Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుద్యోగ భృతి.. ఉద్యోగాలెక్కడ..?
- హామీలు అమలు చేయలేనప్పుడు ఎందుకొచ్చావ్
- మంత్రి ప్రచారాన్ని అడ్డుకున్న నిరుద్యోగి
- తొక్కిపడ్డేస్తా.. నీలాంటి కుక్కల్ని చాలా మందిని చూశా : నిరుద్యోగిపై మంత్రి ఫైర్
నవతెలంగాణ-హాలియా
ఇంటికో ఉద్యోగం అన్నారు.. అదీ లేదు.. ఉద్యోగం లేనోళ్లకు నిరుద్యోగ భృతి కింద రూ.3016 ఇస్తాం అన్నారు.. అదీ లేదు.. హామీలు అమలు చేయలేనప్పుడు ప్రచారానికి ఎందుకొచ్చావ్..? అంటూ నల్లగొండ జిల్లా హాలియా మండలంలోని కొత్తపల్లి గ్రామానికి
ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి జగదీశ్‌రెడ్డిని ఓ నిరుద్యోగి నిలదీశాడు. మంత్రి జగదీశ్‌రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి భగత్‌తో కలిసి ప్రచారసభలో పాల్గొన్నారు. కాగా కొత్తపల్లి గ్రామానికి చేరుకోగానే ఆ గ్రామానికి చెందిన అలుగుల అశోక్‌రెడ్డి మంత్రి ప్రచార వాహనాన్ని అడ్డు కొని నిలదీశాడు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి లేదు.. దళితులకు మూడె కరాల భూపంపిణీ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదు.. కానీ ఓట్లడగటానికి ప్రచారానికి ఎందుకొచ్చావ్ అంటూ మంత్రిని నిలదీశాడు. కాగా, అశోక్‌రెడ్డి గతంలో హైదరాబాద్‌లో ప్రయివేటు టీచర్‌గా పని చేశాడు. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి గ్రామంలోనే ఉంటున్నాడు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నాడు.
తొక్కిపడ్డేస్తా.. నీలాంటి కుక్కల్ని చాలా మందిని చూశా : మంత్రి ఆగ్రహం
ప్రచారాన్ని అడ్డుకున్న నిరుద్యోగిపై మంత్రి జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాడిని ఇటు తీసుకరండి.. తొక్కి పడేసేయండి.. నక్రాల్ తీస్త బిడ్డా..! ఏమనుకుంటున్నావో.. నిన్ను, నీ నాయకున్ని తొక్కి వదిలిపెడతాం.. నీలాంటి కుక్కల్ని చాలా మందిని చూశాం..అంటూ తీవ్ర పదజాలంతో మంత్రి ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న స్థానిక టీఆర్ఎస్ నాయకులు నిరుద్యోగిని వారించే ప్రయత్నం చేయగా, పోలీసులు కలగజేసుకొని అక్కడ్నుంచి తీసుకెళ్లారు.
నిరుద్యోగుల ఆవేదన..
ఉన్నతమైన పదవిలో ఉండి నిరుద్యోగిపై మంత్రి తీవ్ర పదజాలంతో దూషించడం పట్ల నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో తమను కుక్కలతో పోల్చడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా నెల కిందట హాలియాలో జరిగిన సభలో సీఎం కేసీఆర్ సౌతం గిరిజన మహిళలను కుక్కలని పోల్చారని, ఇప్పుడు మంత్రి నిరుద్యోగులను కుక్కలతో పోల్చడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.