Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఇంగ్లాండ్ 204 ఆలౌట్
-వెస్టిండీస్, ఇంగ్లాండ్ తొలి టెస్టు
సౌతాంప్టన్ (ఇంగ్లాండ్) : కరీబియన్ కెప్టెన్ జేసన్ హోల్డర్ (6/42) విశ్వరూపం ప్రదర్శించాడు. సౌతాంప్టన్‌లో నిప్పుల వర్షం కురిపించాడు. పిచ్‌పై పచ్చిక, వాతావరణంలో తేమను గొప్పగా సద్వినియోగం చేసుకున్న వెస్టిండీస్ బౌలర్లు తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు. 67.3 ఓవర్లలో 204 పరుగులకే ఇంగ్లీష్ జట్టును కుప్పకూల్చారు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (43, 97 బంతుల్లో 7 ఫోర్లు), జోశ్ బట్లర్ (35, 47 బంతుల్లో 6 ఫోర్లు) ఆరో వికెట్‌కు అర్థ శతక భాగస్వామ్యంతో భారీ స్కోరుపై ఆశలు రేపారు. 154/5తో ఉన్న ఇంగ్లాండ్ హౌల్డర్ దెబ్బకు 204 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
రూట్ లేని బ్యాటింగ్ ఫ్లాప్! : స్టార్ బ్యాట్స్‌మన్, రెగ్యులర్ కెప్టెన్ జో రూట్ లేని ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ తేలిపోయింది. బ్యాటింగ్ లైనప్‌లో బెన్ స్టోక్స్ ఒక్కడే సీనియర్ ఆటగాడు. ఓపెనర్లు బర్న్, సిబ్లే సహా డెన్లీ, క్రావ్లీ, పోప్లు టెస్టు అనుభవం 49 టెస్టులు మాత్రమే. అనుభవలేమి ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ బలహీనతను వెస్టిండీస్ సొమ్ము చేసుకుంది. మేఘావృత వాతావరణంలో బంతి పేసర్లకు అనుకూలించింది. ఓపెనర్ రోరి బర్న్స్ (30, 85 బంతుల్లో 4 ఫోర్లు) మినహా టాప్ ఆర్డర్లో ఎవరూ రాణించలేదు. డామ్ సిబ్లే (0), జో డెన్లీ (18), జాక్ క్రావ్లీ (10), ఒలీ పోప్ (12)లు స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. 87/5తో ఇంగ్లాండ్ పీకల్లోతు కష్టాల్లో ఉన్న దశలో కెప్టెన్ బెన్ స్టోక్స్ (43), జోశ్ బట్లర్ (35) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆరంభంలోనే జీనవదానం పొందిన బెన్ స్టోక్స్‌ను జేసన్ హౌల్డర్ వికెట్ల వెనకాల దొరకబట్టుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ ఆశల సౌధానికి బీటలు వారాయి. జోశ్ బట్లర్ (35)ను సైతం హౌల్డర్ త్వరగానే పెవిలియన్‌కు చేర్చాడు. జోఫ్రా ఆర్చర్ (0), మార్క్‌వుడ్ (5)లు హౌల్డర్ ధాటికి నిలువలేకపోయారు. ఆఖర్లో డామ్ బెస్ (31 నాటౌట్, 44 బంతుల్లో 4 ఫోర్లు) ధాటిగా బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ స్కోరు 200 దాటించాడు. కెప్టెన్ జేసన్ హౌల్డర్ ఆరు వికెట్ల ప్రదర్శన చేయగా.. షానన్ గాబ్రియల్ (4/62)తో రాణించాడు.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : బర్న్స్ (ఎల్బీ) గాబ్రియల్ 30, సిబ్లే (బి) గాబ్రియల్ 0, డెన్లీ (బి) గాబ్రియల్ 18, క్రావ్లీ (ఎల్బీ) హౌల్డర్ 10, బెన్ స్టోక్స్ (సి) డావ్రిచ్ (బి) హౌల్డర్ 43, పోప్ (సి) డావ్రిచ్ (బి) హౌల్డర్ 10, బట్లర్ (సి) డావ్రిచ్ (బి) హౌల్డర్ 35, బెస్ నాటౌట్ 31, ఆర్చర్ (ఎల్బీ) హౌల్డర్ 0, మార్క్‌వుడ్ (సి) హౌప్ (బి) హౌల్డర్ 5, అండర్సన్ (బి) గాబ్రియల్ 10, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం : (67.3 ఓవర్లలో ఆలౌట్) 204.
వికెట్ల పతనం : 1-0, 2-48, 3-51, 4-71, 5-87, 6-154, 7-157, 8-157, 9-174, 10-204.
బౌలింగ్ : కీమర్ రోచ్ 19-6-41-0, గాబ్రియల్ 15.3-3-62-4, అల్జారీ 13-4-53-0, హౌల్డర్ 20-6-42-6.