Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
సంచలనం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సైబరాబాద్ పోలీసులకు ఏసీబీ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్‌తో పాటు మరో ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ మొయినాబాద్ పోలీసులు వేసిన పిటిషన్‌ను మంగళవారం కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో రామచంద్ర భారతి, సింహయాజి స్వామి, నందకుమార్‌లు ముగ్గురు నిందితులు కాగా, నాలుగు, ఐదు, ఆరు, ఏడో నింతులుగా వరుసగా బీఎల్ సంతోశ్, కేరళకు చెందిన బీజేపీ నాయకుడు తుషార్, అదే కేరళకు చెందిన జగ్గుస్వామి, లాయర్ శ్రీనివాస్‌ల పేర్లను చేరుస్తూ మొయినాబాద్ పోలీసులు కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చటానికి జరిగిన కుట్రలో రామచంద్రభారతి, సంతోశ్ ల మధ్య పలుమార్లు వాట్సప్ చర్చ సాగిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేగాక, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చటానికి కూడా కుట్ర పన్నారని న్యాయస్థానానికి తెలిపినట్టు తెలిసింది. తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్‌లతో కూడా రామచంద్ర భారతి ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో వాట్సప్‌లో చర్చించిన ఆధారాలున్నాయని తెలిపారు. అయితే, ఇదంతా రాజకీయ కక్షతో చేస్తున్న వ్యవహారంగా ఈ నలుగురు తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. వీరి వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసు దర్యాప్తును నిజానికి శాంతి భద్రతలు, సిట్ విభాగాలకు చెందిన పోలీసులు దర్యాప్తు చేయకూడదనీ, దీనిని ఏసీబీ విభాగం దర్యాప్తు చేయాల్సిందని పేర్కొంటూ మొయినాబాద్ పోలీసులు వేసిన మెమోను కొట్టివేశారు. దీంతో ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాలు చేసే యోచనలో సైబరాబాద్ పోలీసులున్నట్టు తెలిసింది.