Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్నలిస్టులపై దాడుల నివారణకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలి : టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సోమయ్య, బసవపున్నయ్య
నవతెలంగాణ- సిటీబ్యూరో
అర్హులైన జర్నలిస్టులకు వెంటనే ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బి.బసవపున్నయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లి రాంచందర్, గుడిగె రఘు, రాష్ట్ర కార్యదర్శులు ఎ.నర్సింగ్‌రావు, ఇ.చంద్రశేఖర్, నిరంజన్ కొప్పు, బి.జగదీశ్వర్‌తో కలిసి సోమవారం సోమాజిగుడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆదివారం ఆర్టీసీ కల్యాణమండపంలో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ద్వితీయ మహాసభలో 27 మంది ఆఫీసు బేరర్లు, 28మంది ఈసీ మెంబర్లతో కలిపి 55మందితో రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బి.బసవపున్నయ్య మాట్లాడుతూ.. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మహాసభల్లో జర్నలిస్టుల సమస్యలపై తొమ్మిది తీర్మానాలను ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించినట్టు చెప్పారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
- అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలి
- అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి
- మహిళా జర్నలిస్టులపై లైంగిక వేధింపుల నివారణ చట్టం తీసుకురావాలి.
- జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలి.
- జర్నలిస్టులకు ఆరోగ్యబీమా, ప్రమాద బీమా కల్పించాలి.
- జర్నలిస్టుల ఆరోగ్య కార్డులు అన్ని ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి.
- దళిత బంధు తరహాలో జర్నలిస్టు బంధును ప్రవేశపెట్టాలి.
- జర్నలిస్టుల పెన్షన్ పథకాన్ని అమలు చేయాలి
- చిన్న పత్రికలు, డిజిటల్ మీడియాను ప్రభుత్వం గుర్తించాలి.