Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ధోని, కోహ్లి, రైనా, జహీర్లకు చోటు
-ఈ ఆదివారం ఆరంభం కావాల్సిన ఐపీఎల్13
-కరోనాతో సందిగ్ధంలోనే ఐపీఎల్ 2020
నవతెలంగాణ క్రీడా విభాగం
మార్చి 29, 2020. ముంబయి వాంఖడే మైదానం. డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్, ఫైనలిస్ట్ చెన్నై సూపర్ కింగ్స్‌లు వరుసగా రెండో సీజన్లో ఆరంభ మ్యాచ్‌లో తలపడాలి. అత్యుత్తమ జట్లు, అత్యుత్తమ సారథుల నడుమ సమరంపై అభిమానుల్లో ఎన్నో అంచనాలు. ఐపీఎల్ ఆరంభ షోలో బాలీవుడ్ తారల సందడితో ఈ ఆదివారం ఐపీఎల్ క్యాలెండర్లో మరో మైలురాయిగా నిలిచిపోయేది. కానీ కరోనా వైరస్ (కోవిడ్-19) ఐపీఎల్ 13 భవిష్యత్‌ను కమ్మేసింది. ప్రస్తుతానికి ఏప్రిల్ 15కు వాయిదా పడినా, ఆ తర్వాత సైతం ఐపీఎల్ 13 ఆరంభమయ్యే సూచనలు చాలా స్వల్పం.
ప్రపంచ క్రికెట్లో ఐసీసీ టోర్నీల స్థాయికి చేరుకుంటున్న టీ20 లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). ఐపీఎల్ విజేతకు ఐసీసీ ఈవెంట్ విజేతతో సమాన గౌరవం దక్కపోయినా.. ఐసీసీ ఈవెంట్లతో సమానంగా ఐపీఎల్‌కు అభిమానుల ఆదరణ దక్కుతుంది. రెండు నెలల కండ్లుచెదిరే క్రికెట్ షో కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కరోనా వైరస్ మహమ్మారి క్రీడా రంగాన్ని చావు దెబ్బ కొట్టినా, ఐపీఎల్13 వాయిదా పడినా.. అభిమానుల్లో ఆసక్తి ఏమాత్రం తగ్గటం లేదు. బీసీసీఐ రూపొందించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 29, ఆదివారం ఐపీఎల్ 13 ఆరంభం కావాలి. ఐపీఎల్ ఆతిథ్య ఎనిమిది నగరాల్లో ఈపాటికే క్రికెట్ ఫీవర్ వచ్చేది. కానీ ఈ ఏడాది పూర్తిగా భిన్నమైన వాతావరణం నెలకొంది. కోవిడ్-19తో ఐపీఎల్13 వాయిదా పడింది. అయితే గత 12 సీజన్లలో ఐపీఎల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో రూపొందించిన ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవన్ నవతెలంగాణ పాఠకుల కోసం..
1. క్రిస్ గేల్ (వెస్టిండీస్) : టీ20 లీగ్‌ల్లో క్రిస్ గేల్ సూపర్‌స్టార్. ఇటీవల ఐపీఎల్ వేలంలో గేల్‌కు తీసుకునేందుకు ప్రాంఛైజీలు విముఖత చూపుతున్నా, అతడు జట్టులో ఉంటే ఆ విలువే వేరు. ఐపీఎల్లో అత్యధికంగా ఆరు సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మన్ గేల్. ఐపీఎల్‌లోనే కాదు టీ20 ఫార్మాట్లోనే వ్యక్తిగత అత్యధిక స్కోరు 175 పరుగులు గేల్ బ్యాట్ నుంచి వచ్చినవే. ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా గేల్ 4,480 పరుగులు చేశాడు. అత్యధికంగా 326 సిక్సర్లు బాదాడు. మూడు సీజన్లలో 600 పైచిలుకు పరుగులు సాధించాడు. రెండు సీజన్లలో 700 ప్లస్ పరుగులు చేశాడు. టీ20 ఫార్మాట్లో 22 శతకాలు, 82 అర్థ సెంచరీల ఘనత. టీ20ల్లో 978 సిక్సర్లు, 1026 ఫోర్లతో క్రిస్ గేల్ టాప్ గేర్‌లో కొనసాగుతున్నాడు.
2. డెవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) : 4706 పరుగులతో ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో నాల్గో స్థానం. విదేశీ ఆటగాళ్లలో వార్నర్‌దే అగ్రస్థానం. ఐపీఎల్ అత్యధికంగా 48 అర్ధ సెంచరీలు సాధించాడు. ఐపీఎల్లో ఐదుసార్లు 90 ప్లస్ స్కోర్లు నమోదు చేశాడు. 30 ఇన్నింగ్స్‌ల్లో అర్థ సెంచరీలను 150 పైచిలుకు స్ట్రయిక్‌రేట్‌తో సాధించాడు. విరాట్ కోహ్లితో సమానంగా ఐపీఎల్లో ఐదు సీజన్లలో 500 ప్లస్ పరుగులు రాబట్టాడు. మూడు సీజన్లలో వార్నర్ 600 పైచిలుకు పరుగులు కొట్టాడు. ఇది క్రిస్ గేల్ రికార్డుతో సమానం.
3. విరాట్ కోహ్లి (భారత్) : 5412 పరుగులతో ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లి రికార్డు. 2016 సీజన్లో విరాట్ కోహ్లి 973 పరుగులు చేశాడు. ఓ సీజన్లో 900 ప్లస్ పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్ కోహ్లి. ఒకే సీజన్లో నాలుగు సెంచరీలు బాదిన బ్యాట్స్‌మన్‌గా కోహ్లి రికార్డు. డెవిడ్ వార్నర్‌తో సమానం ఐదు ఐపీఎల్ సీజన్లలో 500 ప్లస్ పరుగులు నమోదు చేశాడు. 2016 సీజన్లో 11 అర్ధ సెంచరీలతో మరో రికార్డు కోహ్లి సొంతం చేసుకున్నాడు.
4. సురేష్ రైనా (భారత్) : 5368 పరుగులతో ఐపీఎల్ పరుగుల జాబితాలో కోహ్లి తర్వాతి స్థానం. 12 ఐపీఎల్ సీజన్లలో 9 సీజన్లలో రైనా 400 ప్లస్ పరుగులు చేశాడు. అత్యధికంగా 193 ఐపీఎల్ మ్యాచుల్లో ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్లో 102 క్యాచులతో ఫీల్డర్‌గా శతక రికార్డు. ఐపీఎల్ ప్రతి సీజన్లో సురేష్ రైనా కనీసం 350 పరుగులు చేశాడు. బౌలర్‌గా 7.39 ఎకానమీతో 25 వికెట్లు సైతం రైనా ఖాతాలో ఉన్నాయి. ఐపీఎల్లో అత్యంత విలువైన ఆటగాడిగా సురేష్ రైనా గుర్తింపు పొందాడు.
5. ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) : ఏబీ డివిలియర్స్ 151.24 స్ట్రయిక్‌రేట్‌తో ఐపీఎల్లో 3000 ప్లస్ పరుగులు చేశాడు. ఈ స్ట్రయిక్‌రేట్‌తో ఇన్ని పరుగులు చేసిన మరే బ్యాట్స్‌మన్ చేయలేదు. జట్టుకు అవసరమైన సమయంలో డివిలియర్స్ వికెట్ల వెనకాల గ్లౌవ్స్తోనూ కొత్త అవతారం ఎత్తడానికి సదా సిద్ధంగా ఉంటాడు.
6. ఎం.ఎస్ ధోని (భారత్) (కెప్టెన్, వికెట్ కీపర్) : ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్. 174 మ్యాచుల్లో జట్టుకు నాయకత్వం వహించాడు. కెప్టెన్‌గా 100 ప్లస్ (104) విజయాలు సాధించిన ఏకైన నాయకుడు ధోని. ఐపీఎల్లో ధోని బ్యాటింగ్ సగటు 42.20. సగటులో ఐపీఎల్లో ఇది రెండో అత్యుత్తమం.
7. హర్బజన్ సింగ్ (భారత్) : ఐపీఎల్లో 150 వికెట్లు పడగొట్టిన ఆఫ్ స్పిన్నర్ హర్బజన్ సింగ్. 7.05 ఎకానమితో 100 వికెట్లు కూల్చిన బౌలర్లలో భజ్జీ మూడో స్థానంలో ఉన్నాడు. బ్యాట్‌తో ఉపయుక్తమైన ఇన్నింగ్స్‌లు ఆడటంలో టర్బోనేటర్ దిట్ట. 138 స్ట్రయిక్‌రేట్‌తో నాణ్యమైన ఇన్నింగ్స్‌లు ఎన్నో ఆడాడు.
8. భువనేశ్వర్ కుమార్ (భారత్) : భువనేశ్వర్ కుమార్ ఖాతాలో 133 వికెట్లు ఉన్నాయి. ఐపీఎల్ వికెట్ల వేటగాళ్లలో భువిది ఆరో స్థానం. 7.24 ఎకానమితో లసిత్ మలింగ తర్వాత అత్యుత్తమం భువనేశ్వర్ కుమారే. 100కు పైగా వికెట్లు కూల్చిన భారత పేసర్లలో 19.64 స్ట్రయిక్‌రేట్ రెండో అత్యుత్తమం.
9. అమిత్ మిశ్రా (భారత్) : అమిత్ మిశ్రా ఐపీఎల్లో 157 వికెట్లు పడగొట్టాడు. మలింగ తర్వాత అత్యధిక వికెట్లు మిశ్రావే. స్పిన్నర్లలో మిశ్రా అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్లో మరో బౌలర్‌కు సాధ్యపడనిది, మిశ్రా సాధించాడు. మూడుసార్లు హ్యాట్రిక్ వికెట్ల ఘనత సాధించాడు.
10. లసిత్ మలింగ (శ్రీలంక) : 170 వికెట్లతో ఐపీఎల్లో అత్యధిక వికెట్ల వీరుడిగా లసిత్ మలింగ కొనసాగుతున్నాడు. బౌలింగ్ 19.79, 50 వికెట్లకు పైగా తీసిన బౌలర్లలో ఇదే అత్యుత్తమం. మలింగ ప్రతి 16.63 బంతులకు ఓ వికెట్ కూల్చాడు. 50 ప్లస్ వికెట్లు కూల్చిన బౌలర్లలో ఇదే ఉత్తమం. 7.14 ఎకానమితో పేసర్లలో అగ్రస్థానంలో ఉన్నాడు.
11. జహీర్ ఖాన్ (భారత్) : జహీర్ ఖాన్ ఐపీఎల్లో 102 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ ఆల్‌టైమ్ ఎలెవన్‌లో నిలిచిన ఏకైక లెఫ్టార్మ్ బౌలర్ జహీర్ ఖాన్.