Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టులో సిట్ పిటిషన్‌పై నేడు విచారణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మెయినాబాద్ పోలీసుల మెమోను ఏసీబీ ప్రత్యేక కోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సిట్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను గురువారం విచారిస్తామని హైకోర్టు ప్రకటించింది. మెమోలోని ప్రతిపాదిన నిందితులు బీజేపీ నేత బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్‌లకు నోటీసులిచ్చింది. గురువారం తొలి కేసుగా విచారణ చేస్తామని జస్టిస్ నాగార్జున ప్రకటించారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సిట్ వేసిన అత్యవసర లంచ్‌మోషన్ అప్పీల్ పిటిషన్ తరఫున అడ్వొకేట్ జనరల్ బీ.ఎస్.ప్రసాద్ వాదనలు వినిపించారు. ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరిస్తోం దనీ, పోలీసులు దాఖలు చేసిన మెమోను తిరస్కరించ డం చట్ట వ్యతిరేకమన్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీ.ఎల్.సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్‌లను సిట్ అధికారులు నిందితులుగా చేర్చారనీ, ఈ మేరకు ఏసీబీ కోర్టుకు సిట్ మెమో రూపంలో సమాచారమిస్తే రద్దు చేసిందన్నారు. దర్యాప్తులో సేకరించిన కీలక వివరాల ఆధారంగానే సిట్ మెమో దాఖలు చేసిందన్నారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 8 కింద దర్యాప్తు చేసే అర్హత సిట్‌కు లేదని నిర్ణయిస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టు మెమోను కొట్టివేయడాన్ని రద్దు చేయాలని కోరారు. ఏసీబీ కోర్టు తన పరిధి మించి వ్యవహరించిందన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా సిట్ దర్యాప్తును అడ్డుకోలేదనీ, ఏ దశలోనూ దర్యాప్తును ఆపేందుకు కూడా ఇష్టపడలేదన్నారు. ఈ పరిస్థితుల్లో ఏసీబీ కోర్టు ఉత్తర్వులు చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. ఏసీబీ కోర్టు తీసుకున్న నిర్ణయం సరైందేనని నిందితుల తరఫు సీనియర్ న్యాయవాది ఎన్. రాంచందర్‌రావు వాదించారు. సిట్ అప్పీల్ కాపీల ప్రతులు ఇవ్వకుండా వాదనలు ఎలా చేయగలమని అడిగారు. అప్పీల్ కాపీలు ఇవ్వకుండా విచారణ చేయడానికి వీల్లేదన్నారు. ఈ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. సంతోష్ మరో ముగ్గురికి నోటీసులు ఇచ్చి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
తీన్మార్ మల్లన్న పాదయాత్రకు ఓకే
ఈ నెల 11 నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీన్మార్ మల్లన్న పాదయాత్ర నిర్వహించేందుకు అనుమతివ్వాలని ఆ జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదు. గుత్తికోయల వివాదంపై మాట్లాడరాదు. ఫారెస్ట్ ఆఫీసర్ హత్య ఘటనపై మాట్లాడరాదు. భూసేకరణ, పోడు వ్యవసాయ వివాద అంశాలపై మాట్లాడరాదు.. అని హైకోర్టు షరతులు విధించింది. పోలీసులు యాత్రకు అనుమతి ఇవ్వలేదని తీన్మార్ మల్లన్న వేసిన కేసులో ఈ ఉత్తర్వులను జారీ చేసింది.