Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-బిలియన్ డాలర్ల క్లబ్లో ప్రవేశం
-ఈ ఘనత సాధించిన తొలి సాకర్ స్టార్
నవతెలంగాణ క్రీడా విభాగం
ఐపీఎల్లో ఎం.ఎస్ ధోని క్రేజ్ వేరు. చెన్నైవాసులు మహిని తలాగా ఆరాధిస్తారు. కాంట్రాక్టు వేతనానికి మించి, ధోని బ్రాండ్ విలువతో అధిక ఆదాయం సంపాదిస్తాడు. ఫుట్‌బాల్‌లో ఈ కోవలోకి వస్తాడు క్రిస్టియానో రొనాల్డో. అత్యధిక వేతనం అందుకుంటున్న ఆటగాడిగా లియోనల్ మెస్సీ ముందంజలో ఉండగా, అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న సాకర్ స్టార్‌గా క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో ఉన్నాడు. ఫుట్‌బాల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యపడని అంకెల అగ్రస్థానం రొనాల్డో సొంతమవుతోంది. బిలియన్ డాలర్ల (రూ. 7 వేల కోట్లు) క్లబ్లో ప్రవేశించిన తొలి ఫుట్‌బాలర్‌గా రొనాల్డో రికార్డు నెలకొల్పాడు.
15 ఏండ్ల వయసులోనే హృద్రోగ సమస్యలు ఎదుర్కొన్నాడు. ఫుట్‌బాల్ రాజ్యాన్ని ఏలాలని కలలు కంటున్న సమయంలోనే గుండె శస్త్రచికిత్సకు వెళ్లాడు. ఆ వయసులో గుండె ఆపరేషన్ తర్వాత ప్రపంచ శ్రేణి ఫిట్నెస్తో కూడిన ఫుట్‌బాల్‌లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పటం ఊహకందని విషయం. గుండె సర్జరీ నుంచి వేగంగా కోలుకున్న ఆ కుర్రాడు పోర్చుగల్ లోకల్ క్లబ్ తరఫున మాయ చేశాడు. ప్రత్యర్థి రక్షణ వ్యవస్థను ఛిద్రం చేసి, గోల్స్ కొల్లగొట్టాడు. కాళ్లతో కండ్లుచెదిరే మాయ చేస్తున్న ఆ కుర్రాడిపై ఇంగ్లాండ్ ప్రముఖ క్లబ్ కన్నేసింది. 2003లో మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు మారిన ఆ కుర్రాడు అనతికాలంలోనే తనకంటూ ఓ బ్రాండ్ ఏర్పరుచుకున్నాడు. 2007-08 సీజన్లో మాంచెస్టర్ తరఫున 42 గోల్స్ కొట్టి ప్రపంచానికి తనను తాను పరిచయం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అతడి ప్రస్థానం దిగ్విజయంగా సాగుతోంది. అతడే ఫుట్‌బాల్ ప్రపంచం సూపర్‌స్టార్ క్రిస్టియానో రొనాల్డో. ఫుట్‌బాల్ చరిత్రలో ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడిగా గుర్తింపు పొందిన రొనాల్డొ, సాకర్ స్టార్స్‌లలో ఎవరికీ సాధ్యపడని ఓ రికార్డును కొట్టాడు. ఒక బిలియన్ డాలర్ల సంపదతో స్పోర్ట్స్ దిగ్గజాలు మైకల్ జోర్డాన్, మైకల్ షుమాకర్, టైగర్ వుడ్స్ సరసన నిలిచాడు.
కోత విధించుకున్నా.. కొట్టాడు : ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యంత విలువైన ఆటగాళ్లలో అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ తర్వాత స్థానంలో కొనసాగుతున్నాడు రొనాల్డో. పదేండ్ల కిందటే మెస్సీ ఏడాదికి 100 మిలియన్ డాలర్ల వేతనం అందుకున్నాడు. క్రిసియానో రొనాల్డో ప్రస్తుతం ఇటలీ ఫుట్‌బాల్ క్లబ్ జువెంటస్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. జువెంటస్ రొనాల్డోకు ఏడాదికి 53 మిలియన్ యూరోలు చెల్లిస్తోంది. కరోనా వైరస్ ప్రభావంతో ఆట నిలిచిపోయింది. దీంతో రొనాల్డో తన వేతనంలో 3.45 మిలియన్ యూరోలు వదులుకున్నాడు. పోర్చుగల్‌లోని తన సొంత నగరంలో కోవిడ్-19 వైద్య సేవల నిమిత్తం 1.8 మిలియన్ డాలర్లు ఆర్థిక సాయం అందించాడు. ఆదాయంలో కోత విధించుకున్నా, భారీ విరాళాలు ఇచ్చినా 2020లోనే రొనాల్డో బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరుతున్నాడు. ఆటతో రొనాల్డోకు వచ్చిన ఆదాయం కంటే వాణిజ్య ఒప్పందాల ద్వారా రొనాల్డో అధికంగా ఆర్జిస్తున్నాడు. మార్కెట్లో విలువైన బ్రాండ్ ఏర్పరుచుకున్న రొనాల్డో ఏడాదికి 120 మిలియన్ డాలర్ల వరకు ఆర్జిస్తున్నాడు. టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ బిలియన్ డాలర్ల క్లబ్ చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం జీవించి ఉన్న అథ్లెటలో బాక్సింగ్ స్టార్ ఫ్లాయిడ్ మేవధర్, టైగర్ వుడ్స్ తర్వాత బిలియన్ డాలర్ల క్లబ్లో ఉన్నది క్రిస్టియానో రొనాల్డో మాత్రమే.
సోషల్ మీడియా స్టార్ : 18 ఏండ్ల వయసులో మాంచెస్టర్ యునైటెడ్ తరఫున కెరీర్ ఆరంభించిన క్రిస్టియానో రొనాల్డో 17 ఏండ్ల సాకర్ ప్రయాణంలో సాకర్ సూపర్‌స్టార్‌గా నిలిచాడు. సోషల్ మీడియాలోనూ సూపర్‌స్టార్ స్థానం నిలుపుకున్నాడు. చాలా మంది క్రీడాకారులు సోషల్ మీడియాలో క్రీయాశీలంగా ఉంటున్నారు. కానీ రొనాల్డో సోషల్ మీడియాలో అతిపెద్ద అభిమాన సామ్రాజ్యం ఏర్పరుచుకున్నాడు. ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో రొనాల్డోకు 323.4 మిలియన్ల అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో రొనాల్డో చేసే ప్రతి పోస్ట్, టీట్కు అభిమానుల్లో విపరీత స్పందన ఉంటోంది. అందుకే కార్పోరేట్ కంపెనీలు బ్రాండ్ విలువ కోసం రొనాల్డో వెంటపడతాయి. ఆటతో అందలం ఎక్కిన రొనాల్డో, ఆదాయం ఆర్జించే మార్గాన్ని దేన్నీ వదులుకోలేదు. గడియారాల నుంచి కేబుల్ వైర్ వరకూ అన్ని కంపెనీలకు ప్రచారకర్తగా వ్యవహరించాడు.
నైకీతోనే బిలియన్ డాలర్ల ఒప్పందం : బ్రాండ్ ప్రచారకర్తగా క్రిస్టియానొ రొనాల్డో మరో రికార్డు కొట్టాడు. బాస్కెట్‌బాల్ ఆల్‌టైమ్ గ్రేమ్ మైకల్ జోర్డాన్‌కు మాత్రమే దక్కిన మెగా ఆఫర్‌నూ తనూ అందుకున్నాడు. నైకీ జోర్డాన్‌తో జీవితకాల ఒప్పందం కుదుర్చుకుంది. 2016లో రొనాల్డో సైతం నైకీతో జీవితకాల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ద్వారా రొనాల్డోకు ఏకంగా 1 బిలియన్ డాలర్లు దక్కుతున్నాయి. కేవలం ఒకే ఒక్క ఒప్పందంతో రూ. 7000 కోట్లు అందుకుంటున్న ఏకైక ప్రచారకర్త రొనాల్డో. పోర్చుగల్ స్టార్ సాకర్‌కు వీడ్కోలు పలికినా, ఈ ఒప్పందం కొనసాగనుంది. ట్వీటర్లో నైకీ హ్యాష్‌ట్యాగ్‌తో రొనాల్డో చేసే ట్వీట్ల ద్వారానే నైకీ కొన్ని మిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జిస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
సొంత కంపెనీల్లో పెట్టుబడులు : సాకర్ స్టార్‌గా ప్రచార ఒప్పందాలతో ఇబ్బడిమబ్బడిగా సంపాదిస్తున్న క్రిస్టియానో రొనాల్లో తన ఆదాయంలో అధిక మొత్తాలను సొంత కంపెనీల్లోనే పెట్టుబడులుగా పెట్టాడు. సీఆర్7 పేరుతో (ధోని సైతం 7 పేరుతో క్రీడా ఉపకరణాలను మార్కెట్లోకి తీసుకొచ్చాడు) అతి ఖరీదైన చెడ్డీలు, పాదరక్షలు, దుప్పట్లు, మొబైల్ యాప్స్, సృజనాత్మక ఏజెన్సీ, రెస్టారెంట్లు, హౌటళ్లలో పెట్టుబడులు పెడుతున్నాడు. భారీగా ఆర్జిస్తున్న రొనాల్డో జీవన శైలి అత్యంత విలాసవంతం. ఖరీదైన స్పోర్ట్స్ కార్లు, ట్రంప్ టవర్‌లో విలువైన అపార్ట్మెంట్ (18.5 మిలియన్ డాలర్లు), సొంతంగా ప్రయివేట్ జెట్లు రొనాల్డొ సొంతం.
సాకర్ లెజెండ్ లియోనల్ మెస్సీ తరహాలోనే క్రిస్టియానో రొనాల్డో సైతం స్పెయిన్‌లో పన్ను ఎగవేతల ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆరోపణలను అంగీకరించిన రొనాల్డొకు రెండేండ్ల జైలు శిక్ష పడింది. స్పెయిన్ ప్రభుత్వానికి 21.8 మిలియన్ డాలర్లు జరిమాన కట్టిన రొనాల్డొ న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడ్డాడు.
ఆటలో లియోనల్ మెస్సీతో రొనాల్డొ జీవితకాలం పోటీపడుతూనే ఉన్నాడు. కొందరు మెస్సీ గొప్ప అంటే, మరికొందరు రొనాల్డో గ్రేట్ అంటున్నారు. ఆటలో అగ్రస్థానంపై ఏకాభిప్రాయం లేదు కానీ, ఆర్జనలో ఎదురులేని అగ్రస్థానం రొనాల్డొ సొంతం. 2020 నాటికి నికర ఆస్తుల విలువ బిలియన్ డాలర్లకు చేర్చుకున్న రొనాల్డో, రిటైర్మెంట్ తర్వాత సైతం భారీగా సంపాదించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. సాకర్‌లో సూపర్ గోల్స్ కొట్టడంలోనే మార్కెట్లోనూ గోల్ కొట్టగల నేర్పరి రొనాల్డో.