Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
పవర్ ఐ లాండ్‌గా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దామని, న్యూయార్క్, లండన్, పారిస్ నగరాల్లో కరెంట్ పోవచ్చు గానీ, హైదరాబాద్‌లో మాత్రం ఒక క్షణం కూడా కరెంట్ పోదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచ చరిత్రలో సుప్రసిద్ధ నగరంగా హైదరాబాద్ కీర్తించబడిందని, చరిత్రలోనే కాదు భవిష్యత్‌లో కూడా హైదరాబాద్ నగరం చరిత్ర పుటల్లో నిలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాయదుర్గం మైండ్ స్పెస్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 31 కిలో మీటర్ల మెట్రో రెండో దశ విస్తరణ పనులకు మంత్రులతో కలిసి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం రాజేంద్రనగర్‌లోని పోలీస్ అకాడమీ పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. దేశంలో మొదటిసారిగా విద్యుత్ వెలుగులు చూసిన చరిత్ర హైదరాబాద్‌దే అన్నారు. 1912లోనే హైదరాబాద్‌కు ఎలక్ట్రిసిటీ వచ్చిందని, అప్పటికీ దేశంలోని పెద్ద నగరాల్లో కూడా కరెంట్ లేదన్నారు. అప్పటి మద్రాస్, ఇప్పటి చెన్నైలో 1927లో కరెంట్ వచ్చిందన్నారు. సమైక్య రాష్ట్రంలో పరిశ్రమల్లో విద్యుత్ సమస్యలు తలెత్తి ఉత్పత్తులు నిలిచిపోయిన సందర్భంలో పారిశ్రామిక వేత్తలు ఇందిరాపార్కు వద్ద ధర్నాలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం అలాంటి సమస్యలు లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో గతంలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులుపడ్డారని, తెలంగాణ ఏర్పడ్డాక తాగు నీటి కష్టాలు తీర్చామని తెలిపారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ప్రపంచంలోనే పేరుగాంచిన పరిశ్రమలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను పెట్టాయని తెలిపారు. నగరంలో పెద్దఎత్తున అండర్ బైపాస్‌లు, ప్లైఓవర్ల నిర్మాణాలు చేపట్టడంతో ట్రాఫిక్ సమస్య కొంత మేర తీరిందన్నారు. అయినప్పటికీ ట్రాఫిక్ సమస్యలు నియంత్రించేందుకు మెట్రో విస్తరణ అవసరం ఎంతైనా ఉందన్నారు. భవిష్యత్తులో ఔటర్ రింగురోడ్డు చుట్టూ మెట్రోను విస్తరిస్తామని కేసీఆర్ ప్రకటించారు. మెట్రోలో నిత్యం నాలుగున్నర లక్షల మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు. నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు మెట్రో చాలా అవసరమన్నారు. ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ వస్తే 70 వేల మంది ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేనప్పటికీ వంద శాతం రాష్ట్ర నిధులతో రూ. 6,250 కోట్లతో 31 కి.మీ మెట్రో విస్తరణ పనులు చేపడుతున్నట్టు వివరిం చారు. హెచ్ఎండీ, జీఎంఆర్ మెట్రో విస్తరణ పనులకు తమ వంతుగా ప్రభుత్వానికి నిధులివ్వడం అభినందనీయమన్నారు. 'హైదరాబాద్ చుట్టూ కూడా మెట్రో రైలు రావాల్సిన అవసరం ఉందని, కేంద్ర సహకా రం ఉన్నా లేకపోయినా అది సాధించుకొని ప్రపంచం అబ్బురపడే విధంగా విశ్వ నగరంగా మార్చుతామని, ఇది తన బాధ్యతని సీఎం దీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో కాలుష్యం పెరుగుతున్న తరుణంలో హైదరాబాద్ నగరానికి బెస్ట్ గ్రీన్ సిటీ అవార్డు రావడం గర్వించదగ్గ విషయమన్నారు. హైదరాబాద్‌లో ఎంత చేసినా తక్కువేనని మురుగు నీటి వ్యవస్థను మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. జనాభా పెరుగుదల అవసరాలకు అనుగుణంగా మున్సిపల్ శాఖ భవిష్యత్ అవసరాలను అంచనా వేయాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సబితాఇ ంద్రారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యులు కేశవరావు, ఎంపీలు నామా నాగేశ్వర రావు, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, మేయర్లు తదితరులు పాల్గొన్నారు.
ఉర్ధూ మీడియంలో టీచర్ పోస్టుల నియామకంపై ప్లకార్డుల ప్రదర్శన
ఉర్దూ మీడియంలో టీచర్ పోస్టుల నియామకంపై సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ముస్లిం నిరుద్యోగ మహిళలు సీఎం సభలో నిరసన వ్యక్తం చేశారు. 2017లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరసనకారులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో నిరసనకారులు ఆందోళన చేయడంతో కొంత సమయం సభ ప్రాంగణంలో గందరగోళ వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు నిరసనకారుల నుంచి ప్లకార్డులను లాక్కొని, వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.