Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంధన సర్దుబాటు పేరుతో ప్రతినెలా బాదుడు
- డిస్కంలకు టీఎస్ఈఆర్సీ అనుమతి
- ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి...
- 2023-24 ఏఆర్‌ఆర్‌లు సమర్పించిన డిస్కంలు
- టారిఫ్ పెంచమని ప్రతిపాదించలేదు...
- అయినా విచారణ చేస్తాం : ఈఆర్సీ చైర్మెన్ టీ శ్రీరంగారావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఉమ్మడి రాష్ట్రంలో అమల్లో ఉన్న ఇంధన సర్దుబాటు చార్జీలు (ఎఫ్ఎస్ఏ) ఇప్పుడు మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో అమల్లోకి వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) ముసాయిదా ప్రతిపాదనలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్ని ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెచ్చుకోవచ్చని టీఎస్ఈఆర్సీ చైర్మెన్ టీ శ్రీరంగారావు తెలిపారు. ఇంధన కొనుగోలు వ్యయం సర్దుబాటు (ఎఫ్ఎస్ఏ) కోసం ప్రతినెలా యూనిట్‌కు 30 పైసల వరకు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా నేరుగా విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) పెంచుకోవచ్చనీ, ఆపై మొత్తం పెంచాల్సి వస్తే తమ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. డిస్కంలు ప్రతినెలా అదనంగా వసూలు చేసే ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్ఎస్ఏ) వివరాలను తమ సంస్థల వెబ్సైట్లలో పెట్టాలని చెప్పారు. ఎంత చార్జీ, ఎందుకు వసూలు చేస్తున్నారు... అనే వివరాలు దానిలో ఉండాలన్నారు. అలాగే ప్రయివేటు డిస్కంల ఏర్పాటు ప్రతిపాదనలు కేంద్రం నుంచి వచ్చాయనీ, వాటిని పరిశీలిస్తున్నామని అన్నారు. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల ప్రతిపాదనలను రాష్ట్రంలోని రెండు డిస్కంలు బుధవారం టీఎస్ఈఆర్సీ చైర్మెన్ టీ శ్రీరంగారావు, సభ్యులు (టెక్నికల్) ఎమ్డీ మనోహరరాజుకు డిస్కంల వాణిజ్య విభాగం అధికారులు గణపతి, స్వామిరెడ్డి సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీరంగారావు మీడియాతో మాట్లాడారు. డిస్కంలు ఇచ్చిన ఏఆర్‌ఆర్‌లో చార్జీలు పెంచాలని ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదనీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సర టారిఫ్‌నే అమలు చేస్తామని పేర్కొన్నాయని వివరించారు. ప్రతినెలా వసూలు చేసే ఎఫ్ఎస్ఏ సొమ్మును ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమచేసి, డిస్కంలు తమకు లెక్కలు చెప్పాల్సి ఉంటుందన్నారు. అలాగే ఏటీ అండ్ సీ నష్టాలు 15 శాతానికి తగ్గించుకోకుంటే, అలాంటి లెక్కల్ని తాము పరిగణనలోకి తీసుకోబోమని చెప్పారు. వీటి తగ్గింపు కోసం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు. వ్యవసాయ విద్యుత్ వినియోగంపై డిస్కంల దగ్గర పక్కా లెక్కలు లేవనీ, అందువల్ల ప్రతి వ్యవసాయ ట్రాన్స్‌ఫారమ్ వద్ద మీటర్లు పెట్టాలనే తమ ఆదేశాలను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. 3 లక్షల డీటీఆర్‌ల వద్ద మీటర్ల ఏర్పాటుకు 2024 డిసెంబర్ వరకు డిస్కంలకు గడువు ఇచ్చామన్నారు. 500 యూనిట్లు దాటే ప్రతి వినియోగదారుడికి స్మార్ట్ మీటర్లు పెట్టాలని ఆదేశించామనీ, డిస్కంలు ఆర్డీఎస్ఎస్ స్కీంలో చేరాయో లేదో తమకు సమాచారం లేదన్నారు. ప్రీ పెయిడ్ మీటర్లను ప్రభుత్వ కార్యాలయాలు సహా పలుచోట్ల ఏర్పాటు చేయాలని ఆదేశించామనీ, అయితే ప్రీ పెయిడ్ మీటర్లలో సాంకేతికత మరింత అప్‌గ్రేడ్ కావాల్సి ఉందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఈఎస్ఎల్ సంస్థ ఏర్పాటు చేసిన 15 వేల ప్రీపెయిడ్ మీటర్లు సక్రమంగా పనిచేయట్లేదనీ, వాటిని తొలగించాలని అక్కడి డిస్కంలు కోరుతున్నాయన్నారు. ఆ అనుభవాల దృష్ట్యా ప్రీ పెయిడ్ మీటర్లు మరింత సాంకేతికాభివృద్ధి సాధించాకే ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుటుందని అభిప్రాయపడ్డారు.
ఏఆర్‌ఆర్‌లపై విచారణ చేస్తాం
డిస్కంలు ఇచ్చిన 2023-24 వార్షిక ఆదాయ అవసరాల ప్రతిపాదనలను పరిశీలించి, వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచుతామని శ్రీరంగారావు తెలిపారు. వీటిపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించి, బహిరంగ విచారణలు నిర్వహిస్తామని చెప్పారు. డిస్కంలు చార్జీలు పెంచాలని ప్రతిపాదించకున్నా, విచారణల్లో వచ్చిన అభిప్రాయాల మేరకు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ప్రార్థనా మందిరాలకు కరెంటు చార్జీలు తగ్గించాలనీ, వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరా అవసరం లేదనే ప్రతిపాదనలు తమకు అందాయని వివరించారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని చార్జీలపై నిర్ణయం ప్రకటిస్తామన్నారు.