Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణ ప్రగతి కింద ప్రతి నెలా నిధుల విడుదల
- ఇప్పటిదాకా రూ. 3,786 కోట్ల 78 లక్షల నిధుల మంజూరు
- జీహెచ్ఎంసీకే రూ.1.919. 49 కోట్లు విడుదల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో అత్యంత వేగంగా పట్టణీకరణ చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాలు, నగరాల్లో మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతిని అమలు చేస్తున్నది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా 142 మున్సిపాల్టీలు, నగరాలకు రూ.3,786. 78 కోట్ల నిధులను మంజూరు చేసింది. మొత్తం నిధుల్లో రూ.3,066.21 కోట్లు వినియోగించబడ్డాయి. ఒక్క జీహెచ్ఎంసీకే రూ.1.919.49 కోట్లను విడుదల చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ ప్రతి నెలా ఒక క్రమ పద్ధతిలో నిధులు విడుదల చేస్తూ ప్రణాళికాయుతంగా అభివృద్ధికి బాటలు వేస్తున్నది. ఈ మేరకు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి పట్టణ ప్రగతి కింద జీహెచ్ఎంసీకి రూ.91.65 కోట్లు, మిగిలిన కార్పొరేషన్లకు రూ.78.48 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. పట్టణ ప్రగతి ద్వారా అంత్యంత నివాసయోగ్య నగరాలు, పట్టణాలున్న రాష్ట్రంగా తెలంగాణకు జాతీయస్థాయిలో గుర్తింపు లభిస్తున్నది. జీహెచ్ఎంసీ మినహా 141 యూఎల్బీలలోని 2,548 వాహనాల ద్వారా రోజుకు 2,675 మెట్రిక్ టన్నుల చెత్తను తరలించేవారు. పట్టణ ప్రగతితో అదనంగా 2,165 శానిటేషన్ వాహనాలను కొనుగోలు చేశారు. శానిటేషన్ వాహనాల సంఖ్య రూ.4,713 కి పెరగటం వల్ల రోజుకు తరలిస్తున్న చెత్త పరిమాణం 4,356 టన్నులకు చేరింది. దీనితో పట్టణ, నగర ప్రాంతాల్లో శానిటేషన్ పరిస్థితి మెరుగైంది. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. అందులో భాగంగా 141 పురపాలక సంస్థలు మొత్తం 965 ఎకరాలు విస్తీర్ణంలో ఉన్న స్థలాల్లో డంప్ యార్డులను నిర్వహిస్తున్నది. 205 చోట్ల పొడి, తడి చెత్త సేకరణ కేంద్రాలను, 224 కాంపోస్ట్ షెడ్స్, బెడ్లను ఏర్పాటు చేశారు.
పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాలను కలుషితం కాకుండా కాపాడుకునేందుకు 71 నగర, పురపాలక సంస్థలో రూ.250 కోట్ల 73 లక్షలతో హమ్ మోడల్లో నెలకొల్పిన మానవ మల వ్యర్ధాల శుద్ధి ప్లాంట్ల నిర్వహణను పటిష్టం చేశారు. అలాగే రూ.177 కోట్ల 33 లక్షలతో కొత్తగా 68 పుర,నగర పాలక సంస్థల్లో ఈపీసీ మోడల్లో ఎఫ్ఎస్టీపీలను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 139 ఎఫ్ఎస్టీపీల ద్వారా రోజుకు 2,060 కిలోలీటర్ల మానవ మల వ్యర్ధాల శుద్ధికరణ చేసే సామర్థ్యం ఏర్పడుతుంది. కొత్తగా 20 నగర, పుర పాలక సంస్థల్లో మంజూరు చేసిన ఎఫ్ఎస్టీపీల పనులు పూర్తయ్యాయి. 24 చోట్ల చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయి.
మరో 36 చోట్ల చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 46 యూఎల్బీలలో ఎఫ్ఎస్టీపీల ఏర్పాటుకు అనువైన స్థలాలు గుర్తించడం జరిగింది. మరో 22 యూఎల్బీలలో స్థల అన్వేషణ జరుగుతున్నది. గతంలో జీహెచ్ఎంసీ మినహా 141 యూఎల్బీలలో 4,970 పబ్లిక టాయిలెట్లు మాత్రమే ఉన్నవి. ప్రతి వేయి మందికి ప్రతి వేయి మందికి ఒక పబ్లిక్ టాయిలెట్ ఉండాలనే నిబంధనను ప్రభుత్వం అమలుచేస్తున్నది. దానిలో భాగంగా పురుషులకు 2,060, మహిళలకు 2,058, మొత్తం 4,118 పబ్లిక్ టాయిలెట్స్ ను నిర్మించారు. వీటితో కలిపి పబ్లిక్ టాయిలెట్స్ సంఖ్య 9,088 కి చేరాయి. పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ కోసం 18 పారామీటర్లతో యాప్ బేస్డ్ ఆన్లైన్ చెకింగ్‌ను అమలు చేస్తున్నది. ఈ పారామీటర్ల ప్రకారం ప్రతి మంగళవారం, శుక్రవారాలలో పబ్లిక్ టాయిలెట్లను అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పట్టణ ప్రగతిలో నగర, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగుకు చేపట్టిన పనులతో తెలంగాణకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తున్నది.