Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భర్త ఇంటి ముందు భార్య ఆందోళన
నవతెలంగాణ-కోనరావుపేట
ప్రేమ పేరుతో వేధించి, పెండ్లి సంబంధాలు చెడగొట్టాడు. చివరికి అతన్నే పెండ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లగా.. వేరే పెండ్లి చేసుకుంటే కట్నం వస్తుందని కుటుంబ సభ్యులతో కలిసి హింసిస్తున్నాడు.. దీంతో భర్త ఇంటి ఎదుట భార్య బైటాయించి ఆందోళనకు దిగింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూర్లో మంగళవారం జరిగింది. ఆమెకు స్వశక్తి మహళా సంఘం సభ్యులు మద్దతుగా నిలిచారు. బాధితురాలి వివరాల ప్రకారం.. సిరిసిల్ల మండలం పెద్దూరు గ్రామానికి చెందిన రాణిని కొలనూర్ గ్రామానికి చెందిన అజరు ప్రేమిస్తున్నానని మూడు సంవత్సరాలు వెంటబడ్డాడు. ఆమె తల్లిదండ్రులు పెండ్లి సంబంధాలు చూడగా.. సంబంధిత యువకుల ఇండ్లకు వెళ్లి రాణితో తనకు సంబంధం ఉందని చెప్పి చెడగొట్టాడు. చివరకు అతన్ని నిలదీయగా ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటానని చెప్పాడు. దీంతో రెండు నెలల కిందట రాణిని ఓ గుడిలో వివాహం చేసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. పదిరోజులు గడవకముందే కట్నం ఎక్కువగా వస్తుందని తల్లిదండ్రుల మాట వింటూ చిత్రహింసలకు గురి చేశాడు. ఇంటి నుంచి బయటకు గెంటేశారు. దీంతో బాధితురాలు మహిళా సంఘాలను ఆశ్రయించగా, వారు అజరు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వచ్చేసరికే ఇంటికి తాళం వేసి పరారయ్యారు. వారు ఇంటికి వచ్చేవరకు ఇక్కడే ఉంటానని బాధితురాలు బైటాయించింది.