Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్య పరిష్కారం కాకపోవడంతోనే చండ్రుగొండ ఘటన
- ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే పొత్తులు..
- మిగతా సమయాల్లో ప్రజా సమస్యల పరిష్కారంపై పోరు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-పాల్వంచ
సాగులో ఉన్న ప్రతి పోడు సాగుదారునికి హక్కు పత్రాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని లారీ అసోసియేషన్ హాల్లో సీపీఐ(ఎం) జిల్లా విస్తృతస్థాయి సమావేశం కొక్కెరపాటి పుల్లయ్య, కారం పుల్లయ్య అధ్యక్షతన జరిగింది. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు.అనంతరం జరిగిన సభలో తమ్మినేని మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికల సందర్భంగా వామపక్షాలు టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చిన సందర్భంలో పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలని సీపీఐ(ఎం) చేసిన డిమాండ్ మేరకు ప్రభుత్వం గ్రామాల్లో పోడు సర్వే నిర్వహించిందని గుర్తు చేశారు. సర్వే కూడా హామీ ఇచ్చినట్టుగా పూర్తిస్థాయిలో నిర్వహించలేదని, తక్షణమే సర్వేలను పూర్తి చేసి గ్రామసభలు తీర్మానం చేసిన పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి పోడు సమస్యను పరిష్కారం చేయకపోవడం వల్లనే చండ్రుగొండలో ఫారెస్ట్ అధికారిపై దాడి జరిగిందని, ఒక్క ఘటన ఆధారంగా మొత్తం వలస ఆదివాసీలకు చెందిన పోడు భూముల సర్వే నిలిపివేయడం అన్యాయమని తెలిపారు. గతంలో సాగు చేసుకుంటున్న వారి దగ్గర నుంచి ఫారెస్ట్ అధికారులు బలవంతంగా భూమిని గుంజుకొని మొక్కలు నాటడంతో తమ భూమిని కోల్పోయిన పోడు సాగుదారులందరినీ గుర్తించి ప్రభుత్వం తక్షణమే వారికి ఆ భూమిని అప్పగించాలని డిమాండ్ చేశారు. ధరణి సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామని ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించాలన్నారు. సొంత ఇంటి స్థలం ఉన్నవారికి ప్రభుత్వం ప్రకటించిన రూ.3లక్షలు నిర్మాణానికి సరిపోవని, ప్రభుత్వ నిర్మించే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకే రూ.5లక్షలు ఖర్చవుతుంటే రూ. 3లక్షలతో ఇంటి నిర్మాణం ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాల్లో పేదలు వేసుకున్న ఇండ్లకు పట్టాలిచ్చి పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఎన్నికల పొత్తులు వ్యవహారాల గురించి మాట్లాడతామని మిగతా సమయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాటాలు చేయడంలో వెనకాడబోమని స్పష్టం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి భవిష్యత్తు పోరాటాలకు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, మందలపు జ్యోతి, నర్సారెడ్డి, లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.