Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వచ్చే రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు, కొన్నిచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతున్నది. దీనికి అనుబంధంగా 2.1కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం వరకు నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో అత్యధికంగా 177.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది. వచ్చే మూడు రోజుల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఆగస్టు 13వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. సోమవారం నాడు ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీమ్-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసింది. మంగళ, బుధవారాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురువనున్నాయి.