Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-బ్యాడ్మింటన్ దిగ్గజం లిన్ డాన్ వీడ్కోలు
2006-2014.. ఈ ఎనిమిదేండ్ల సమయంలో బ్యాడ్మింటన్‌లో ప్రతి ప్రతిష్టాత్మక టైటిల్ అతడిని వరించింది. ఆ కాలంలో అతడు ఆడిన ప్రతి ఫైనల్లోనూ విజయం ఎదురొచ్చి హత్తుకుంది. రెండు ఒలింపిక్ స్వర్ణాలు, ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిళ్లు, రెండు ఆసియా క్రీడల స్వర్ణ పతకాలు, సూపర్ సిరీస్ టైటిళ్ల సంగతి ఇక సరేసరి. లీ చోంగ్ వీ, చెన్ లాంగ్ వంటి దిగ్గజాలతో నిరంతంర పోరాడినా.. లిన్ డాన్ స్పష్టమైన ఆధిపత్యం చెలాయించాడు. 21వ శతాబ్దం అత్యుత్తమ బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా నిలిచాడు. కెరీర్లో ఉన్నత శిఖరాలు అధిరోహించిన బ్యాడ్మింటన్ మాంత్రికుడు ఇక సెలవ్ అనేశాడు. 37 ఏండ్ల వయసులో బ్యాడ్మింటన్ కెరీర్‌కు ముగింపు పలికాడు. లిన్ డాన్ వీడ్కోలుతో బ్యాడ్మింటన్‌లో ఓ మాంత్రికుడి శకం ముగిసినా.. ఆటపై డాన్ ప్రభావం చిరకాలం నిలిపోనుంది.
బీజింగ్ (చైనా)
ఈ శతాబ్దపు యోధుడు ముగించాడు. 37 ఏండ్ల వయసు, వేధిస్తోన్న గాయాలతో అత్యున్నత స్థాయిలో తలపడలేనని భావించాడు. బ్యాడ్మింటన్ దిగ్గజం, చైనా స్టార్ లిన్ డాన్ శనివారం కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. మలేషియా బ్యాడ్మింటన్ దిగ్గజం లీ చోంగ్ వీతో కలిసి దశాబ్ద కాలం బ్యాడ్మింటన్‌ను ఏలేసిన లిన్ డాన్.. 2008 బీజింగ్ ఒలింపిక్స్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ స్వర్ణ పతకాలు సాధించాడు. బ్యాడ్మింటన్ చరిత్రలో మరో షట్లర్‌కు సాధ్యపడని ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిళ్లను సొంతం చేసుకున్నాడు. రియో ఒలింపిక్స్‌లో పతకంతో కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని భావించిన లిన్ డాన్.. ఇప్పుడు అనూహ్యంగా కెరీర్‌ను ముగించాడు.
ఇక తలపడలేను..! : 2006-2014 వరకు బ్యాడ్మింటన్‌ను మకుటం లేని మహరాజుగా ఏలిన లిన్ డాన్.. ఇటీవల వరుస పరాజయాలు చవిచూశాడు. సూపర్ సిరీస్ టోర్నీల్లో తొలి రౌండ్లోనే పలుసార్లు నిష్క్రమించాడు. గాయాలు సైతం లిన్ డాన్ వేగాన్ని బాగా ప్రభావితం చేశాయి. రియో ఒలింపిక్స్‌లో ఆడాలని బలమైన ఆకాంక్ష ఉన్నప్పటికీ.. వచ్చే ఏడాది వేసవి వరకు వేచి చూడలేనని భావించాడు. లిన్ డాన్ ప్రస్తుత వరల్డ్ ర్యాంక్ 19. ఈ ర్యాంక్‌తో నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేదు. రానున్న టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేయకతప్పదు. కరోనా కష్టకాలంలో సాహసాలకు దూరంగా ఉండాలని భావించినట్టున్న లిన్ డాన్ శనివారం అనూహ్యంగా వీడ్కోలు ప్రకటన చేశాడు. చైనా సోషల్ మీడియా వేదిక వీబో వేదికగా వీడ్కోలు ప్రకటన చేశాడు.
' ఇప్పుడు నా వయసు 37 ఏండ్లు. నా శారీరక ఫిట్నెస్, గాయాలు నన్నెంతో కాలం పోటీలో నిలుపలేవు. నా సహచరులతో కలిసి సమర్థవంతంగా పోటీఇవ్వలేను. నేను అమితంగా ప్రేమించిన ఆటకు సర్వం ధారపోశాను. నా కుటుంబం, కోచ్‌లు, జట్టు సహచరులు, అభిమానులు కెరీర్లో అన్ని దశల్లో అండగా నిలిచారు' అని లిన్ డాన్ వీబోలో రాసుకొచ్చాడు. లిన్‌డాన్ గౌరవపాత్రుడైన ప్రత్యర్థి, మలేషియా దిగ్గజం లీ చోంగ్ వీ ట్వీట్టర్ వేదికగా భావోద్వేగంగా స్పందించాడు. క్యాన్సర్‌తో అసమాన పోరాటం అనంతరం లీ చోంగ్ వీ 2019 జూన్‌లో బ్యాడ్మింటన్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ' ఈ రోజు వస్తుందని మాకు తెలుసు. మన జీవితాల్లో ఇదో భారమైన రోజు. ఎంతో గౌరవంగా కెరీర్‌కు తెరదించావు. సగర్వంగా తలపడిన బ్యాడ్మింటన్ కోర్టులో నువ్వ రారాజువు. లిన్‌డాన్‌కు నిశ్శబ్దపు కన్నీటి ధారతో..' అని లీ చోంగ్ వీ భావోద్వేగ ట్వీట్ చేశాడు.
ఆత్మీయంగా పలకరిస్తాడు : బ్యాడ్మింటన్ దిగ్గజం లిన్ డాన్ వీడ్కోలుతో సోషల్ మీడియాలో భారత స్టార్ షట్లర్లు చైనా స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. లిన్ డాన్‌ను మూడుసార్లు ఓడించిన హెచ్.ఎస్ ప్రణరు 'నాకు తెలిసి లిన్ డాన్ బ్యాడ్మింటన్ అత్యుత్తమ ఆటగాడు. రాబోయే పదేండ్లలో సైతం లిన్ డాన్ సమీపంలో వచ్చే షట్లర్ లేడు. బ్యాడ్మింటన్‌లో ప్రతిష్టాత్మక పతకాలు అన్నింటినీ పలుమార్లు గెల్చుకున్నాడు' అని అన్నాడు. ' లిన్‌డాన్ విస్పష్ట దిగ్గజం, స్పోర్ట్స్ ఐకాన్. అతడి క్లాస్, స్టైల్, స్వాగ్...కానీ ఎప్పుడు కలిసినా లిన్ డాన్ మర్యాదగా పలకరించేవాడు. అతడికి తెలిసిన పరిమిత ఇంగ్లీష్ పదాలు హరు, హలో, థ్యాంక్స్లతోనే కలిసిప్పుడల్లా విష్ చేస్తాడు' అని 2014 కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ పారుపల్లి కశ్యప్ ట్వీట్ చేశాడు.
2014 చైనా ఓపెన్ సూపర్ సిరీస్. పురుషుల సింగిల్స్ ఫైనల్స్ ముగిసింది. బహుమతి ప్రదానం అనంతరం.. ఫైనల్స్ ప్రత్యర్థి, భారత వర్థమాన షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌తో కలిసి లిన్ డాన్ మీడియా సమావేశానికి వచ్చాడు. లిన్ డాన్‌ను ఓ జర్నలిస్ట్ ఓ ప్రశ్న అడిగాడు. చివరగా ఓ సూపర్ సిరీస్ ఫైనల్లో లేదా చైనాలో ఓటమిపాలైనది ఎప్పుడు?అని. అందుకు లిన్ డాన్ ఇలా బదులిచ్చాడు.. 'లేదు. ఇది ఇంతకుముందు ఎప్పుడు జరిగిందో గుర్తులేదు'. 2014 చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ అపూర్వ విజయం సాధించాడు. అప్పటివరకు చిన్నాచితక విజయాలు సాధించినా.. దిగ్గజ షట్లర్ లిన్ డాన్‌పై విజయంతో కిదాంబి శ్రీకాంత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. కొడితే కుంభస్థలమే కొట్టాలన్నట్టు.. చైనా దిగ్గజంపై విజయంతో బ్యాడ్మింటన్ ప్రపంచానికి స్టార్ షట్లర్‌గా పరిచయం అయ్యాడు. ఒకే ఏడాదిలో నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు నెగ్గిన కిదాంబి శ్రీకాంత్ వరల్డ్ నం.1గా నిలిచాడు. లిన్ డాన్ వీడ్కోలుతో కిదాంబి శ్రీకాంత్ దిగ్గజ షట్లర్‌తో అనుబంధంపై మాట్లాడాడు. అది అతడి మాటల్లోనే..
'నాకు ఇంకా గుర్తుంది. 2014 చైనా సూపర్ సిరీస్ ఫైనల్లో నేను పూర్తిగా మొద్దుబారిపోయాను!. లిన్ డాన్ రెండు సార్లు ఒలింపిక్ చాంపియన్. ఐదుసార్లు వరల్డ్ చాంపియన్. ఐదుసార్లు చైనా ఓపెన్‌నూ గెల్చుకున్నాడు. ఓ సూపర్ సిరీస్ ఫైనల్స్‌కు తొలిసారి చేరుకున్న నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. చైనాలో లిన్ డాన్‌కు అపూర్వ మద్దతు గురించి తెలిసిందే. నిజానికి ఆ ఫైనల్లో నాకు ఎటువంటి వ్యూహం లేదు. ఏ వ్యూహంతో వెళ్లినా డాన్‌ను కొట్టలేమని తెలుసు. నా శక్తిమేరకు పోరాడదామని కోర్టులోకి అడుగుపెట్టాను. ఫైనల్లో విజయానంతరం ఆనందం కంటే ఆశ్చర్యానికి లోనయ్యాను. లిన్ డాన్‌కు నేను పెద్ద అభిమానిని. 2012 ఒలింపిక్ ఫైనల్స్ మ్యాచ్‌ను యుట్యూబ్లో లెక్కలేనన్ని సార్లు చూశాను. అలసట లేని నిలకడ, ప్రశాంతతకు లీ చోంగ్ వీ పెట్టింది పేరు. కానీ లిన్ డాన్ అంటే పూర్తిగా ఆధిపత్యమే. మెగా మ్యాచుల్లో అతడు బరిలోకి దిగినప్పుడు, అతడి దూకుడు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. స్ట్రోక్స్‌పై లిన్ డాన్ నియంత్రణ, ఉత్కంఠ సమయాల్లో రాణించే సామర్థ్యం.. ఒలింపిక్, వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో అతడిని తిరుగేలేని షట్లర్‌గా నిలిపాయి. స్కోరు బోర్డు 20-20తో ఉన్నప్పుడు సైతం ప్రయోగానికే మొగ్గుచూపే షట్లర్ లిన్‌డాన్. ఆ లక్షణమే లిన్‌డాన్‌ను ప్రత్యేకంగా నిలిపింది. లిన్ డాన్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్. సమీప భవిష్యత్‌లో లిన్ డాన్ వంటి ఆటగాడు ఇక రాడు' అని కిదాంబి శ్రీకాంత్ అన్నాడు.