Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగు తేజం అజేయ సెంచరీ
- రాణించిన చతేశ్వర్ పుజార
- భారత్ తొలి ఇన్నింగ్స్ 263 ఆలౌట్
- కివీస్ ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్
పరిస్థితులను అవగతం చేసుకోవాలని కోరి మరీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పచ్చికతో కూడిన పిచ్. బంతి వేగంగా దూసుకొస్తుంది. బౌలర్లకు స్వింగ్ సైతం లభిస్తోంది. ఉదయం తొలి గంట పోరాడితే చాలు.. బ్యాటింగ్ సులభతరం కానుంది. ఓపెనింగ్ రేసులో ముగ్గురు బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా (0), మయాంక్ (1), శుభ్‌మన్ (0) చేతులెత్తేశారు. 5/3తో కష్టాల్లో పడిన భారత్‌ను తెలుగు తేజం హనుమ విహారి (101) శతకంతో ఆదుకున్నాడు. పుజార (93) సమయోచిత ఇన్నింగ్స్‌తో మెరిసినా.. ఆఖరు ఐదు వికెట్లను 18 పరుగులకే కోల్పోయిన భారత్ 263 పరుగులకే కుప్పకూలింది.
నవతెలంగాణ-హామిల్టన్
తెలుగు తేజం హనుమ విహారి (101 రిటౌర్డ్ ఔట్, 182 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు శతకంతో కదం తొక్కాడు. న్యూజిలాండ్-ఏపై ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ బాదిన విహారి.. ఆ ఫామ్‌ను కొనసాగించాడు. టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజార (93, 211 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) ఐదో వికెట్‌కు వికెట్‌కు 195 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించాడు. న్యూజిలాండ్ ఎలెవన్‌తో మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో భారత్‌ను ఆదుకున్నాడు. ఓపెనర్లు పృథ్వీ షా (0), మయాంక్ అగర్వాల్ (1), శుభ్‌మన్ గిల్ (0) దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ విరాట్ కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దూరంగా ఉన్నాడు. తొలి రోజు 78.5 ఓవర్లలో భారత్ 263 పరుగులకే కుప్పకూలింది. నేడు బౌలింగ్ బృందం బుమ్రా, నవదీప్ సైని, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, అశ్విన్, జడేజాలు పెద్ద పరీక్ష ఎదుర్కొన్నారు.
కొత్త బంతికి దాసోహం : న్యూజిలాండ్ పిచ్‌లపై కొత్త బంతిని ఎదుర్కొవటం కష్టసాధ్యమైన పని. ఇక్కడ బంతిని గాల్లోనే బాదలేం. బౌలర్లకు ఇక్కడ ఆలస్యంగా స్వింగ్ లభిస్తుంది. బ్యాట్స్‌మెన్ ముందుగానే షాట్‌కు వెళ్తే, బంతి గమనంలో తేడాతో ఎడ్జ్ తీసుకునే ప్రమాదం చాలా ఎక్కువ. అందుకే బంతిని బ్యాట్స్‌మన్ చాలా దగ్గర నుంచి ఆడాలి. అలాగని మరీ ఆలస్యంగా ఎదుర్కొనేందుకు వీల్లేదు. ఈ సవాల్ ఎదుర్కొవటంలో భారత్ తొలి ప్రయత్నంలో విఫలమైంది. స్కాట్ షార్ట్ లెంగ్త్‌లో సంధించిన బంతికి పృథ్వీ షా షార్ట్ లెగ్‌లోనే క్యాచౌట్‌గా దొరికిపోయాడు. ఆఫ్‌స్టంప్‌కు ఆవల వేసిన బంతికి మయాంక్ వికెట్ల వెనకాల చిక్కాడు. షార్ట్ బంతులకు న్యూజిలాండ్‌కు వికెట్లు ఇవ్వకుండా చూడాలని మ్యాచ్‌కు ముందు పేర్కొన్న శుభ్‌మన్ గిల్ (0) ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్ కోల్పోయాడు. చివరి మూడు ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్‌ల్లో 83, 204, 136 పరుగులు చేసిన గిల్ స్కాట్ వేసిన షార్ట్ బంతికి వికెట్ కోల్పోయాడు. కివీస్ సీమర్ తన తొలి 3.2 ఓవర్లలోనే టాప్ ఆర్డర్లో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ను (ఓపెనింగ్ రేసులో నిలిచిన ముగ్గురు) పెవిలియన్‌కు చేర్చాడు. షా, మయాంక్, గిల్ నిష్క్రమణతో భారత్ 5/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది.
విహారి, పుజార భళా : కొత్త బంతిని ఎదుర్కొవటం ఎంత కఠినమో, సహనంతో బంతి పాతబడే వరకూ ఎదురుచూస్తే పరుగులు చేయటమూ కివీస్ గడ్డపై అంత సులువు!. పుజారతో కలిసి 33 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అజింక్య రహానె (18) కుదురుకున్నట్టే కనిపించాడు. కానీ నాల్గో స్టంప్‌కు వేసిన బంతిని ఆడేందుకు ప్రయత్నించి స్లిప్స్‌లో దొరికిపోయాడు. ఈ సమయంలో పుజారతో జతకలిసిన తెలుగు తేజం హనుమ విహారి (101) మెగా భాగస్వామ్యం నిర్మించాడు. పేస్ బౌలర్లపై అడ్డంగా షాట్లు ఆడేందుకు నిరాకరించిన ఈ జోడీ సహనంతో క్రీజులో నిలిచింది. 182 బంతుల్లో 101 పరుగులు చేసిన విహారి పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. కానీ స్పిన్నర్లను ఎదురించటంలో తెగువ చూపించలేదు. స్పిన్నర్ సోధిపై విహారి మూడు సిక్సర్లు బాదినా, మాయగాళ్లను నమ్మకంగా ఆడలేదు. మరో ఎండ్‌లో పుజార తను ఎదుర్కొన్న 80 బంతుల తర్వాత గానీ తొలి బౌండరీ కొట్టలేదు. 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో రాణించిన పుజార 93 పరుగుల వద్ద వికెట్ కోల్పోయాడు. శతకం తర్వాత విహారి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
ఆఖర్లో టపటపా : సెంచరీకి ఏడు పరుగుల దూరంలో పుజార వికెట్ కోల్పోయాడు. అప్పటికీ భారత్ స్కోరు 233/5. కొద్దిసేపటికే విహారి పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. అప్పటికి స్కోరు 245/6. విహారి నిష్క్రమణతో టీమ్ ఇండియా బ్యాటింగ్ లైనప్ (లోయర్ ఆర్డర్) పేకమేడలా కుప్పకూలింది. రిషబ్ పంత్ (7), వృద్దిమాన్ సాహా (0), రవిచంద్రన్ అశ్విన్(0), రవీంద్ర జడేజా (8)లు పెవిలియన్‌లో ఏదో అత్యవసర పని ఉన్నట్టుగా అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. దీంతో భారత్ 263 పరుగులకే కుప్పకూలింది. భారత్ చివరి ఐదు వికెట్లను 18 పరుగులకే కోల్పోయింది. న్యూజిలాండ్ బౌలర్లలో స్కాట్ 3/40), ఇశ్ సోధి (3/72), గిబ్సన్ (2/26) రాణించారు. న్యూజిలాండ్ ఎలెవన్ నేడు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రానుంది. ఉదయం తొలి గంటలో భారత పేసర్ల ప్రదర్శనపై ఇప్పుడు ఆసక్తి ఎక్కువైంది.
భారత్ తొలి ఇన్నింగ్స్ : పృథ్వీ షా (సి) రవీంద్ర (బి) స్కాట్ 0, మయాంక్ అగర్వాల్ (సి) క్లీవెర్ (బి) స్కాట్ 1, చతేశ్వర్ పుజార (సి) క్లీవెర్ (బి) గిబ్సన్ 93, శుభ్‌మన్ గిల్ (సి) సీఫర్ట్ (బి) స్కాట్ 0, అజింక్య రహానె (సి) బ్రూస్ (బి) నీషమ్ 18, హనుమ విహారి (రిటౌర్డ్ హర్ట్) 101, రిషబ్ పంత్ (సి) స్కాట్ (బి) గిబ్సన్ 7, వృద్దిమాన్ సాహా (సి) క్లీవెర్ (బి) గిబ్సన్ 0, అశ్విన్ (ఎల్బీ) సోధి 0, ఉమేశ్ యాదవ్ నాటౌట్ 9, రవీంద్ర జడేజా (సి) అలెన్ (బి) సోధి 8, ఎక్స్‌ట్రాలు : 26, మొత్తం : (78.5 ఓవర్లలో ఆలౌట్) 263.
వికెట్ల పతనం : 1-0, 2-5, 3-5, 4-38, 5-233, 6-245, 7-246, 8-246, 9-250, 10-263.
బౌలింగ్ : స్కాట్ 14-2-40-3, టిక్నర్ 15-3-37-0, డార్లీ మిచెల్ 7-1-15-0, జిమ్మీ నీషమ్ 13-3-29-1, గిబ్సన్ 10-1-26-2, ఇశ్ సోధి 14.5-0-72-3, రచిన్ రవీంద్ర 5-1-30-0.