Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2023 నీట్ పిజియే చివరిది...
- ఆ తర్వాత నెక్ట్ ద్వారానే పీజీ ప్రవేశాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వైద్య విద్యార్థులకు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్(నెక్స్ట్) తప్పనిసరి కానుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే ఉన్నత విద్యలో ప్రవేశాలు, ప్రాక్టీస్‌కు అవకాశం లభిస్తుంది. 2024 నుంచి వైద్యవిద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్- పీజీ పరీక్ష స్థానంలో నెక్ట్స్ రానున్నది. 2023లో నిర్వహించే నీట్ -పీజీ పరీక్షే చివరిది. 2020లో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి) చట్టానికి సవరణలు చేసిన కేంద్ర ప్రభుత్వం, నీట్ -పీజీ స్థానంలో నెక్ట్స్ నిర్వహించాలని నిర్ణయించింది. మొదటి నెక్ట్స్ పరీక్షను 2023 డిసెంబర్లో నిర్వహించనున్నారు. 2019 -20 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థులు నెక్ట్ రాసే మొదటి బ్యాచ్ అవుతారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే వైద్యవిద్యలో ఉన్నత విద్యతో పాటు ప్రాక్టీసు చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది.
నీట్- పీజీ పరీక్ష మెడికల్ పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మాత్రమే నిర్వహిస్తుండగా, నెక్ట్స్‌లో మూడు అంశాలను చేర్చారు. ఎన్ఎంసీ చట్టం ప్రకారం, చివరి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులకు నెక్ట్స్ అనేది ఒక సాధారణ ఆప్టిట్యూడ్ పరీక్ష. ఈ పరీక్ష ఆధునిక వైద్యాన్ని అభ్యసించడానికి లైసెన్స్ పరీక్షగా, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశానికి మెరిట్ ఆధారిత ప్రవేశ పరీక్షగా, భారతదేశంలో ప్రాక్టీస్ చేయాలనుకునే విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లకు స్క్రీనింగ్ పరీక్షగా ఉండబోతున్నది.
2024 నుంచి నెక్ట్స్ ద్వారా పిజి ప్రవేశాలు : డాక్టర్ రాజలింగం
దేశవ్యాప్తంగా 2024 నుంచి నేషనల్ ఎగ్జిట్ ద్వారా మాత్రమే వైద్యవిద్యలో పోస్టు ప్రవేశాలు జరుగుతాయని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మెన్ డాక్టర్ రాజలింగం తెలిపారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు మెడికల్ కౌన్సిల్స్‌లో రిజిస్ట్రేషన్‌కు ఈ నెక్ట్స్ తప్పనిసరని చెప్పారు.