Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ రేటుకి మూడింతల పరిహారం చెల్లించాలి : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు డిమాండ్
- నాయకులు, రైతుల అక్రమ అరెస్టు
నవతెలంగాణ-కొండాపూర్
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గిర్మాపూర్‌లో రీజినల్ రింగ్ రోడ్డు పేరిట సేకరిస్తున్న బలవంతపు భూసేకరణను వెంటనే ఆపాలని సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం త్రిబుల్ఆర్ కోసం భూములు కోల్పోతున్న రైతులకు మద్దతుగా సీపీఐ(ఎం), ప్రజాసంఘాల నాయకులు సర్వే జరుగుతున్న గిర్మాపూర్ శివారు ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న సర్వే పనుల్ని ఆపాలని డిమాండ్ చేశారు. రైతులు, సీపీఐ(ఎం), రైతు సంఘం నాయకుల్ని సీఆర్పీఎఫ్, సివిల్ పోలీసులు అడ్డుకున్నారు. సర్వే ప్రాంతం నుంచి బలవంతంగా లాక్కెళ్లారు. సీపీఐ(ఎం) నాయకులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ప్రశ్నిస్తున్న రైతులను, వారికి మద్దతుగా నిలబడ్డ సీపీఐ(ఎం), రైతు సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేసి బుదేరా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ.. త్రిబుల్ఆర్లో రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భూముల సర్వే చేయడాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రమేయం లేకుండా వారి పంట పొలాల్లో సర్వే ఎలా చేస్తారని ప్రశ్నించారు. పోలీసు బలగాలతో రైతుల్ని భయబ్రాంతులకు గురి చేస్తూ సర్వే చేయడం అన్యాయమన్నారు. చట్ట ప్రకారం రైతులతో గ్రామసభ నిర్వహించి రైతుల అభిప్రాయం మేరకే సర్వే, భూసేకరణ చేయాలని డిమాండ్ చేశారు. దేశానికి అన్నం పెడుతున్న రైతాంగానికి సున్నం పెట్టే ఆలోచనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలన్నారు. విలువైన భూములను ప్రభుత్వం పోలీసులను పెట్టి బలవంతంగా లాక్కోవడం, రైతులను రోడ్డుపాలు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమికి భూమి లేదా మార్కెట్ రేటుకి మూడింతలు అదనంగా చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తక్షణమే రైతులతో చర్చలు జరిపి చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలని, లేకపోతే భవిష్యత్తులో రైతుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) కొండాపూర్ మండల కార్యదర్శి కే.రాజయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.నరసింహారెడ్డి, సీపీఐ(ఎం) నాయకులు రామచందర్, బాబూరావు, గ్రామ రైతులు జయరాములు, మహేష్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.