Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-వరంలా మారిన ఒలింపిక్స్ వాయిదా
-రానున్న రెండు ప్రపంచకప్‌లపై ఫోకస్
-భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్
నవతెలంగాణ క్రీడా విభాగం
టోక్యో 2020 ఒలింపిక్స్ ఏడాది పాటు వాయిదా పడ్డాయి. 2021 జులై 23న ఆరంభ వేడుకలతో టోక్యో క్రీడా సంబురం షురూ కానుందని టోక్యో ఒలింపిక్స్ క్రీడల కమిటీ సోమవారం ప్రకటించింది. ఈ ఏడాది ఒలింపిక్స్‌కు సర్వ సన్నద్ధమైన అథ్లెట్లకు వాయిదా నిర్ణయం అశనిపాతంగా మారగా, గాయాలతో పోరాటం చేస్తోన్న కొందరు అథ్లెట్లకు వాయిదా వరమైంది. భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్‌కు ఒలింపిక్స్ వాయిదా మరో అవకాశం కల్పిస్తోంది. గాయంతో 2020 ఒలింపిక్స్‌పై ఆశలు వదులుకున్న త్రిపుర అమ్మాయి.. ఇప్పుడు 2021పై ఫోకస్ పెడుతోంది.
కరోనా వైరస్ (కోవిడ్-19) అంతర్జాతీయంగా అన్ని రంగాలపై పెను ప్రభావం చూపుతోంది. జులై 24, 2020 ఒలింపిక్స్‌కు కఠోర సాధన చేసిన అథ్లెట్లు వాయిదా నిర్ణయంతో డీలా పడిపోయారు. అతి ప్రమాదకరంగా పరిణిమించిన మహమ్మారి ప్రపంచాన్ని మాంద్యంలోకి నెట్టేసింది!. క్రీడా రంగం సైతం కోవిడ్-19 కారణంగా లెక్కలేనన్ని కష్టాలు ఎదుర్కొంటుంది. వార్షిక క్యాలెండర్ వాయిదా సహా ఆర్థికంగా క్రీడా సమాఖ్యలకు అపార నష్టం చేకూరుతోంది. ఇదిలా ఉండగా, ఒలింపిక్స్ వాయిదాతో భారత్‌లో అథ్లెట్ల నుంచి సానుకూల స్పందన కనిపిస్తోంది. సన్నద్ధమైన అథ్లెట్లు సైతం ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా మేలు చేసేదే అని చెబుతున్నా.. గాయంతో టోక్యో ఒలింపిక్స్‌కు దూరమైన దీప కర్మాకర్‌కు ఇది వరంలా మారింది. రియో ఒలింపిక్స్‌లో పతకానికి అడుగు దూరంలో నిలిచిన దీప కర్మాకర్.. ఇప్పుడు టోక్యోలో సైతం పోటీపడేందుకు సిద్ధమవుతోంది.
వేధిస్తోన్న మోకాలి గాయం : క్రీడాకారులకు గాయాలు కెరీర్లో భాగమే, జిమ్నాస్ట్‌లకు గాయాలు అతి సాధారణం. సాధారణ గాయాల నుంచి కెరీర్‌ను నాశనం చేసే గాయాలు జిమ్నాస్ట్‌లకు సహజం. అత్యంత ప్రమాదకర ప్రోడునోవా విన్యాసం ప్రదర్శించే దీప కర్మాకర్ ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం ఆశలు కల్పించింది. కానీ మోకాలి గాయంతో 2019లో పూర్తిగా ఆటకు దూరమైంది. 2019లో ఏఎల్సీ (లిగమెంట్) శస్త్రచికిత్స చేయించుకున్న దీప కర్మాకర్ ఏడాది పాటు రిహాబిలేషన్లో కొనసాగుతోంది. మధ్యలో మళ్లీ పునరాగమనం చేసినా, గాయం తిరగబెట్టి మళ్లీ ఫిట్నెస్ సాధించటంపైనే దృష్టి నిలిపింది. దీప కర్మాకర్ ఇప్పుడు కూడా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. ఇతర క్రీడలతో పోల్చితే జిమ్నాస్టిక్స్‌లో అత్యున్నత స్థాయి ఫిట్నెస్ ప్రమాణాలు అవసరం. సాధారణ ఫిట్నెస్ సాధించిన దీప కర్మాకర్, జిమ్నాస్టిక్స్ ఫిట్నెస్ సాధించేందుకు మరో నాలుగు నెలల సమయం పడుతుంది. మరో నాలుగు నెలల్లో ఎటువంటి క్రీడలు నిర్వహించే అవకాశం కనిపించటం లేదు. దీంతో కోచ్ బిశ్వేశ్వర్ నందితో కలిసి దీప కర్మాకర్ కఠోర సాధన చేస్తోంది. నెమ్మదిగా విన్యాసాలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.
అంత సులువు కాదు : ఒలింపిక్స్ వాయిదా దీప కర్మాకర్‌కు ఓ అవకాశం కల్పించింది. కానీ టోక్యో 2020 (2021)లో ప్రాతినిథ్యం వహించటం దీపకు అంత సులువు కాదు. ఎనిమిది ఒలింపిక్ అర్హత టోర్నీల్లో ఇప్పటికే ఆరు ప్రపంచకప్‌లు ముగిసిపోయాయి. కేవలం రెండు ప్రపంచకప్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ రెండు వరల్డ్‌కప్‌ల ద్వారానే టోక్యో బెర్త్ ఆశిస్తున్న దీప కర్మాకర్ అపూర్వ ప్రదర్శన చేయాల్సిందే. కనీసం రెండు రజతాలు లేదా ఓ స్వర్ణం ఓ రజతం సాధిస్తేనే ఒలింపిక్స్ బెర్త్ దక్కుతుంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత అత్యుత్తమ ప్రదర్శన చేయగలిగితే దీపకు ఇది సాధ్యపడుతుంది. 52 ఏండ్లలో ఒలింపిక్స్‌లో ప్రాతినిథ్యం వహించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా రికార్డు నెలకొల్పిన దీప కర్మాకర్ 2016 ఒలింపిక్స్ మెడల్ పోడియంపై నిలిచే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది. అత్యంత ప్రమాదకర, చూసేందుకు రెండు కండ్లు సరిపోవనే ప్రోడునోవా విన్యాసం దీప కర్మాకర్ అద్భుతంగా చేయగలదు. టోక్యో ఒలింపిక్స్‌లోనూ దీప కర్మాకర్‌కు ప్రోడునోవా విన్యాసమే ప్రధాన కానుంది!.
ఒలింపిక్స్ అర్హతకు ఎనిమిది వరల్డ్‌కప్‌లు ఉన్నాయి. కానీ ప్రస్తుతం రెండు మాత్రమే నిర్వహించాల్సి ఉంది. ఆ రెండు మార్చిలో జరగాలి. కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు జూన్‌కు వాయిదా వేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒలింపిక్స్ మరో ఏడాదిలో జరుగుతాయి. వాయిదాతో మిగిలిన రెండు ప్రపంచకప్‌ల ప్రిపరేషన్‌కు నాకు మంచి సమయం ఉంది. మంచి ప్రదర్శన చేసి, అర్హత సాధించేందుకు నా సర్వశక్తులా ప్రయత్నిస్తాను'
- దీప కర్మాకర్, జిమ్నాస్ట్