Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఫిట్నెస్, ఫీల్డింగ్ ప్రమాణాలపై కౌర్
-దేశవాళీ సర్క్యూట్ బలోపేతం కీలకం
ముంబయి : మహిళల క్రికెట్లో పవర్ఫుల్ జట్లు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్. ఈ రెండు జట్లపై టీమ్ ఇండియా నిలకడగా విజయాలు సాధిస్తోంది. ప్రతిభ పరంగా బ్యాటర్లు, బౌలర్లు ఏమాత్రం ఆ రెండు జట్లకు తీసిపోరు. కానీ, ఫిట్నెస్, ఫీల్డింగ్, దేశవాళీ వ్యవస్థ పరంగా భారత్ కనీసం 5-6 ఏండ్లు వెనుకంజలో ఉందని భారత టీ20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అభిప్రాయపడింది. ' భారత క్రికెటర్లు ఇప్పుడు అవగాహన ఏర్పరుచుకుంటున్నారు. ఫిట్‌గా ఉండేందుకు రోజువారీ దినచర్యను మార్పు చేస్తున్నారు. మన దగ్గర ఈ మార్పు 2-3 ఏండ్ల నుంచి కనిపిస్తోంది. కానీ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు ఆ పని చాలా కాలం నుంచి చేస్తున్నాయి. ఈ పరంగా చూసినప్పుడు ఆ జట్ల కంటే భారత్ కచ్చితంగా 5-6 ఏండ్లు వెనుకంజలో ఉంది. ఫిట్నెస్గా ఉండాల్సిన బాధ్యతను అమ్మాయిలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. దేశవాళీ నుంచి జాతీయ జట్టుకు వచ్చిన ప్లేయర్లకు గతంతో పోల్చితే ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. బీసీసీఐ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌తో ఇప్పుడు సుమారు 30 మంది అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడో ఓ అమ్మాయి ఎంపికైతే, ఆమె నుంచి జట్టు ఏం ఆశించాలనే అంశంపై స్పష్టత ఉంది. దేశవాళీ టోర్నీలు మెరుగుపడితే, అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శన పురోగతి సాధిస్తుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లకు ఫిట్నెస్ ప్రణాళికల్లో భాగం. కానీ దురదృష్టశావవత్తు మనకు ఆ సంస్కృతి ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. రాత్రికిరాత్రి ఇది మారదు. ఈ అంశాలపై మేం కఠినంగా శ్రమించాలి. గతంలో విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోయేవాళ్లం. ఇప్పుడు నిలకడగా విజయాలు సాధిస్తున్నాం. ప్రతిభ, నైపుణ్యం పరంగా మన బ్యాటర్లు, బౌలర్లు ఆ రెండు దేశాలకు ఏమాత్రం తీసిపోరు. 2021 వన్డే వరల్డ్‌కప్‌కు ఫిట్నెస్, ఫీల్డింగ్‌లో మెరుగవ్వటంతో పాటు ఓ ముగ్గురు నైపుణ్యమున్న ఫాస్బ్ బౌలర్లకు భారత్‌కు అవసరం' అని హర్మన్‌ప్రీత్ కౌర్ అభిప్రాయపడింది. 2020 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు నాయత్వం వహించిన హర్మన్‌ప్రీత్ వ్యక్తిగత ప్రదర్శన పరంగా దారుణంగా నిరాశపరించింది. కెప్టెన్సీ బాధ్యత ఒత్తిడి పెంచలేదని, బాధ్యతగల క్రికెటర్‌గా మారేందుకు నాయకత్వ పగ్గాలు పనిచేశాయని కౌర్ తెలిపింది.