Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇందిరా పార్క్ వద్ద విద్యార్థులతో మహాధర్నాలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు,ఎంపీ ఆర్,కృష్ణయ్య
నవతెలంగాణ-అడిక్‌మెట్
ఎనిమిది లక్షల మంది యూనివర్సిటీ, కాలేజీ, గురుకులాలు, హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను వెంటనే పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్‌ప కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీలపల్లి అంజి అధ్యక్షతన విద్యార్థులతో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేండ్ల కిందటి ధరల ప్రకారం నిర్ణయించిన మెస్ చార్జీలు, స్కాలర్ షిప్‌లు ఇంకా కొనసాగిస్తున్నారన్నారు. ప్రస్తుతం నిత్యావసర ధరలు మూడు రెట్లు పెరిగాయని, దాంతో హాస్టల్ మెనూ పాటించడానికి డబ్బులు సరిపోక గుడ్లు, పండ్లు తగ్గించారని తెలిపారు. అలాగే విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆలోచన రాకపోవడం దుర్మార్గమన్నారు. ఉద్యోగుల వేతనాలు రెండుసార్లు పెంచారని, శాసనసభ్యులు, మంత్రుల వేతనాలు మూడు రెట్లు పెంచారని, కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు మాత్రం పెంచడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు రూ. 1500 నుంచి రూ. 3 వేలకు, పాఠశాల హాస్టల్ విద్యార్థులకు రూ..950 నుంచి రూ.2000కు పెంచాలని డిమాండ్ చేశారు. బీసీ జనాభా ప్రకారం అదనంగా 240 గురుకుల పాఠశాలలు మంజూరు చేయాలని కోరారు. అలాగే బీసీ కాలేజీ హాస్టళ్లకు, గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. మహా ధర్నాలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మెన్ నీల వెంకటేష్, నాయకులు రాజ్ కుమార్, పగిళ్ల సతీష్, అనంతయ్య, నిఖిల్, భాస్కర్ ప్రజాపతి, మల్లేష్, సందీప్, వంశీ, తదితరులు పాల్గొన్నారు.