Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
- సీపీఐ చలో రాజ్‌భవన్ ఉద్రిక్తత
నవతెలంగాణ-బంజారాహిల్స్
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ చేపట్టిన చలో రాజ్‌భవన్ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడనప్పుడు గవర్నర్ వ్యవస్థ ఎందుకని ప్రశ్నిస్తూ, తెలంగాణ గవర్నర్ తమిళిసై తీరును నిరసిస్తూ బుధవారం చలో రాజ్‌భవన్‌కు సీపీఐ పిలుపునిచ్చింది. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీనియర్ నేత చాడ వెంకట్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు రాజ్‌భవన్ ముట్టడికి బయల్దేరారు. అయితే ముందుగానే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌తో పాటు రాజ్‌భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తోపులాట చోటు చేసుకుని ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో పలువురు నాయకులకు గాయాలయ్యాయి. అరెస్టయిన వారిని నగరంలోని ఏడు పోలీసు స్టేషన్లకు తరలించారు. అక్రమ అరెస్టులకు నిరసనగా సీపీఐ కార్యకర్తలు నాంపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట బైటాయించారు. అరెస్టయిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ, ఎన్.బాల మల్లేశ్, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, కళవేన శంకర్, బాల నర్సింహా, బాగం హేమంత్ రావు, ఇ.టి.నరసింహ, వివిధ జిల్లాల కార్యదర్శులు, ప్రజాసంఘాల నాయకులు ఉన్నారు. అరెస్టయిన నాయకులు, కార్యకర్తలను సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..బీజేపీ ప్రభుత్వం గవర్నర్లను అడ్డుపెట్టుకొని బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తున్నదని, తెలంగాణ, కేరళ, తమిళనాడులో గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు ఇందుకు అద్దం పడుతున్నదన్నారు అంతకు ముందు మీడియాతో కూనంనేని మాట్లాడుతూ.. గవర్నర్ వ్యవస్థ ప్రజాస్వామ్య విలువలను కాపాడేలా పనిచేసినట్టు ఇప్పటివరకు ఆధారాలు లేవని, గవర్నర్ వ్యవస్థతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదన్నారు. అందుకే ఈ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కవితపై కేసు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని, అసలు లిక్కర్ కేసు ఏంటో అర్థం కావడం లేదన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లపై దాడులు చేశారన్నారు. వాళ్లు బీజేపీిలో చేరగానే పునితులయ్యారని ఎద్దేవా చేశారు. షర్మిలకు మోడీ ఫోన్ చేసి పలకరించే సమయం ఉంది కానీ బీజేపీ రాష్ట్రాల్లో దాడులకు గురైన బాధితులను పరామర్శించే సమయం లేదా అని ప్రశ్నించారు.