Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటు ఆస్పత్రుల్లో ధరల నియంత్రణపై సర్కారు యోచన
- వీఎన్ ప్రజా వైద్యశాలకు సహకారమందిస్తాం..
- హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటి
- స్మారక వైద్యశాలకు మరింత సహకారం : ఎంవీఎన్ కుటుంబ సభ్యులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
పేదలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరింత మెరుగైన వైద్యం అందించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటి అన్నారు. నవతెలంగాణ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం మల్లు వెంకట నర్సింహారెడ్డి స్మారక ప్రజావైద్యశాల 12వ వార్షికోత్సవాన్ని హైదరాబాద్ వీఎస్టీలోని ఎంహెచ్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ రమాదేవి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ వెంకటి మాట్లాడుతూ.. పేదలకు, బస్తీల్లో నివసించే వారికి నాణ్యమైన సేవలు అందించడంలో భాగంగా నగరవ్యాప్తంగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని, వాటిల్లో దాదాపు 55 రకాల ల్యాబ్ సేవలు అందిస్తున్నామని చెప్పారు. త్వరలో బస్తీ దవాఖానాల్లో మరిన్ని వైద్య సేవలు అందిస్తామన్నారు. పేదలకు ఆర్యోగంపై అవగాహన చాలా తక్కువగా ఉంటుందని, ఏ రోగానికి ఎక్కడికి పోవాలో.. ఏం చేయాలో మరింత అవగాహన పెంచాల్సిన అవసరముందన్నారు. కొన్నిసార్లు ఇలాంటి అవగాహన లోపంతో ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ధరల నియంత్రణకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. ఎంవిఎన్ ప్రజావైద్యశాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని, ఇక్కడికి వచ్చే ప్రజలకు ల్యాబ్ పరీక్షల కోసం బస్తీ దవాఖానాలకు రీఫర్ చేస్తే.. సేవలు అందిస్తామని చెప్పారు.
డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ.. వీఎన్ ప్రజా వైద్యశాలకు వచ్చే వారికి ఒక భరోసా ఉండాలని, రోడ్డుపై అడ్డుక్కునే కడుబీదలకు కూడా వైద్యం అందుతుందనే భరోసా కల్పించాలని, ఆ విధంగా మనం వైద్యసేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. నేడు వైద్యం వ్యాపారమయం అయిందని, పేదలు ఏదైనా రోగం వస్తే ఆ బాధకన్నా.. ప్రయివేట్ కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తే ఎంత ఖర్చవుతోందనన్న బాధే వారికి ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అందువల్ల ఆస్పత్రులకు వెళ్లడానికి కూడా భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వీఎన్ కూతురు కరుణ మాట్లాడుతూ.. వైద్యరంగం పట్ల ఎంతో మక్కువ ఉండేదని, పేదలు, పార్టీ కార్యకర్తలు వైద్యం అందక చనిపోవద్దని మల్లు వెంకట నర్సింహారెడ్డి ఆలోచించేవారని గుర్తుచేసుకున్నారు. పేదలకు వైద్య సేవలు అందించేందుకు ఎంతో ఆసక్తి కనబర్చేవారని తెలిపారు. ప్రస్తుతం కార్పొరేట్ ఆస్పత్రుల్లో అవసరమున్నా.. లేకున్నా ప్రాథమిక పరీక్షల పేరుతో లక్షల్లో వసూలు చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఎంవీఎన్ ప్రజావైద్యశాల లాంటి వాటి అవసరం ఎంతో ఉందని అన్నారు.
నవతెలంగాణ దినపత్రిక సీజీఎం ప్రభాకర్ మాట్లాడుతూ.. మల్లు వెంకట నర్సింహారెడ్డి, మల్లు సర్వాజ్యంతోపాటు వారి కుటుంబమంతా పేదల కోసం పనిచేశారని గుర్తుచేశారు. ఈ బిల్డింగ్(ఎంహెచ్ భవన్) కట్టే సమయంలో ఇందులో ఆస్పత్రి పెట్టి చుట్టుపక్కల ఉన్న పేదలు, బస్తీవాసులతోపాటు సిబ్బందికి వైద్య సేవలు అందించాలని ఆయన చెప్పారని అన్నారు. అయితే, బిల్డింగ్ పూర్తయ్యే సమయానికి ఆయన మృతిచెందడంతో ఈ ఆస్పత్రికి మల్లు వెంకట నర్సింహారెడ్డి స్మారక ప్రజావైద్యశాల పెట్టాలని నిర్ణయించారన్నారు. ఇది అందుబాటులోకి వచ్చిన 11 ఏండ్లలో దాదాపు 2లక్షల మందికి వైద్య సేవలు అందించామన్నారు. వీఎన్ కుటుంబ సభ్యులతోపాటు దాతలు, డాక్టర్లు, సిబ్బంది ఎంతో సహకరించారని, భవిష్యత్తులో అందరి సహకారంతో.. నర్సింహారెడ్డి కోరిక మేరకు మరిన్ని వైద్యసేవలు అందిస్తామని చెప్పారు.
జనరల్ మేనేజర్ భరత్ మాట్లాడుతూ.. మల్లు వెంకట నర్సింహా రెడ్డి ప్రజావైద్యశాల ద్వారా గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది నవంబర్ 30 వరకు 2200 మంది రోగులకు సేవలు అందించామన్నారు.
ఈ సందర్భంగా మల్లు వెంకట నర్సింహా రెడ్డి ప్రజా వైద్యశాల అభివృద్ధికి వీఎన్ కూతురు కరుణ లక్ష రూపాయల చెక్కును అందజేశారు. వీఎన్ చిత్రపటానికి హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటి, డాక్టర్లు రమాదేవి, లక్ష్మణ్‌రావు, స్వామి అల్వార్, నవతెలంగాణ దినపత్రిక సీజీఎం ప్రభాకర్, ఎంవిఎన్ కూతురు కరుణ, మనవండ్లు వంశీ, శశికాంత్, కుటుంబ సభ్యులు కపోతంరెడ్డి, ఎల్ఐసీ యూనియన్ సీనియర్ నాయకులు వేణుగోపాల్, నవతెలంగాణ బుకహేౌస్ ఎడిటర్ ఆనందాచారి, జీఎంలు భరత్, లింగారెడ్డి, నవతెలంగాణ మొఫసిల్ ఇన్చార్జి వేణుమాధవ్, ఎస్టేట్ మేనేజర్ వీరయ్య తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది, నవతెలంగాణ దినపత్రిక సిబ్బంది పాల్గొన్నారు.