Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్ ప్రాంఛైజీల నిర్ణయం
- ఐపీఎఎల్పై కరోనా వైరస్ ఎఫెక్ట్
క్రీడా రంగంపై కరోనా వైరస్ పంజా విసిరింది. వేగంగా వ్యాపిస్తూ, ప్రజలను భయాందోళనకు గురి చేస్తోన్న ప్రమాదకర కరోనా వైరస్ మహమ్మారి ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వాయిదాకు కారణమైంది. బిలియన్ డాలర్ల ఖర్చుతో సిద్ధమవుతున్న టోక్యో 2020 ఒలింపిక్స్‌ను సైతం కరోనా వైరస్ భయపెడుతోంది. ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించటం వివాదానికి దారితీస్తోంది. కరోనా వైరస్‌కు దెబ్బకు తాజాగా ఐపీఎల్ ప్రాంఛైజీలు శిక్షణా శిబిరాలను రద్దు చేశాయి.
నవతెలంగాణ-బెంగళూర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఏప్రిల్ 15కు వాయిదా పడటంతో, ఎనిమిది ప్రాంఛైజీలు శిక్షణ శిబిరాలను మూసివేశాయి!. మార్చి 29న ఆరంభం కావాల్సిన ఐపీఎల్ 13 కోసం ఇప్పటికే కొన్ని ప్రాంఛైజీలు శిక్షణ శిబిరాలను మొదలెట్టగా, మరికొన్ని ప్రాంఛైజీలు ఈ వారంలోనే ఆరంభించేందుకు సిద్ధమయ్యాయి. కానీ లీగ్ ఏప్రిల్ 15కు వాయిదా పడటం, ఆ తర్వాత సైతం ఐపీఎల్ సాగుతుందనే నమ్మకం లేకపోవటంతో ప్రాంఛైజీలు ఖర్చు తగ్గించుకునే పనిలో నిమగమ్యాయి. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత నైట్‌రైడర్స్‌లు ఆటగాళ్ల శిక్షణ శిబిరాలను వాయిదా వేశాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఈ మేరకు సోమవారం ట్వీటర్లో పోస్ట్ చేసింది. మార్చి 21 నుంచి బెంగళూర్‌లో ఆర్సీబీ క్యాంప్ ఆరంభం కావాల్సి ఉంది. కరోన వైరస్ కర్ణాటకలో కలకలం రేపుతుండటం, ఐపీఎల్ నిర్వహణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించటంతో ఆర్సీబీ ఈ నిర్ణయం తీసుకుంది.
క్యాంపులు రద్దు : మూడుసార్లు ఐపీఎల్ విజేత సుమారు రెండు నెలలుగా ప్రీ సీజన్ క్యాంపు నిర్వహిస్తోంది. అందుబాటులోని ఆటగాళ్లు చెన్నైలోని శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నారు. సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎం.ఎస్ ధోని మార్చి 2 నుంచి చెపాక్‌లో సాధన చేస్తున్నాడు. ధోని రాకతో చెన్నైలో ముందుగానే ఐపీఎల్ సందడి మొదలైంది. కరోనా వైరస్ భయపెడుతున్నా అభిమానులతో కరచాలనం చేస్తూ, ఆటోగ్రాఫులు ఇస్తూ మహి కనిపించాడు. ప్రభుత్వ ఆంక్షలు, ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్‌ను ఏప్రిల్ 15కు వాయిదా వేయటంతో, ప్రాంఛైజీల శిక్షణ శిబిరాలపై ఆ ప్రభావం పడింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్ల క్యాంపును రద్దు చేసింది. మహేంద్రసింగ్ ధోని ఇప్పటికే చెన్నైని వీడి రాంచీకి చేరుకున్నాడు. సురేశ్ రైనా, అంబటి రాయుడు సైతం చెన్నై శిక్షణ శిబిరం నుంచి వెళ్లిపోయారు. నాలుగు సార్లు విజేత ముంబయి ఇండియన్స్ సైతం ఇప్పటికే ప్రీ సీజన్ క్యాంపును ఆరంభించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ముంబయి ఇండియన్స్ సైతం శిక్షణా శిబిరాన్ని వాయిదా వేసింది. ' అందరి ఆరోగ్యాన్ని గమనంలో ఉంచుకుని మార్చి 21 నుంచి ఆరంభం కావాల్సిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ట్రైనింగ్ క్యాంప్‌ను వాయిదా వేస్తున్నాం. శిక్షణ శిబిరంపై అప్డేట్ ఇచ్చేంత వరకూ వాయిదా కొనసాగుతుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన మార్గదర్శకాలను పాటించి క్షేమంగా ఉండాలని కోరుతున్నాం' అని ఆర్సీబీ ట్వీట్ చేసింది.
కరోనా బాధిత క్రీడా ఈవెంట్లు
క్రికెట్ :
- భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ను రద్దు చేశారు. ఈ సిరీస్ షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని బీసీసీఐ పేర్కొంది.
- ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మార్చి 29 నుంచి ఏప్రిల్ 15కు వాయిదా పడింది. ఏప్రిల్ 16 నుంచి మొదలవుతుందనే నమ్మకం ఎవరిలోనూ లేదు.
- ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ 2, 3వ వన్డేలు, టీ20 సిరీస్‌లు రద్దు
ఆర్చరీ :
- షాంఘైలో జరగాల్సిన ఆర్చరీ ప్రపంచకప్ రద్దు/వాయిదా
బ్యాడ్మింటన్ :
- చైనా మాస్టర్స్ వాయిదా పడింది.
- ఆసియా టీమ్ చాంపియన్‌షిప్స్ నుంచి చైనా, హాంగ్‌కాంగ్‌లు తప్పుకున్నాయి.
- కీలక జర్మనీ ఓపెన్ రద్దు చేయబడింది.
- ఆసియా చాంపియన్‌షిప్స్ చైనా నుంచి మనీలాకు మార్చబడింది.
- ఇండియా ఓపెన్, స్విస్ ఓపెన్, మలేషియా ఓపెన్, సింగపూర్ ఓపెన్ రద్దు
టెన్నిస్ :
- అన్ని ఐటా (అఖిల భారత టెన్నిస్ సంఘం) టోర్నీలు రద్దు
- బిఎన్పీ పారిబస్ ఓపెన్ రద్దు
- మియామి ఓపెన్, మోంటో కార్లో మాస్టర్స్ రద్దు
అథ్లెటిక్స్ :
- నాన్జింగ్లో జరగాల్సిన ప్రపంచ ఇండోర్ చాంపియన్‌షిప్స్ మార్చి 2021కు వాయిదా.
ఫీల్డ్ హాకీ :
- భారత జట్టు జపాన్ పర్యటన రద్దు (జూనియర్ మహిళల ఆసియా కప్)
2. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ మ్యాచులను ఏప్రిల్ 15 వరకు వాయిదా
బాస్కెట్‌బాల్ :
- మార్చి 11 నుంచి ఎన్బిఎ (నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్) మ్యాచులు రద్దు
షూటింగ్ :
- మే 5-12, జూన్ 2-9న జరగాల్సిన షూటింగ్ ప్రపంచకప్ రద్దు
- టోక్యో ఒలింపిక్ టెస్టు ఈవెంట్ రద్దు
బాక్సింగ్ :
- ఆసియా ఓసియాన ఒలింపిక్ క్వాలిఫయర్ చైనా నుంచి జోర్డాన్‌కు మార్పు
- జర్మనీలో జరగాల్సిన బాక్సింగ్ వరల్డ్‌కప్ రద్దు
ఫార్ములా వన్ :
- ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రీ రద్దు
- బహ్రెయిన్ గ్రాండ్‌ప్రీ వాయిదా
- వియత్నాం గ్రాండ్‌ప్రీ వాయిదా
- చైనీస్ గ్రాండ్ ప్రీ వాయిదా
ఫుట్‌బాల్ :
- ఈ వారం జరగాల్సిన చాంపియన్స్ లీగ్, యూరో లీగ్ మ్యాచులు వాయిదా
- ఈపీఎల్, ఎఫ్ఏ కప్ ఏప్రిల్ 4కు వాయిదా