- ఘనంగా జేవీవీ ఆవిర్భావ దినోత్సవం - చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో విజేతలకు బహుమతి ప్రదానం హైదరాబాద్ : జనవిజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా జాతీయ వైజ్ఞానిక దినోత్సవంతో పాటు జన విజ్ఞాన వేదిక ఆవిర్భావ దినోత్సవాన్ని ఇటీవల ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరిం చుకొని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 'చెకుముకి సైన్స్ సంబరాలు' నిర్వహించినట్టు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు అందె సత్యం, ప్రధాన కార్యదర్శి రావుల వరప్రసాద్ తెలిపారు. పలు జిల్లాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయా స్థానిక యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ప్రజా ప్రతినిధులు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు హాజరై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. శాస్త్రీయ ఆలోచనలకు పునాది బాల్యమనీ, విద్యార్థులు శాస్త్రీయ స్పృహను, సృజనాత్మకతను, హేతుబద్ధమైన ఆలోచనను పెంచుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 22న ''చెకుముకి టాలెంట్ పరీక్ష''లను ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలో చదువుతున్న 8, 9, 10 తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో నిర్వహించినట్టు తెలిపారు. ఈ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తి పెంచే కరదీపికలు, విలువైన బహు మతులతో పాటు సర్టిఫికెట్లు అందచేసారు. ఈ పరీక్షకు పలు జిల్లాల నుంచి వేలాది మంది విద్యార్ధులు పాల్గొని సైన్స్ పట్ల తమ ఆసక్తిని చాటారు. భవిష్యత్ శాస్త్రవే త్తలుగా ఎదగడానికి విద్యార్థి దశ కీలకమైనది. నేటి ప్రపంచ అభివృద్ధి వెనక విజ్ఞాన శాస్త్రం కృషి ఎంతో వుంది, శాస్త్రీయ దృక్పథం ఆవశ్యకతను ఇటీవల కరోనా మహమ్మారి కూడా నొక్కి చెప్పిందని తెలిపారు. విద్యార్థులందరు పాఠశాల దశ నుంచే ప్రశ్నించేతత్వాన్ని పెంపొందించుకోవాలనీ, శాస్త్రీయ దృక్పథంతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. వైజ్ఞానిక ఆలోచనలకు పునాది వేసె ''చెకుముకి'' - బాలల సైన్స్ మాసపత్రిక పేరుమీద ఈ చెకుముకి సంబరాలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్టు అందె సత్యం, రావుల వరప్రసాద్ తెలిపారు.