Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి
- జాతీయ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ- నల్లగొండ
రాష్ట్రంలోని కడివెండి నుంచి కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ వరకు వెళ్లనున్న అమరవీరుల జ్యోతియాత్రను జయప్రదం చేయాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 35వ మహాసభ పోస్టర్‌ను శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవనంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 13-16వ తేదీల్లో కేరళ రాష్ట్రంలోని త్రిసూర్‌లో జాతీయ మహాసభ జరగనుందని, ఈ క్రమంలో దేశంలోని రెండు ప్రాంతాల నుంచి అమరవీరుల జ్యోతి యాత్ర బయల్దేరుతుందని చెప్పారు. వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పాలకులు అనుసరిస్తున్న విధానాలు ప్రజలకు వివరించేందుకు ఈ యాత్రలు నిర్వహిస్తున్నారన్నారు. మొదటి యాత్ర ఈనెల 5న వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య స్వగ్రామమైన కడివెండిలో ఉదయం ప్రారంభమవుతుందన్నారు. ఈ యాత్ర కడివెండి నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు రామన్నపేటకు వస్తుందన్నారు. మధ్యాహ్నం 2:00 గంటలకు గుండ్రాంపల్లికి, 3:30కి నల్లగొండకు చేరుకొని గడియారం సెంటర్‌లో సభ ఉంటుందన్నారు. అక్కడి నుంచి 5.30 గంటలకు మిర్యాలగూడకు వెళ్తుందని, అక్కడ సభ అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, బండ శ్రీశైలం, కూన్‌రెడ్డి నాగిరెడ్డి, కందాల ప్రమీల, ఐతరాజు నర్సింహ, నన్నూరి వెంకట రమణా రెడ్డి, సయ్యద్ హాషం, ఎండీ.సలీం, ముత్యాలు, మధు సూదన్‌రెడ్డి, బీ.రవీందర్, నర్సింహ, జోకుల నర్సింహయ్య తదితరులు పాల్గొన్నారు.