆర్డర్లో యశస్వి జైస్వాల్ అత్యంత కీలక ఆటగాడు. ప్రత్యర్థి తొలుత జైస్వాల్ వికెట్‌పై ఫోకస్ చేయనుంది. టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచిన జైస్వాల్ తెలిసిన పిచ్‌పై మరో శతకం బాదేందుకు ఎదురుచూస్తున్నాడు. దివ్యాన్షు సక్సెనా సైతం ఇక్కడ అజేయ అర్ధ సెంచరీ కొట్టాడు. మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ, ద్రువ్ జురెల్, ప్రియాం గార్గ్‌లు భారత్‌కు ముఖ్యం. పవర్ ప్లేలోనే స్పిన్ ప్రయోగంతో జైస్వాల్, సక్సెనాలకు చెక్ పెట్టాలని బంగ్లా భావిస్తోంది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లతో ఆడుకోవాలని తిలక్, ప్రియాం, ధ్రువ్‌లు చూస్తున్నారు. లోయర్ ఆర్డర్లో సిద్దేశ్ వీర్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఛేదనలో, లక్ష్య నిర్దేశనలో వీర్‌ను నిలువరించటం బంగ్లా బౌలర్లకు సవాల్. బంతితో కార్తీక్ త్యాగి, రవి బిష్ణోరు సహా ఆకాశ్ సింగ్‌లు బంగ్లా బ్యాటింగ్ లైనప్‌తో తేల్చుకోనున్నారు. ఆడిన ఐదు మ్యాచుల్లో 50 వికెట్లతో బౌలర్లు జోరుమీదున్నారు.
బంగ్లా బలంగానే.. : సీనియర్ క్రికెట్లో బంగ్లా ఇప్పుడు మెరుగైన జట్టు. కానీ జూనియర్ క్రికెట్లో బంగ్లాదేశ్ అగ్ర జట్టు హౌదా దక్కించుకుంది!. బంగ్లాదేశ్ యువ క్రికెటర్లు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. మహ్మదుల్ హసన్, తోవిద్, పర్వెజ్, హసన్‌లు బ్యాటింగ్ ఆర్డర్లో బంగ్లాకు కీలకం కానున్నారు. బౌలింగ్ విభాగంలో హసన్ మురాద్, హసన్ షకిబ్, ఇస్లాంలు భారత్‌కు సవాల్ విసరనున్నారు. ఆడిన అన్ని మ్యాచుల్లో అజేయ ప్రదర్శనతో బంగ్లాదేశ్ తొలి వరల్డ్‌కప్ వేటలో కసిగా సాగుతోంది. భారత్ ఆయుధాలకు అన్నింటికి బంగ్లాదేశ్ వద్ద దీటైన జవాబు సిద్ధంగా ఉంది. 2018 వరల్డ్‌కప్ క్వార్టర్ఫైనల్లో బంగ్లాపై భారత్ నెగ్గింది. ఆ తర్వాత జరిగిన ఏడు మ్యాచుల్లో రెండింట ఫలితం తేలలేదు. 4-1తో భారత్ పైచేయి సాధించింది. ఫలితం ఐదు మ్యాచుల్లోనూ ఇరు జట్ల మధ్య వ్యత్యాసం స్వల్పం. దీంతో నేడు ఫైనల్లోనూ మ్యాచ్ అదే రీతిలో ఉత్కంఠగా సాగనుంది.
పిచ్ రిపోర్టు : భారత్, పాకిస్థాన్ తొలి సెమీఫైనల్స్‌కు వాడిన పిచ్‌నే నేడు టైటిల్ పోరుకు ఉపయోగిస్తున్నారు. ఈ మైదానంలో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 201!. సెమీస్‌లో పాకిస్థాన్ సైతం ఇక్కడ స్వల్ప స్కోరుకు ఆలౌట్ కాగా, భారత్ వికెట్ కోల్పోకుండా ఛేదించింది. నేడూ పిచ్ అదేవిధంగా స్పందించనుంది. ఇరు జట్ల పేసర్లు ఇక్కడ కీలకం కానున్నారు. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది!.
తుది జట్లు (అంచనా)
భారత్ : యశస్వి జైస్వాల్, దివ్యాన్షు సక్సెనా, తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్, ప్రియాం గార్గ్, సిద్దేశ్ వీర్, అతర్వ, రవి బిష్ణోరు, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, ఆకాశ్ సింగ్.
బంగ్లాదేశ్ : పర్వెజ్ హుస్సేన్, తన్జిద్ హసన్, మహ్మదుల్ హసన్ జాయ్, తౌహిద్ హృదరు, సహదత్ హుస్సేన్, షమిమ్ హుస్సేన్, అక్బర్ అలీ, రాకిబుల్ హసన్, ఇస్లాం, తన్జిమ్ హసన్ షకిబ్, హసన్ మురాద్.