Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిసెంబర్లోనే నోటిఫికేషన్లు : సీఎస్ సోమేశ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మరో 16,940 కొలువులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీఆర్కేఆర్ భవన్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్పై టీఎస్పీఎస్సీ చైర్మెన్ బి జనార్ధన్‌రెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయా శాఖల్లో నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వివిధ శాఖల్లో వివిధ కేటగిరీల కింద 60,929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని సోమేశ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మరో 16,940 పోస్టుల నియామకానికి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలు టీఎస్పీఎస్సీ, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ రిక్రూట్ మెంట్ బోర్డు తదితర ఏజెన్సీల ద్వారా భర్తీ అవుతాయని వివరించారు. నియామకాల ప్రక్రియలో సమయపాలన కచ్చితంగా పాటించడంతోపాటు, రిక్రూట్మెంట్ ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సర్వీస్ రూల్స్‌లో చేపట్టాల్సిన మార్పులను పూర్తి చేసి అవసరమైన అన్ని వివరాలనూ టీఎస్పీఎస్సీకి వెంటనే సమాచారం అందించాలని కోరారు. వాటి ఆధారంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చేనెలలో నోటిఫికేషన్లను జారీ చేస్తుందని పేర్కొన్నారు. రిక్రూట్మెంట్ ప్రక్రియను ప్రతిరోజూ పర్యవేక్షించాలంటూ సంబంధిత అధికారులను సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ శాంతికుమారి, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.