Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కళాశాల సెమినార్లలో ఐద్వా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి
నవతెలంగాణ-మిర్యాలగూడ/ధరూర్
హింస లేని సమాజాన్ని నిర్మించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అరుణజ్యోతి, మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. నవంబర్ 25 హింసా వ్యతిరేక దినోత్సవం నుంచి డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం వరకు ఐద్వా ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో మంగళవారం నల్లగొండ, జోగులాంబ గద్వాల జిల్లాల్లో జరిగిన సెమినార్లో వారు పాల్గొని మాట్లాడారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని కేఎల్ఎన్ మహిళా జూనియర్ కళాశాలలో జరిగిన సెమినార్లో మల్లు లక్ష్మి పాల్గొని మాట్లాడారు. సమాజంలో ఎక్కడో ఒకచోట మహిళపై దాడులు, లైంగికదాడులు, దౌర్జన్యాలు, వేధింపులు నిత్యకృత్యమయ్యాయన్నారు. పురుషులతో సమానంగా స్త్రీలు అని రంగాల్లోనూ రాణిస్తున్నప్పటికీ ఇంకా వివక్ష కొనసాగుతుందని విమర్శించారు. వావివరుసలు మరిచి మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారన్నారు. ప్రధానంగా డ్రగ్స్, మద్యం విచ్చలవిడిగా దొరుకుతూ ఉండటంతో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని చెప్పారు. బీహార్, అసోం, రాజస్థాన్, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాల్లో గహహింస రోజురోజుకూ పెచ్చురిల్లిపోతుందని ఆరోపించారు. సింగపూర్ మాదిరిగానే డ్రగ్స్, మద్య నిషేధం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హింస లేని సమాజ నిర్మాణం కోసం పాలకులు పాటుపడాలని కోరారు. ప్రవచనాల పేరిట కొందరు మహిళపై అనుచితవ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. వారిని టీవీలో చర్చలు పెట్టకుండా నిషేధించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధానకార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న దాడులు, లైంగికదాడులను నిరసిస్తూ బలమైన ఉద్యమాలు చేయాలని, అవసరమైతే తిరగబడాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు పోలబోయిన వరలక్ష్మి అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో గాదె పద్మమ్మ, కళాశాల కరస్పాండెంట్ హనుమంతరెడ్డి, ప్రిన్సిపాల్ నరేందర్‌రెడ్డి, అధ్యాపకులు సునీత, మాలతి, వసంత తదితరులు పాల్గొన్నారు. జోగులంబ గద్వాల జిల్లా గద్వాల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో నిర్వహించిన సెమినార్లో అరుణజ్యోతి పాల్గొని మాట్లాడారు. మహిళలపై హింస అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమైయ్యాయన్నారు. స్త్రీలు సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా హింస ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌లో 10వ తరగతి చదువుతున్న బాలికపై జరిగిన లైంగికదాడి ఘటన, వనపర్తిలో స్కూల్‌కి వెళ్తున్న చిన్నారిపై దారుణం, హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడికి పాల్పడటం లాంటి ఘటనలు బాలికలను విద్యకు దూరం చేసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హింసలేని సమాజ స్థాపనకు పాటుపడాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి నర్మద, జిల్లా నాయకురాలు, హస్టల్ విద్యార్థినులు పాల్గొన్నారు.