Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోహ్లిసేనకు తొలి వైట్‌వాష్ ముప్పు
- 3-0 విజయంపై కివీస్ గురి
- ఉ. 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
మూడు దశాబ్దాలు గడిచింది. టీమ్ ఇండియా ఓ వన్డే సిరీస్‌లో ఓటమి చవిచూసి. 1989లో కరీబియన్ పర్యటనలో 0-5తో వైట్ వాష్ పరాజయం పాలైన భారత్.. ఇప్పుడు కివీస్ గడ్డపై మరో వైట్‌వాష్ ఓటమి ప్రమాదంలో నిలిచింది. 0-2తో ఇప్పటికే సిరీస్ కోల్పోయిన కోహ్లిసేన నేడు వైట్‌వాష్ ఓటమిని అడ్డుకునేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. తొలి ప్రాధాన్య ఆటగాళ్లు గాయాలతో దూరమైనా, సిరీస్‌ను సొంతం చేసుకున్న న్యూజిలాండ్ నేడు నాయకుడు కేన్ విలియమ్సన్ రాకతో క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. భారత్, న్యూజిలాండ్ మూడో వన్డే పోరు నేడు.
నవతెలంగాణ-మౌంట్మౌంగానుయ్:
టీ20 సిరీస్‌కు, వన్డే సిరీస్‌కు ఒకే విధమైన పరిస్థితులు. కానీ టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్ కోసం ఎదురు చూసిన జట్టు ఇప్పుడు వైట్‌వాష్‌ను ఆపేందుకు ఆరాటపడుతుంది. అప్పుడు వైట్‌వాష్‌కు గురికాకుండా చూడాలనకున్న జట్టు ఇప్పుడు క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. టీమ్ ఇండియా 5-0తో టీ20 సిరీస్ సొంతం చేసుకోగా.. వన్డే సిరీస్‌ను 3-0తో దక్కించుకోవాలని ఆతిథ్య న్యూజిలాండ్ రంగం సిద్ధం చేసుకుంది. మూడు దశాబ్దాల తర్వాత భారత్ వైట్‌వాష్ ముంగిట నిలిచిన అరుదైన తరుణంలో భారత్, న్యూజిలాండ్ మూడో వన్డే నేడు.
బెంచ్‌కు అవకాశం చిక్కేనా? : ఈ ఏడాది టీ20, టెస్టు ఫార్మాట్లపై ఎక్కువ ఫోకస్ చేసిన కోహ్లిసేన.. వన్డే సిరీస్ ఓటమిని సిరీయస్‌గా తీసుకోవటం లేదు. న్యూజిలాండ్ పర్యటనలో తొలి అవకాశం కోసం ఎదురుచూస్తున్న బెంచ్ ఆటగాళ్లకు నేడు అవకాశం లభించే వీలుంది. వాంఖడే వన్డే తర్వాత రిషబ్ పంత్ తుది జట్టులో కనిపించటం లేదు. కివీస్ పిచ్‌లపై అవగాహన కోసమైనా, రిషబ్ పంత్‌కు నేడు అవకాశం దక్కాలని విశ్లేషకులు కోరుతున్నారు. ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ ఆఖర్లో ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నా, బంతితో జాదవ్ పాత్రపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వన్డే వరల్డ్‌కప్ తర్వాత జాదవ్ కేవలం ఒకే ఒక్క ఓవరే వేశాడు. పేస్ ఆల్‌రౌండర్ శివం దూబె గత 9 వన్డేలుగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో జశ్‌ప్రీత్ బుమ్రాకు టెస్టు సిరీస్‌కు ముందు విశ్రాంతి దక్కనుంది. కుల్దీప్ను కాదని మరోమారు చాహల్ స్పిన్నర్‌గా కొనసాగనున్నాడు.
బ్యాటింగ్ లైనప్‌లో ఓపెనర్లు పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్‌లు రెండు వన్డేల్లో రాణించలేకపో యారు. మూడో వన్డేలోనైనా ఓపెనర్లుగా తమ స్థానానికి న్యాయం చేయాలని ఆశిస్తు న్నారు. విరాట్ కోహ్లి, శ్రేయష్ అయ్యర్, కెఎల్ రాహుల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. కేదార్ జాదవ్, మనీశ్ పాండేలకు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ లభించే అవకాశం లేకపోలేదు. రవీంద్ర జడేజా సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. పరాజయాన్ని ద్వేషించే కోహ్లి వైట్‌వాష్ ఓటమిని అంత సులువుగా దరిచేరనిస్తాడా? చూడాలి.
కేన్ వచ్చాడు, క్లీన్‌స్వీప్ చేస్తాడా? : కేన్ విలియమ్సన్, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గుసన్, మాట్ హెన్రీ ఇదీ న్యూజిలాండ్ స్టార్ ఆటగాళ్ల గాయాల జాబితా. రెండో వన్డేలో ఏకంగా సబ్‌స్టిట్యూట్ ఆటగాడు లేక, ఫీల్డింగ్ కోచ్ ల్యూక్ రోంచి మైదానంలోకి రావాల్సి వచ్చింది. టిమ్ సౌథీ జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో ఇశ్ సోధిని తిరిగి ఫస్ట్ క్లాస్ క్రికెట్ జట్టు నుంచి రప్పించారు. భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్న కేన్ విలియమ్సన్ మూడో వన్డేకు సిద్ధమవుతున్నాడు. స్టార్స్ అండ లేకపోయినా, జట్టు తత్వంతో సిరీస్ సొంతం చేసుకుంది న్యూజిలాండ్. కెప్టెన్ కేన్ విలియమ్సన్ రాకతో టాప్ ఆర్డర్ మరింత బలోపేతమైంది. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్, హెన్రీ నికోల్స్ ఫామ్‌లోకి వచ్చారు. రాస్ టేలర్ కివీస్ విజయాల్లో ముఖ్య భూమిక వహిస్తున్నాడు. కేన్ విలియమ్సన్కు మౌంట్మౌంగానురు సొంత మైదానం. ఫామ్‌లో ఉన్న కేన్, టేలర్‌ను నిలువరించటం భారత బౌలర్లకు సవాలే. ఆల్‌రౌండర్లు జిమ్మీ నీషమ్, గ్రాండ్హౌమ్లు బాధ్యతాయుత ప్రదర్శన చేయాల్సి ఉంది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ టామ్ లేథమ్ ఫామ్ కొనసాగించాల్సి ఉంది. బౌలింగ్ విభాగంలో కైల్ జెమీసన్, సౌథీ, సోధి, బెనెట్లు భారత బ్యాట్స్‌మెన్ జోరుకు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమవుతున్నారు.
పిచ్ రిపోర్టు : బే ఓవల్ మైదానంలో భారత్‌కు తిరుగులేని రికార్డుంది. ఇక్కడ ఆడిన రెండు వన్డేల్లోనూ విజయాలు సాధించింది. ఇక్కడ జరిగిన టీ20 మ్యాచ్‌లో పిచ్ ఫ్లాట్‌గా స్పందించింది. నేడూ వన్డే మ్యాచ్‌లో బౌలర్లకు సహకారం లభించనుంది. మూడో వన్డేకు అనుకూల వాతావరణం నెలకొంది. టాస్ నెగ్గిన జట్టు ఛేదనకు మొగ్గు చూపనుంది.
2/0:మౌంట్మౌంగానురులో భారత్ గెలుపు రికార్డు వంద శాతం. ఇక్కడ ఆడిన రెండు వన్డేల్లోనూ టీమ్ ఇండియా విజయాలు సాధించింది.
1989:మూడు అంతకంటే ఎక్కువ మ్యాచుల వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియా వైట్‌వాష్‌కు చివరగా గురైనది 1989 వెస్టిండీస్ పర్యటనలో. ఆ సిరీస్‌ను భారత్ 0-5తో కోల్పోయింది.
తుది జట్లు (అంచనా)
భారత్ :మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, విరాట్ కోహ్లి, శ్రేయష్ అయ్యర్, కెఎల్ రాహుల్/రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్/మనీశ్ పాండే/శివం దూబె, శార్దుల్ ఠాకూర్, యుజ్వెంద్ర చాహల్, నవదీప్ సైని, మహ్మద్ షమి.
న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, హెన్రీ నికోల్స్, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, టామ్ లేథమ్, జిమ్మీ నీషమ్, కొలిన్ డీ గ్రాండ్‌హౌమ్, టిమ్ సౌథి, కైల్ జెమీసన్, ఇశ్ సోధి, హమిశ్ బెనెట్.