- రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆర్.పార్థసారధి నవతెలంగాణ-సిటీబ్యూరో ఓటు.. రాజ్యాంగం కల్పించిన హక్కు అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆర్.పార్థసారధి అన్నారు. ప్రజాస్వామ్యంలో దాని ప్రాముఖ్యత గురించి ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ప్రతి ఏడాదీ జాతీయ ఓటరు దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. సోమవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం మీటింగ్ హాల్‌లో తన కార్యాలయ సిబ్బందితో ''ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మన దేశ సంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని, జాతి, మతం, కుల, వర్గ, భాష విభేదాలు లేకుండా, ఎలాంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లోనూ నిర్భయంగా ఓటు వేస్తాం'' అని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2011 నుంచి కేంద్ర ప్రభుత్వం చొరవతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు ''నేషనల్ ఓటర్స్ డే'' జరుపుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని తమ హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించడం, ప్రజాస్వామ్యంలో ఓటు విలువ తెలియజేయడం ప్రధాన ఉద్దేశమన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవలి కాలంలో గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్‌లు, జిల్లా ప్రజా పరిష్యత్‌లు మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సాధారణ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించిందని చెప్పారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజాస్వామ్యబద్ధంగా, నిబంధనల మేరకు విజయవంతంగా ఎన్నికలు నిర్వహించిన వారిని గుర్తించి వారికి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. గతేడాదిలో పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహించిన వారిని సత్కరించామని, త్వరలో వివిధ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పని చేసిన వారిని కూడా గుర్తించి ఏప్రిల్‌లో రాష్ట్ర స్థాయిలో సన్మానించనున్నట్టు తెలిపారు. ప్రతి ఏడాదీ ఓటర్స్ డే సందర్భంగా ఒక ''థీం'' నిర్ణయించి ఆ ప్రకారం నిర్వహిస్తామని చెప్పారు. 2021కి Making our Voters Empowered Vigilant, Safe & Informed అనే థీం నిర్ణయించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.