Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫబియోపై నడాల్ అనూహ్య ఓటమి
- ప్రీక్వార్టర్స్‌లో జకోవిచ్, సిలిక్
- విలియమ్స్ సిస్టర్స్, బౌచర్డ్ ముందంజ
అప్పటికే తొలి రెండు సెట్లు నెగ్గిన నడాల్.. ప్రీక్వార్టర్స్ చేరటం దాదాపుగా ఖాయం!.
ప్రేక్షకులు కూడా పెద్ద విశేషమేమీ లేదని బయటికెళ్తోన్న సమయం. అప్పుడు మొదలైంది అసలు సిసలు సమరం. 14 గ్రాండ్‌స్లామ్స్ విజేత రఫెల్ నడాల్‌కు షాకిచ్చే సమరం. అమోఘమైన ఆటతీరుతో ఇటలీ ఆటగాడు ఫబియో ఫోగ్నిని స్పెయిన్ బుల్‌కు చెక్ పెట్టాడు. ఆఖరి మూడు సెట్లలో విజయం సాధించి..నడాల్‌ను మూడో రౌండ్లోనే నిష్క్రమించేలా చేశాడు.
న్యూయార్క్: యు.ఎస్.ఓపెన్‌లోనూ స్పెయిన్ బుల్ రఫెల్ నడాల్‌కు చుక్కెదురైంది. కెరీర్ పేలవ ఫామ్‌లో ఉన్న ఎనిమిదో సీడ్ నడాల్ మూడో రౌండ్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించాడు. గెలుపు ఖాయమనుకున్న గేమ్‌లో ప్రత్యర్థి అనూహ్యంగా పుంజుకోవటంతో బుల్‌కు బాధ తప్పలేదు. ఇటలీ ఆటగాడు ఫబియో ఫోగ్నిని చేతిలో 6-3, 6-4, 4-6, 3-6, 4-6 తేడాతో నడాల్ ఓటమిపాలయ్యాడు. తొలి రెండు సెట్లలో విజయంతో పాటు మూడో సెట్లో ముందంజలో నిలిచిన నడాల్ అనూహ్యంగా ఓటమి కోరల్లో చిక్కుకుని విలవిల్లాడాడు. ఈ ఏడాది ఫబియో చేతిలో నడాల్ ఓడటం ఇది మూడో సారి. ఇంతకు ముందు క్లే కోర్టులో నడాల్ రెండుసార్లు ఫబియో చేతిలో ఖంగుతిన్నాడు. టాప్ సీడ్, టైటిల్ ఫేవరేట్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) అలవోకగా ప్రీక్వార్టర్స్‌లో కాలుమోపాడు. డిఫెండింగ్ చాంపియన్ మారిన్ చిలిక్ సైతం మూడో రౌండ్లో విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ స్టార్ సెరెనా విలియమ్స్, వీనస్ వినస్ విలియమ్స్, బౌచర్డ్లు ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. మెన్స్ సింగిల్స్‌లో నడాల్ ముందే నిష్క్రమించటంతో...క్వార్టర్స్‌లో జకోవిచ్, స్పెయిన్ బుల్ పోరు చూసే అవకాశం లేకుండా పోయింది.
ఈ ఏడాది యు.ఎస్. ఓపెన్‌లో బిగ్గెస్ట్ థ్రిల్లర్ నడాల్ నిష్క్రమణ. ఫామ్‌లో లేకపోయినా 6-3, 6-4తో తొలి రెండు సెట్లను చెప్పుకోదగినరీతిలో నెగ్గిన నడాల్ అనూహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇటలీ స్టార్ ఫబియో ఫోగ్నిని ఫోర్‌హ్యాండ్ షాట్స్, బేస్ లైన్ గేమ్‌తో నడాల్‌ను ఇబ్బందిపెట్టేందుకు ప్రయత్నించినా డిఫెన్స్‌లో అసాధ్యుడైన నడాల్ అతడి సవాల్‌ను సునాయాసంగా తిప్పికొట్టాడు. కానీ నడాల్‌కు సిసలైన సవాల్ మూడో సెట్లో మొదలైంది. ఆ సెట్లోనూ తొలి బ్రేక్ పాయింట్ సాధించిన నడాల్..బహుశా ఫబియో అంతలా విజృంభిస్తాడని ఊహించి వుండడు. బలమైన గ్రౌండ్ స్ట్రోక్స్‌కు తోడు తెలివైన నెట్ వ్యాలీలతో ఫోగ్నిని రేసుగుర్రంలా దూసుకొచ్చాడు. ఫోగ్నిని రేసులోకి వచ్చాక నడాల్ పోరు నామమాత్రమైంది. 4-6, 3-6తో తర్వాతి రెండు సెట్లను కోల్పోయిన నడాల్ నిర్ణయాత్మక సెట్లో తీవ్ర పోటినిచ్చాడు. ఐదో సెట్లో 4-4తో సమవుజ్జీగా నిలిచిన మ్యాచ్ పాయింట్‌ను కాచుకోవటంలో విఫలమయ్యాడు. మూడు గంటల 46 నిమిషాల పాటు సాగిన సుదీర్ఘ పోరులో 3-2తో నెగ్గిన ఫోగ్నాని కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రీక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. ఈ ఏడాది నడాల్ ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, వింబుల్డన్ టోర్నీల్లోనూ సెమీస్‌కు ముందే నిష్క్రమించిన విషయం తెలిసిందే.
పురుషుల సింగిల్స్ టాప్ సీడ్, సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ అలవోకగా ప్రీక్వార్టర్స్ చేరుకున్నాడు. ఆండ్రీ సెప్పీ (ఇటలీ)పై 6-3, 7-5, 7-5తో జకో విజయం సాధించాడు. డిఫెండింగ్ చాంపియన్ మారిన్ చిలిక్ (క్రోయేషియా) 6-7(5-7), 7-6(7-1), 6-3, 6-7(3-7), 6-1తో మికైల్పై ఉత్కంఠ విజయం సాధించాడు. స్పెయిన్‌కే చెందిన మరో ఆటగాడు డేవిడ్ ఫెర్రర్‌పై 6-7(6-8), 6-4, 3-6, 1-6తో జెర్రీ చార్డీ (ఫ్రాన్స్) గెలుపొంది ప్రీక్వార్టర్స్్లో అడుగుపెట్టాడు.
మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ ప్రీ క్వార్టర్స్‌కు చేరుకుంది. అమెరికాకే చెందిన అమ్మాయితో తలపడిన సెరెనా..ఆరంభంలో తడబడినా తర్వాతి సెట్లలో పుంజుకుని సత్తా చాటింది. 3-6, 7-5, 6-0తో బెథానీపై అలవోకగా నెగ్గింది. తొలి సెట్ నెగ్గిన బెథానీ స్టార్ ప్లేయర్ ముందు నిలకడగా రాణించలేదు. వీనస్ విలియమ్స్ సైతం 6-3, 6-4తో వరస సెట్లలో విజయం సాధించింది. బెలిందా బెన్సిక్ (స్విట్జర్లాండ్)పై విజయంతో వీనస్ ప్రీక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. సెరెనా, వీనస్‌లు ప్రీక్వార్టర్స్‌లో విజయం సాధిస్తే క్వార్టర్స్‌లో వీరిద్దరి మధ్యే పోటీ వుంటుంది. వింబుల్డన్ తర్వాత మళ్లీ విలియమ్స్ సిస్టర్స్ సొంతగడ్డపై తలపడనున్నారు..! కెనడా భామ బౌచర్డ్ 7-6(11-9), 4-6, 6-3తో సిబుల్కోవాపై విజయం సాధించింది.
'ఈ ఏడాది నాది కాదనే వాస్తవాన్ని నేను అంగీకరించాలి. సానుకూల దృక్పథంతో ముగించేందుకు సీజన్ ఎండింగ్ వరకూ పోరాడతాను'
- రఫెల్ నడాల్
మిక్స్డ్ ముగిసింది
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా యు.ఎస్. ఓపెన్ మిక్స్డ్ డబుల్స్‌లో టైటిల్ ఆశలు ఆవిరయ్యాయి. శుక్రవారం రాత్రి జరిగిన మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్స్ సానియా మీర్జా, బ్రూనే సోర్స్ (బ్రెజిల్) జోడి ఓటమిపాలయ్యింది. 65 నిమిషాల పాటు సాగిన తొలి రౌండ్ గేమ్‌లో టాప్ సీడ్స్ ఏమాత్రం ప్రభావం చూపలేదు. 3-6, 3-6తేడాతో చెక్ రిపబ్లిక్ జంట అండ్రియా, లూకాస్ చేతిలో ఓటమిపాలయ్యారు. మరోవైపు మెన్స్ డబుల్స్‌లో ఇండియన్ వెటరన్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్, ఫెర్నాండో వర్డస్కో జోడి రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. టాప్ సీడ్స్ బ్రయాన్ బ్రదర్స్‌ను ఓడించిన స్టీవ్ జాన్సన్, శామ్ క్యూరీ (అమెరికా)లపై 5-7, 6-4, 3-6తో పరాజయం పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో సెకండ్ సీడ్ రోహన్ బోపన్న (భారత్), చాన్ జోడి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. బెన్సిక్, ఫెర్నాండో జంటపై 6-4, 6-4తో వరస సెట్లలో విజయం సాధించి ప్రీక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు.