నవతెలంగాణ మహబూబాబాద్ 'తెలంగాణ ఆవిర్భావం తర్వాత పాట స్వరూపం మారి.. వ్యక్తుల చుట్టూ తిరుగుతోంది.. ఇలా మౌనంగా ఉండటం క్యాన్సర్ కంటే ప్రమాదం.. నేనొక లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నట్టుగా ఉంది.. ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకలేకపోతున్నాను.. అధికారపార్టీ ఎమ్మెల్యేగా ఉండటంతో నా సహజత్వాన్ని కోల్పోయి ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉండటంతో చాలా మందికి దూరమయ్యాను..' అంటూ మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజాకవి గొడిశాల జయరాజు తల్లి అచ్చమ్మ సంస్మరణ సభకు బాలకిషన్ హాజరై మాట్లాడారు. ఒక కంపెనీలో పని చేస్తున్నప్పుడు.. ఆ పరిధిలోనే బతకాల్సి ఉంటుందనీ, సింగరేణిలో పనిచేస్తూ ఇంకో కంపెనీలో పని చేస్తానంటే కుదరదు.. బయటికి వెళ్లాలంటే ఇంకో లిమిటెడ్ కంపెనీకే వెళ్లాలని తెలిపారు. తెలంగాణ వచ్చాక పాటలతో పాటు పండుగలు మారిపోయాయనీ, కొంతమందికే పరిమితం అయినట్టుగా ఉన్నాయన్నారు. మాటలు, పాటలు అదుపులో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పెరిగిన సమాజం ఆత్మాభిమానంతో బతుకని చెప్పిందని అన్నారు. ఈ వ్యాఖ్యలన్నీ ప్రభుత్వాన్ని ఉద్దేశించినట్టుగా ప్రచారం జరుగుతుంది. టీఆర్‌ఎస్ పార్టీలో స్వేచ్ఛను కోల్పోయి తనలోని కళాకారున్నీ అణచివేస్తూ బతుకుతున్నట్టుగా ఉందనట్టుగా రసమయి అసంతప్తితో మాట్లాడినట్టుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. సంస్కరణ సభలో ప్రముఖ నటుడు నారాయణమూర్తి సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ పాల్గొన్నారు.