Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఆవిష్కరించిన క్రీడా మంత్రి కిరణ్ రిజుజు
న్యూఢిల్లీ : అంతర్జాతీయ యవనికపై భారత క్రీడాకారుల జోరుతో పాటు డోపింగ్ పరీక్షల్లో పట్టుబడుతున్న అథ్లెట్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇటీవల యువ రోయర్లు 20 మంది డోపింగ్ పరీక్షల్లో పట్టుబడిన సంగతి తెలిసిందే. గతంలో డోపీలకు, ఇప్పుడు డోపింగ్ పాజిటివ్‌ల మధ్య ఓ ప్రధాన వ్యత్యాసం కనిపిస్తోంది. తాజాగా డోపింగ్ పరీక్షల్లో పట్టుబడుతున్న భారత అథ్లెట్లు ఎక్కువ మంది ఔషధాలు, నిషేధిత ఉత్పేకరాలకు మధ్య తేడా తెలుసుకోవటంలో వైఫల్యంతోనే డోపీలుగా తేలారు. దీంతో యువ అథ్లెట్లలో నాడా, వాడా నిషేధిత ఉత్పేరకాలపై అవగాహన తీసుకొచ్చేందుకు, నిరంతరం ఆ సమాచారం అందుబాటులో ఉంచేందుకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) ఓ యాప్‌ను తీసుకొచ్చింది. కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజు నాడా తొలి యాప్‌ను ఆవిష్కరించారు. అథ్లెట్లు, కోచ్‌లు గూగుల్ స్టోర్, యాపిల్ స్టోర్ల నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
' యాప్ తీసుకురావటం భారత క్రీడల్లో ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనం స్వచ్ఛ క్రీడల దిశగా అడుగేస్తున్నాం. నిషేధిత ఉత్పేరకాలపై అవగాహన కల్పించటం అవసరం. యాప్‌తో నిషేధిత ఉత్పేరకాలు ఏమిటనే సమాచారం అథ్లెట్లు, కోచ్‌లు తెలుసుకోవచ్చు. యాప్ ఉపయోగంతో అథ్లెట్లు ఇతరులపై ఆధారపడే అవసరం ఉండదు. స్వంతంగానే సమాచారం తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడింది' అని యాప్ ఆవిష్కరణ అనంతరం మంత్రి రిజుజు పేర్కొన్నారు.