Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్
నవతెలంగాణ - కల్చరల్
జాతి ఉనికికి.. తెలుగు భాషను పరిరక్షించుకుంటూ సజీవంగా ఉంచుకోవాలని.. ఇందుకు తెలుగు విశ్వవిద్యాలయంపై గురుతర బాధ్యత ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళా మందిరంలో శుక్రవారం తెలుగు విశ్వవిద్యాలయ 37వ వ్యవస్థాపక దినోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ముదిగంటి సుజాత రెడ్డికి 2020 సంవత్సరానికిగాను, సంగీత నృత్య కళా ప్రక్రియల్లో పరిశోధకుడు, విమర్శకుడు వి.ఏ.కె.రంగారావుకు 2021 సంవత్సరానికి విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారాలుగా ఒకొక్కరికీ లక్ష నగదుతో పాటు జ్ఞాపిక, ప్రసంసాపత్రాన్ని వినోద్ కుమార్ చేతుల మీదుగా బహూకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం కేవలం ఆంగ్ల భాష వల్లనే ఉంటుందనే అపోహ అని.. పాశ్చాత్య శాస్త్రవేత్తలు తమ మాతృభాషలోనే పరిశోధనలు చేసి ప్రపంచానికి నూతన ఆవిష్కరణలు అందించారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీతో పాటు మరో వెయ్యి ఉద్యోగాల కల్పనకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసు కున్నారని గుర్తు చేశారు.
ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణ మాట్లాడుతూ.. తెలుగు విశ్వ విద్యాలయం కోర్సులు స్వయం ఉపాధి కోసమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా రూప కల్పన చేయాలని సూచిం చారు. అధ్యక్షత వహించిన విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య తంగేడ కిషన్‌రావు మాట్లాడుతూ.. అన్య రాష్ట్ర సరిహద్దుల్లోను తెలుగు విశ్వ విద్యాలయ ప్రాంగణాలు ఏర్పాటు చేసి భాషా వికాసం సంస్కృతి వికాసానికి మరింత కృషి చేస్తున్నట్టు తెలిపారు. విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ శత జయంతి ఉత్స వాలు రెండ్రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ నివేదిక సమర్పించారు. తొలుత నిర్వహించిన స్వాతిక ఆంధ్రనాట్యం, భాగ్య బృందం నాట్యం, రవి కుమార్ బృందం, ఒగ్గు డోలు విన్యాసం ఆకట్టుకున్నాయి.