Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ జిల్లా ఐద్వా మహాసభ ర్యాలీ, బహిరంగసభలో.. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ-మట్టెవాడ
హక్కుల సాధన కోసం మహిళలు ఐక్యంగా ఉద్యమించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. మంగళవారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) వరంగల్ జిల్లా ప్రథమ మహాసభ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. వరంగల్ చౌరస్తా నుంచి వరంగల్ హెడ్పోస్ట్ ఆఫీస్ మీదుగా వరంగల్ రైల్వేస్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వ హించారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టాలని, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గరికపాటి, రాందేవ్‌బాబా వంటి వాళ్లును వెంటనే శిక్షించాలని నినదించారు. అనంతరం జరిగిన సభలో మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మహిళలకు రక్షణ లేక అభద్రత భావానికి లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ మాతాకీ జై అంటూనే మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్దాంతాలైన మనువాద, మతోన్మాద భావజాలంతో మహిళలను అణిచి వేయాలని చూస్తున్నారని ఆరోపించారు. గ్రాడ్యు యేషన్, పీహెచ్‌డీలు చేసిన మహిళలు, యువతులు ఉద్యోగాలు లేక, కూలీ పనులకు వెళ్తున్న దౌర్భాగ్య పరిస్థితులు నేడు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన ధరలతో మహిళలు పౌష్టిక ఆహారం లేక అనారోగ్యాల పాలవుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించి, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి నలిగంటి రత్నమాల, నాయకులు చీర కవిత, మాలోతు ప్రత్యూష, వాణి, రేణుక, తదితరులు పాల్గొన్నారు.