నవతెలంగాణ-చిన్నకోడూరు ఓ వైపు అప్పుల బాధలు, మరోవైపు కాలు విరిగిపోవడంతో మనస్తాపానికి గురై రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామ శివారులో సోమవారం జరిగింది. చిన్నకోడూరు ఎస్‌ఐ సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొయ్యడ మల్లయ్య (60) తనకున్న ఎకరా పొలంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పంట పెట్టుబడి కోసం కొంత అప్పు చేశాడు. దీనికితోడు రెండేండ్ల కిందట అతని కాలు విరిగిపోయింది. అప్పటినుంచి ఆయన తరచూ బాధపడేవాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఆదివారం సాయంత్రం 6గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. దాంతో కుటుంబసభ్యులు రాత్రంతా వెతికినా ఫలితం లేకుండా పోయింది. కాగా, సోమవారం ఉదయం వేరే రైతు పొలంలో చెట్టుకు ఊరేసుకుని మల్లయ్య మృతదేహం లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య బాలలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.